భర్తను చంపి లవర్​తో విహారయాత్ర

భర్తను చంపి లవర్​తో విహారయాత్ర
  • మీరట్ మర్చంట్ నేవీ అధికారి హత్య కేసులో దారుణం
  • హోలీ వేడుకల్లో చిందులు వేసిన నిందితులు
  • హత్య చేశాక ప్రియుడితో కలిసి హిమాచల్​కు ముస్కాన్

న్యూఢిల్లీ: భార్య, ఆమె ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురైన మర్చంట్ నేవీ ఆఫీసర్  సౌరభ్  రాజ్ పుత్ (29) మర్డర్  కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 4న సౌరభ్ ను చంపిన తర్వాత ఆయన భార్య ముస్కాన్  రస్తోగీ, ప్రియుడు సాహిల్  శుక్లా హిమాచల్  ప్రదేశ్ కు విహారయాత్రకు వెళ్లారు. మనాలీలో స్నోఫాల్ ను ఎంజాయ్  చేస్తూ గడిపారు. అక్కడ ఓ హోలీ పార్టీలో పాల్గొని డాన్స్  చేశారు. తర్వాత ఈ నెల 10న కులూ జిల్లాలోని కసోల్ కు వెళ్లారు. అక్కడ ట్యాక్సీ తీసుకొని ఓ హోటల్ కు వెళ్లారు. రూమ్  బుక్  చేసుకొని ఆరు రోజుల పాటు ఉన్నారు. 

ఈనెల 16న చెక్ ఔట్  అయ్యారు. అయితే, నిందితులు హోటల్ లో వింతగా ప్రవర్తించారని, రూమ్  నుంచి ఒక్కసారి మాత్రమే బయటకు వచ్చారని హోటల్  సిబ్బంది తెలిపారు. ‘‘సాధారణంగా, పర్యాటకులు ఇక్కడికి వచ్చినపుడు సైట్ సీయింగ్ కు వెళ్తారు. కానీ.. సాహిల్, ముస్కాన్  ఆరు రోజుల పాటు గదిలోనే ఉన్నారు. ఈ నెల 16న హోటల్  నుంచి వారు చెక్ ఔట్ అయ్యారు” అని హోటల్  సిబ్బంది వెల్లడించారు.

సాహిల్  రోజూ 2 బాటిళ్ల మద్యం తాగేవాడు

సాహిల్  రోజూ 2 బాటిళ్ల మద్యం తాగేవాడని అతడిని, ముస్కాన్ ను ట్యాక్సీలో తీసుకెళ్లిన క్యాబ్  డ్రైవర్  అజాబ్  సింగ్  తెలిపాడు. ‘‘వారి ప్రవర్తన చూస్తే మర్డర్  చేసినట్లు అనిపించలేదు. వారు నా క్యాబ్ లో ఉన్నంతసేపు చాలా తక్కువగా మాట్లాడుకున్నారు. జర్నీలో ముస్కాన్ కు ఆమె తల్లి నుంచి రెండుసార్లే కాల్స్  వచ్చాయి. ఇక, ముస్కాన్  కూడా రోజూ మూడు బీర్లు తాగేది” అని డ్రైవర్  వివరించాడు.

హోలీ వీడియో వైరల్

నిందితులు ముస్కాన్, సాహిల్  ఓ హోలీ పార్టీలో డాన్స్  చేసిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. అయితే, ఆ వీడియోను ఎక్కడ తీశారో తెలియలేదు. అలాగే, కసోల్​లో సాహిల్  బర్త్ డే జరుపుకున్నాడు. ఆ సమయంలో సాహిల్ కు ముస్తాన్  కేకు తినిపించి ముద్దుపెట్టిన వీడియో కూడా వెలుగులోకి వచ్చింది.