
17 ఏళ్ల వయసులో 'ప్రపంచంలోనే వేగవంతమైన మానవ కాలిక్యులేటర్'గా రికార్డు సృష్టించి, ఇదివరకే అరుదైన ఘనత సాధించిన గణిత మేధావి జొన్నలగడ్డ నీలకంఠ భానుప్రకాశ్... తాజాగా మరో రికార్డును క్రియేట్ చేశారు. ఫోర్బ్స్ పత్రిక విడుదల చేసిన '30 అండర్ 30 ఏషియా క్లాస్ ఆఫ్ 2022' జాబితాలో చోటు సాధించారు. ఆటుపోట్లను ఎదుర్కొని ముందుకు సాగి, విజయం సాధించే నేటి యువతను కొనియాడుతూ రిలీజ్ చేసిన ఈ లిస్ట్ లో భాను ప్రకాశ్ స్థానం సంపాదించడం రాష్ట్రానికి, దేశానికి కూడా గర్వ కారణంగా చెప్పవచ్చు. 2020లో 'ఎక్స్‌ప్లోరింగ్ ఇన్‌ఫినిటీస్' అనే కమర్షియల్ ఎడ్‌టెక్ స్టార్టప్‌ను ప్రారంభించిన భాను ప్రకాశ్.. ప్రపంచ విద్యార్థుల్లో గణితంపై భయాన్ని పోగొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
భాను ప్రకాశ్ గురించి మరిన్ని విషయాలు..
మామూలుగా చాలా మంది విద్యార్థులు భయపడే సబ్జెక్టు గణితం. అన్ని అంశాలలో ముందున్నా ఒక్క మ్యాథ్స్ దగ్గరికొచ్చేసరికి వణికి పోతుంటారు. కానీ భాను ప్రకాశ్ మాత్రం అందుకు వ్యతిరేకం. లెక్కలతో ఆట ఆడేసుకుంటారు. అలాంటి జిమ్మిక్కు, మ్యాజిక్కులను ఇతరులకూ నేర్పించాలనే సదుద్దేశంతో ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఆయన వ్యక్తిగత విషయాలకొస్తే,...
- భాను ప్రకాశ్1999, అక్టోబర్ 13న శ్రీనివాస్, హేమ శివపార్వతి దంపతులకు జన్మించారు. చిన్నతనం నుండే భాను ప్రకాశ్ కు గ్రహణ శక్తి ఎక్కువగా ఉండడంతో వార్తాపత్రికల్లో బొమ్మలు, ఆసక్తికరమైన కథనాలను రెండు, మూడు రోజుల తర్వాత అడిగినా చెప్పేంత జ్ఞానాన్ని సంపాదించారు. మాటలు కూడా రాని వయసులోనే వరల్డ్ మ్యాప్ ఒక్కసారి చూపించి, ఏ దేశం ఎక్కడుందో అడిగితే వేలుపెట్టి చూపించేవాడంటున్నారు ఆయన తల్లిదండ్రులు.
అప్పట్నుంచే మేధావి...
- ఐదేళ్ల వయసులో ఓ ప్రమాదానికి గురి కాగా... పలు శస్త్ర చికిత్సలు జరగడం వల్ల సంవత్సరం పాటు పాఠశాలకు దూరమయ్యారు. ఆ సమయంలో తల్లిదండ్రులు మెంటల్ కాలిక్యులేషన్స్‌కు సంబంధించిన పజిల్స్‌ను బాగా అలవాటు చేశారు. వాటిని భానుప్రకాశ్ చకచకా పరిష్కరించి ఔరా అనిపించేవారు. అనంతరం పాఠశాలలోనూ తన చురుకుదనంతో వేగంగా, సులభంగా లెక్కలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచేవారు. భాను తల్లిదండ్రులు అతన్ని చెన్నైలోని సిప్ అకాడమీ ప్రైవేట్ లిమిటెడ్‌లో జాయిన్ చేశారు. అక్కడ 5 - 15 సంవత్సరాల పిల్లలకు పెన్ను, పేపర్ లేకుండా గణితంలోని సమస్యలను పరిష్కరించడానికి సులువైన పద్ధతులు నేర్పించేవారు. అలా భానుప్రకాశ్ మెంటల్ మ్యాథ్స్ కాలిక్యులేషన్స్‌లో నైపుణ్యం సాధించారు. ఆ తర్వాత అనేక కాంపిటీషన్లలోనూ పాల్గొని తన టాలెంట్ ను నిరూపించుకునేవారు.
శకుంతలా దేవి రికార్డులూ బద్దలు..
- బంధువు సలహాతో వరల్డ్ రికార్డ్స్‌కు, లిమ్కా రికార్డులకు మెయిల్ చేశారు భాను ప్రకాశ్. అలా 2015లో ఏడు, 2016లో 21 లిమ్కా రికార్డులు సాధించారు. 2017లో డిగ్రీ కోసం ఢిల్లీలో సెయింట్ స్టీఫెన్ కాలేజీలో చేరి, అదే సంవత్సరం మరో 22 లిమ్కా రికార్డులు సాధించారు. నాలుగు వరల్డ్ రికార్డులు, 50 లిమ్కా రికార్డులు సాధించి శకుంతలా దేవి, అమెరికాకు చెందిన స్కార్ట్ ఫ్లాన్స్‌బర్డ్ రికార్డులను భానుప్రకాశ్ బద్దలు కొట్టారు. 2020, ఆగస్టు 15 లండన్‌లో జరిగిన మైండ్ స్పోర్ట్ ఒలంపియాడ్‌లో మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో గోల్డ్ మెడల్‌ను సాధించి 'వరల్డ్ ఫాస్టెస్ట్ హ్యూమన్ కాలిక్యులేటర్' టైటిల్‌ను భాను ప్రకాశ్ సొంతం చేసుకున్నారు. ఒక్కోసారి కాంపిటీషన్లలో అతని వేగానికి న్యాయమూర్తులు సైతం ఆశ్చర్యపోయేవారు. అతను చెప్పే సమాధానాలను నిర్ధారించుకోవడానికే వారికి ఎక్కువ సమయం పట్టేది.
2017లో స్టార్టప్‌ను ప్రారంభించి వివిధ దేశాల విద్యార్థులకు, భాను ప్రకాశ్ గణితంలో సులభమైన పద్ధతులు నేర్పిస్తున్నారు. అలా 50 వేల మంది పిల్లలకు పైగా గణితంలో సులువైన మార్గాలను నేర్పించారు. కాలిక్యులేటర్‌లో వచ్చిన సమాధానాన్ని వాడడం కాదు, మన మెదడుతో కాలిక్యులేషన్ చేయడమే తన గోల్ అని తన టార్గెట్ ను బయటపెట్టారు. గణితంలోని ఆనందాన్ని అందరికీ అందివ్వాలనే ఆశయంతో తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ-శాట్‌లో విద్యార్థులకు సులభమైన చిట్కాలతో గణిత పాఠాలు సైతం బోధిస్తూ భాను ప్రకాశ్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
మరిన్ని వార్తల కోసం..