మీర్​పేట మర్డర్​ కేసులో కీలక అప్డేట్.. గ్యాస్‌ స్టౌపై రక్తపు మరకలు, మాంసం ముక్క

మీర్​పేట మర్డర్​ కేసులో కీలక  అప్డేట్..  గ్యాస్‌ స్టౌపై రక్తపు మరకలు, మాంసం ముక్క
  • మీర్​పేట మర్డర్​ కేసులో కీలక ఆధారాలు లభ్యం
  • రెండింటినీ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపిన క్లూస్‌ టీమ్‌
  • బాత్‌‌రూమ్‌‌ నుంచే డ్రైనేజీలోకి వెంకటమాధవి శరీర భాగాలు పంపినట్టు గుర్తింపు

ఎల్బీనగర్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీర్ పేట హత్య కేసులో పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. కిచెన్​లో గ్యాస్‌‌ స్టవ్‌‌పై వెంకటమాధవి శరీరానికి సంబంధించిన ఒక టిష్యూ, రక్తపు మరక లభ్యమయ్యాయి. ఆ రెండింటినీ క్లూస్‌‌ టీమ్‌‌ ఫోరెన్సిక్‌‌ ల్యాబ్‌‌కు పంపించింది. ఈ రెండు ఆధారాలతో పోలీసులు దర్యాప్తులో ముందుకెళ్తున్నారు. గురుమూర్తి తన భార్య వెంకటమాధవిని హత్య చేసిన అనంతరం డెడ్‌‌బాడీని బాత్‌‌రూమ్‌‌లోకి తీసుకెళ్లాడని పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని ముక్కలుగా కట్‌‌ చేసి 25 లీటర్లు సామర్థ్యం గల పెయింట్‌‌ బకెట్‌‌లో వేసినట్టు ఆధారాలు సేకరించారు. మాంసం ముద్దలు కరిగిపోయేందుకు పొటాషియం హైడ్రెడ్‌‌, వాటర్‌‌‌‌ హీటర్‌‌‌‌ను వినియోగించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. 

కరిగిపోయిన శరీర భాగాలను బాత్‌‌రూమ్‌‌ నుంచే డ్రైనేజీలోకి పంపించినట్టు సమాచారం. ఆ తరువాత మిగిలిపోయిన ఎముకలను కమర్షియల్‌‌ గ్యాస్‌‌ స్టవ్‌‌పై కాల్చి.. బాగా కాలిన ఎముకలను రోట్లో వేసి పొడిగా మార్చి.. ఆ పొడిని కూడా బాత్‌‌రూమ్‌‌ నుంచే డ్రైనేజీలోకి పంపినట్టు పోలీసులు గుర్తించారు. అలాగే, ఈ కేసులో ముందుగా కంటికి కనిపించే ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో పోలీసులు లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి దర్యాప్తు చేస్తున్నారు. ఇన్ఫ్రా-రెడ్ రేడియేషన్స్ ద్వారా ఆధారాలు సేకరించి ఇప్పటికే ఫోరెన్సిక్ టెస్ట్ కు పంపిన పోలీసులకు ఆ రిపోర్ట్ అందినట్టు తెలిసింది. అదే సమయంలో ఆమె పిల్లల నుంచి శాంపిల్ ​తీసుకొని డీఎన్ఏ టెస్ట్ చేసినట్టు సమాచారం. 

పోలీసులకు సహకరించని గురుమూర్తి..

కేసు విచారణకు నిందితుడు గురుమూర్తి సహకరించడం లేదని తెలుస్తోంది. ముందుగా తానే హత్య చేశానని స్టేట్మెంట్ ఇవ్వడంతో ఎల్బీనగర్ ఎస్ఓటీ పీఎస్ లో పోలీసులు విచారిస్తున్నారు. అయితే, ప్రస్తుతం అతడు విచారణకు సహకరించడం లేదని తెలుస్తోంది. ఎంక్వైరీ సమయంలో తన ఆరోగ్యం బాగాలేనట్టు మొండిగా వ్యవహరిస్తున్నాడని, ఉన్నట్టుండి పడిపోయినట్టు చేస్తున్నాడని సమాచారం. దీంతో పోలీసులు టెక్నికల్, ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ఆధారంగా కేసును ఛేదించే దిశగా దర్యాప్తు చేస్తున్నారు.