చంద్రయాన్ 3 సక్సెస్ తర్వాత ఇస్రో.. సూర్యునిపై దృష్టి పెట్టింది. శనివారం(2023 సెప్టెంబర్ 2న) ఆదిత్య ఎల్ 1 ను విజయవంతంగా ప్రయోగించింది. ప్రతిభావంతులైన ఇస్రో శాస్త్రవేత్తల కృషితో ఆదిత్య ఎల్ 1 సోలార్ మిషన్.. PSLV-C57 రాకెట్ ద్వారా అంతరిక్షంలో దూసుకెళ్లింది. ఈ ప్రాజెక్టు విజయవంతం కావడంలో ఇస్రో బృందం చేసిన కృషి గొప్పది.. ఆ బృందంలోంచి ఓ పేరు ఇప్పుడు తరుచుగా వినబడుతోంది..నిగర్ షాజీ..
నిగర్ షాజీ ఎవరు?
తమిళనాడులోని తెన్కాసికి చెందిన ప్రముఖ మహిళా శాస్త్రవేత్త నిగర్ షాజీ (59).. ఆదిత్య ఎల్-1 మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించి ఈరోజు చరిత్ర సృష్టించారు. ఆమె సూర్యుని అధ్యయనం చేయడానికి ఉద్దేశించిన భారతదేశపు తొలి అంతరిక్ష ఆధారిత ప్రయత్నానికి ప్రాజెక్ట్ డైరెక్టర్.. అంటే ఆదిత్య ఎల్ 1 ప్రాజెక్టు డైరెక్టర్..
షాజీ మూలాలు తమిళనాడులోని సెంగోట్టై పట్టణంలో ఉన్నాయి.. అక్కడ రైతు కుటుంబంలో షేక్ మీరాన్, సైటూన్ బివికి జన్మించారు. నిగర్ చిన్న వయస్సులోనే తన ప్రతిభను చాటుకుంది. ప్రాథమిక విద్యను సెంగోట్టైలోని SRM బాలికల పాఠశాలలో పూర్తి చేసింది. తర్వాత మధురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. రాంచీలోని BIT నుంచి ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్‌లో మాస్టర్స్ చేసింది.
నిగర్ ఇస్రో కేరీర్..
1987లో ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(SHAAR)లో చేరడంతో అంతరిక్ష పరిశోధన ప్రపంచంలోకి నిగర్ ప్రయాణం ప్రారంభమైంది. అంకిత భావం, నైపుణ్యం ఆమెను బెంగుళూరులోని యూఆర్ రావు శాలిలైట్ సెంటర్ కునడిపించింది. అక్కడ వివిధ హోదాల్లో పనిచేసిన నిగర్.. ఆదిత్య ఎల్ 1 ప్రాజెక్టు డైరెక్టర్ కీలక పదవిని చేపట్టడానికి దోహదం చేశాయి.
ఆదిత్య-L1 మిషన్‌లో పాల్గొనడానికి ముందు.. నిగర్ షాజీ భారతీయ రిమోట్ సెన్సింగ్, కమ్యూనికేషన్, ఇంటతర్ ప్లానెటరీ ఉపగ్రహాల రూపకల్పన, అభివృద్ధికి గణనీయమైన కృషి చేసింది. జాతీయ వనరుల పర్యవేక్షణ, నిర్వహణకు కీలకమైన భారతీయ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ రిసోర్స్ శాట్ 2ఎకి అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఇమేజ్ కంప్రెషన్, సిస్టమ్ ఇంజనీరింగ్, స్పేస్ ఇంటర్నెట్ టెక్నాలజీపై పరిశోధనలు జరిపారు నిగర్ షాజీ.
#WATCH | On the successful launch of Aditya L-1, Project Director of Aditya L-1, Nigar Shaji says, "This is like a dream come true. I am extremely happy that Aditya L-1 has been injected by PSLV. Aditya L-1 has started its 125 days of long journey. Once Aditya L-1 is… pic.twitter.com/zs1avDJ9ba
— ANI (@ANI) September 2, 2023
ఆదిత్య-L1 ప్రాజెక్ట్‌కి నిగర్ షాజీ నాయకత్వం వహించడం ఆమె కేరీర్ లో కీర్తి కిరీటం.. స్థానిక మీడియా సవాళ్ల గురించి అడిగినప్పుడు ప్రతి మలుపులో సవాళ్లు ఉన్నప్పటికీ.. అవి అధిగమించలేనంత సమస్యలు కావని ఆమె ఆత్మవిశ్వాసం వ్యక్తి చేశారు. మహిళ శాస్త్రవేత్తలకు ఇస్రో నుంచి మంచి ప్రోత్సాహం, ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. ఇక్కడ గుర్తింపు లింగ విభేదం లేకుండా మెరిట్, సామర్థ్యాలపై ఆధారపడి గుర్తింపు ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.