
= అంతర్గత విషయాలు బయట మాట్లాడొద్దు
= నా పనితీరు నచ్చకుంటే రాహుల్ కు ఫిర్యాదు చేయండి
= నివేదికలు ఇవ్వకపోయినా పని తీరు తెలిసిపోతుంది
= కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్
హైదరాబాద్: పార్టీ అంతర్గత విషయాలపై బయట చర్చ పెట్టొద్దని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ సూచించారు. అంతర్గత విషయాలపై బయట చర్చ పెట్టిన వారిపై చర్యలు తప్పవని అన్నారు. ఇవాళ గాంధీభవన్‌లో నిర్వహించిన పీసీసీ అనుబంధ సంఘాల సమావేశంలో ఆమె మాట్లాడారు. నివేదికలు ఇవ్వకపోయినా వారి పనితీరు ఏంటనేది తమకు తెలుస్తుందని అన్నారు. పార్టీ కోసం పనిచేస్తున్నది ఎవరు..? పనిచేసినట్టు యాక్టింగ్ చేస్తున్నది ఎవరనేది కూడా తెలుస్తుందంటూ చురకలు అంటించారు.
పార్టీ కోసం సమయం ఇవ్వండి.. పార్టీ అంతర్గత విషయాలు బయట చర్చ చేయకండి.. అలాంటి వారిపై చర్యలు తప్పవు అని హెచ్చరించారు. తన పని తీరు నచ్చకపోయినా.. రాహుల్, సోనియాకు ఫిర్యాదు చేయొచ్చు అన్నారు. ఐదు రోజుల క్రితం మధ్య ప్రదేశ్ నుంచి రైలులో హైదరాబాద్‌కు వచ్చిన మీనాక్షి నటరాజన్.. పార్టీని సెట్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. సింప్లిసిటీకి ప్రాధాన్యం ఇస్తూ.. అంతర్గతంగా ఉన్న సమస్యలకు పరిష్కారం చూపుతూ ఆమె సమావేశాలు సాగుతున్నాయి.
తన దృష్టిలో పడాల్సిన అవసరం లేదంటూనే.. పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేయాలని నేతలకు సూచిస్తున్నారు. ఇవాళ ఉదయం పీసీసీ చీఫ్మహేశ్ కుమార్ గౌడ్‌తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన మీనాక్షి నటరాజన్ ఎమ్మెల్సీ అభ్యర్థులపై చర్చించారు. అనంతరం పార్ట అనుబంధ సంఘాల నాయకులతో మాట్లాడారు. తర్వాత ఆదిలాబాద్ జిల్లా నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక అంశాలను ప్రస్తావిస్తూనే పలువురికి చురకలు అంటించారు.