![కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల ఎఫెక్ట్.. హైదరాబాద్ మీసేవా సెంటర్లు కిటకిట](https://static.v6velugu.com/uploads/2025/02/meeseva-centers-are-crowded-in-hyderabad-and-these-are-a-must-have-for-ration-card-applications_KCV7n3XOqh.jpg)
హైదరాబాద్ నగర వ్యాప్తంగా మీ సేవా సెంటర్లు జనంతో కిక్కిరిసిపోతున్నాయి. కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తుండటంతో సేవా సెంటర్స్ వద్ద జనం భారీగా ఎగబడుతున్నారు. రద్దీ పెరగడంతో గేట్లు మూసివేసి క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. కొన్ని సెంటర్ల వద్ద పది పది మందిని లోపలికి అనుమతిస్తున్నారు మీ సేవా నిర్వహకులు.
రేషన్ కార్డుల అప్లికేషన్ల కోసం జనం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. అప్లికేషన్ ఫామ్ తీసుకున్న తర్వాత నాలుగు గంటల సేపు వెయిట్ చేయించి లోపలికి పిలుస్తున్నారని, ఆ తర్వాత ఒక్కొక్కరిని కౌంటర్ వద్దకు పంపుతున్నారని దరఖాస్తు దారులు అంటున్నారు.
రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోవడానికి తప్పనిసరిగా ఇంటి సభ్యులందరి వివరాలు ఇవ్వాలని మీ సేవ నిర్వాహకులు తెలిపారు. అప్లికేషన్ ఫామ్ తో పాటు ఇంటి సభ్యులందరి ఆధార్ కార్డు జిరాక్స్ లు, కరెంట్ బిల్, గ్యాస్ బిల్ తప్పనిసరి అని చెప్పడంతో జిరాక్స్ ల కోసం జనం ఎగబడుతున్నారు. రేషన్ కార్డు అప్లికేషన్ ఫీజును 50 రూపాయలుగా నిర్ణయించింది ప్రభుత్వం.
ALSO READ | మీసేవలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు
ఇక దరఖాస్తు చేసుకోవడానికి నాలుగు గంటల నుంచి వెయిట్ చేస్తున్నా లోపలికి అనుమతించట్లేదని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు. అయితే చాలా వరకు కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన లో అప్లై చేసుకున్నారు నగర వాసులు. లిస్టులో పేరు రాకపోవడంతో మళ్ళీ మీ సేవ సెంటర్స్ లో అప్లై చేసుకుంటున్నారు.
మీసేవా సెంటర్ల వద్ద రేషన్ కార్డుల రష్ ఎక్కువగా ఉండటంతో.. ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్స్ ఇలా ఇతర సర్వీసుల కోసం వచ్చే వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.