
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో మాజీ మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సౌరభ్ రాజ్‌పుత్‌ను అతని భార్య, ఆమె ప్రియుడు హత్య చేసి, ముక్కలుగా నరికి డ్రమ్ లో సిమెంట్తో మూసివేసిన విషయం తెలిసిందే. పోలీసుల విచారణలో నిందితులు ముస్కాన్ రస్తోగి ,సాహిల్ శుక్లా భయంకర నిజాలు చెప్పారు. హత్యకు ముందు మత్తు మందుకోసం గూగుల్ సెర్చ్ చేసినట్లు నిందితులు తెలిపారు.
మత్తుమందు కలిపిన లౌకీ కే కోఫ్తే
రాజ్ పుత్ కు లైకీ కే కోఫ్తే అంటే చాలా ఇష్టం. ఈ వంటకాన్ని తీసుకొని భార్య ముస్కాన్, అతని కుమార్తెను కలిసేందుకు ఇంటికి వచ్చాడు. సంవత్సర కాలంగా భర్తను చంపాలని ఎదురు చూస్తున్న ముస్కాన్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వంటకాన్ని వేడి చేస్తానని.. మత్తు మందు కలిపింది. సౌరభ్ అపస్మారక స్థితిలోకి జారుకోగానే.. ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాను రప్పించి దారుణానికి పాల్పడింది. నిద్రపోతున్న సౌరభ్ పై కత్తితో దాడి చేసి ప్రాణం పోయేవరకు పొడిచి పొడిచి చంపారని పోలీసులు తెలిపారు.
మందుల పేర్ల కోసం Googleలో ..
ముస్కాన్ ఎటువంటి అనుమానం రాని విధంగా నిద్ర మాత్రలు, మాదకద్రవ్యాలను కొనుగోలు చేయాలని చూసిందని పోలీసులు విచారణలో తేలింది. డిప్రెషన్‌తో బాధపడుతున్నానని చెప్పి శారదా రోడ్‌లోని ఒక వైద్యుడిని సందర్శించి నిద్ర మాత్రలు కోరింది. వైద్యుడు తన కుట్రకు సాయపడే నిద్ర మాత్రలు సూచించకపోవడంతో మందుల పేర్ల కోసం ముస్కాన్ గూగుల్‌లో వెతికింది. ప్రిస్క్రిప్షన్‌లో మరిన్ని పేర్లు జోడించిన తర్వాత ఓ ఫార్మసీ నుంచి నిద్ర మాత్రలు, ప్రాణాంతకమైన ,మత్తుమందుల కాక్‌టెయిల్‌ను కొనుగోలు చేశారు. రాజ్ ఫూత్ ను చంపేందుకు ఖరీదైన కత్తులు, రేజర్లు, పాలిథిన్ సంచులు కొనుగోలు చేశారని పోలీసులు వెల్లడించారు.