అసలు సిసలు గాంధేయవాది.. మీనాక్షి నటరాజన్

అసలు సిసలు గాంధేయవాది.. మీనాక్షి నటరాజన్
  • సాదాసీదాగా ట్రైన్​లో హైదరాబాద్ రాక
  • హంగు, ఆర్భాటాలకు దూరం.. బొకేలు, ఫ్లెక్సీలకు నో 
  • నేతలు బ్యాగ్​లు మోసి ఆత్మగౌరవం కోల్పోవద్దని హితవు 

హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ నుంచి కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ చార్జ్ వస్తున్నారంటే హైదరాబాద్ గాంధీభవన్ లో హంగూ, ఆర్భాటాలతో పార్టీ నేతలు ఎంతో హంగామా చేసేవారు. కానీ, శుక్రవారం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ చాలా సాదాసీదాగా తన బ్యాగును సైతం తానే వీపున వేసుకుని ట్రైన్ లో రావడం చూసి అందరూ సర్ ప్రైజ్ అయ్యారు. 

పార్టీ పరంగా ఎంతో కీలకమైన స్థానంలో ఉన్నప్పటికీ.. హంగు, ఆర్భాటాలకు దూరంగా ఉన్న ఆమె సింప్లిసిటీని చూసి అందరూ ముగ్ధులయ్యారు. వీపున ఓ బ్యాగ్, భుజాన ఓ క్లాత్ బ్యాగ్ వేసుకుని, కండ్ల అద్దాలు, సాదాసీదా డ్రెస్ ధరించిన మీనాక్షి శుక్రవారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ లో దిగారు. ఆమెకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఇతర నేతలు స్వాగతం పలికారు. 

అక్కడ నేతలను పలకరించిన తర్వాత ఆమె ఒక్కరే నేరుగా తాను సొంత డబ్బుతో బుక్ చేసుకున్న సోమాజిగూడలోని దిల్ కుశ గెస్ట్ హౌస్ కు వెళ్లారు. అక్కడ ఆమెను సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొన్నం, కొండా సురేఖ, ఇతర నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. నేతలు బొకేలు ఇచ్చే ప్రయత్నం చేయగా సున్నితంగా తిరస్కరించారు. అనంతరం కార్యకర్తల నుంచి వినతిపత్రాలు తీసుకున్న ఆమె గాంధీభవన్ కు వచ్చారు. 

అక్కడ తన ఫొటోతో ఉన్న ఫ్లెక్సీని, నేతల హడావుడిని చూసి చిరాకు పడ్డారు. తర్వాత కార్యకర్తలను, మీడియా ప్రతినిధులను కలిసి, పార్టీ నేతలతో సమావేశమయ్యారు. మీటింగ్ తర్వాత నేరుగా రైల్వే స్టేషన్ కు వెళ్లి తిరిగి ఢిల్లీకి బయలుదేరారు. తన కోసం ఎవరూ స్టేషన్ కు రావద్దని, తన బ్యాగ్ లు మోసి ఆత్మగౌరవం కోల్పోవద్దని పీసీసీ సమావేశంలో ఆమె సూచించడం, తనకు బలం లేకపోతే అప్పుడు సహాయం తీసుకుంటాననడం కూడా పార్టీ నేతలను ఆశ్చర్యపర్చింది. 

అసలు సిసలు గాంధేయవాది..  

.మధ్యప్రదేశ్​లోని ఉజ్జయినికి చెందిన మీనాక్షి నటరాజన్1999–2002 మధ్య ఎన్ఎస్ యూఐ నేషనల్ ప్రెసిడెంట్ గా పని చేశారు. ప్రస్తుతం రాజీవ్ గాంధీ పంచాయతీ సంఘటన్ జాతీయ అధ్యక్షురాలిగా ఉన్నారు. 2009లో మధ్యప్రదేశ్ లోని మందసౌర్ ఎంపీగా ఎన్నికయ్యారు. 2022లో తెలంగాణ భూదానోద్యమానికి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఆమె భూదాన్ పోచంపల్లిలో పర్యటించారు. 

అయితే, సాదాసీదాగా ఉండే ఆమె అత్యవసర మీటింగ్ లు, అగ్రనేతల నుంచి అత్యవసర పిలుపులు వస్తే తప్ప విమానాల్లో ప్రయాణించరు. వెంట ఎప్పుడూ ఒక జత డ్రెస్ తెచ్చుకుంటారు. మామూలు భోజనమే చేస్తారు. నాన్ వెజ్ కు దూరం. గాంధేయ సిద్ధాంతం ఆచరణలో భాగంగా ప్రతి శనివారం మౌనవ్రతం పాటిస్తారు. బొకేలు, ఫ్లెక్సీలు, కాన్వాయ్ లకు దూరం. 

ఎక్కడికెళ్లినా ప్రభుత్వ గెస్ట్ హౌస్ లోనే మాజీ ఎంపీ హోదాలో సొంత ఖర్చుతో బస చేస్తారు. సమావేశాలకు సమయ పాలన కచ్చితంగా పాటిస్తారు. ఇతర గెస్టుల కోసం ఎదురుచూడరు. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం ఆమె పెళ్లి కూడా చేసుకోలేదని చెప్తారు.