
క్రీడలను కెరీర్‌గా ఎంచుకున్న ప్రతీ ఒక్కరూ ఒలింపిక్స్‌లో పోటీ పడాలని కోరుకుంటారు. జీవితంలో ఒక్కసారైనా విశ్వక్రీడల్లో పాల్గొంటే తమ జన్మ ధన్యం అయిందని అనుకుంటారు. అలాంటిది ఒక అథ్లెట్ పది ఒలింపిక్స్‌లో పాల్గొనడం అంటే కలలోనే జరుగుతుందని అనుకుంటాం. కానీ, జార్జియాకు చెందిన షూటర్ నినో సలుక్వాడ్జె ఈ అద్భుతాన్ని నిజం చేసింది. అత్యధికంగా పది ఒలింపిక్స్‌లో పోటీ పడ్డ తొలి మహిళగా చరిత్ర సృష్టించింది.
1988లో 19 ఏండ్ల వయసులో సోవియెట్ యూనియన్ నుంచి విశ్వక్రీడల్లో అరంగేట్రం చేసిన ఆమె ఇప్పుడు 55 ఏండ్ల వయసులో పదోసారి బరిలోకి దిగింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో పోటీ పడ్డ నినో క్వాలిఫికేషన్‌లో 38వ ప్లేస్‌లో నిలిచి ఫైనల్ చేరలేకపోయింది. 2016లో పిస్టల్ షూటర్ అయిన తన కొడుకు సోన్‌తో కలిసి బరిలోకి దిగింది. దాంతో ఒలింపిక్స్‌లో పోటీపడ్డ తొలి తల్లీకొడుకుగా ఈ ఇద్దరు అరుదైన రికార్డు సాధించారు.