మంత్రులతో ముఖాముఖి బంద్!

మంత్రులతో ముఖాముఖి బంద్!

 

  • గాంధీ భవన్​లో 3 నెలల కింద కార్యక్రమం ప్రారంభం
  • 45 రోజులుగా హాజరుకాని మంత్రులు
  • సీఎం, పార్టీ ఇన్​చార్జ్ దృష్టికి తీసుకెళ్లిన పీసీసీ చీఫ్

హైదరాబాద్, వెలుగు: ఇటు ప్రజల సమస్యలు.. అటు పార్టీ కేడర్ ఇబ్బందులను నేరుగా తెలుసుకొని వాటిని అప్పటికప్పుడు పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ‘‘మంత్రులతో ముఖాముఖి’’ కార్యక్రమం దాదాపు 2 నెలలుగా కొనసాగడం లేదు. పీసీసీ చీఫ్ గా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించిన వారం రోజుల్లోనే ఈ ప్రోగ్రామ్ ​ప్రారంభించారు.

 ప్రజలు, పార్టీ కేడర్​కు అందుబాటులో ఉండేలా.. వారంలో 2 సార్లు (బుధ, శుక్రవారాల్లో) మంత్రులతో ముఖాముఖిని గాంధీ భవన్​లో నిర్వహించాలని పీసీసీ చీఫ్ నిర్ణయించారు. ఒక్కోరోజు ఒక్కో మంత్రి పాల్గొనేలా చూశారు. సీఎం కూడా నెలలో 2 సార్లు అటెండ్ కావాలని కోరారు.

చివరి సారిగా డిసెంబర్ 5న ప్రోగ్రామ్

నిరుడు సెప్టెంబర్ చివరి వారంలో ‘మంత్రులతో ముఖాముఖి’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదట్లో మంత్రులు నేరుగా దరఖాస్తులు తీసుకొని, కొన్నింటిని అప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. మరికొన్నింటిని అధికారులకు సిఫార్సు చేసి పరిష్కరించాలని ఆదేశించారు. రెండు.. మూడు వారాల తర్వాత ఈ ప్రోగ్రామ్ ఆగిపోయింది. 

వారంలో రెండు సార్లకు బదులు.. 15 రోజుల్లో రెండు సార్లు నిర్వహించారు. ఇలా మూడు నెలలు కొనసాగింది. గత నెల 5న ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చివరిసారిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నెలన్నర అవుతున్నా మంత్రులతో ముఖాముఖి నిర్వహించడం లేదు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డికి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్ దీపాదాస్ మున్షి దృష్టికి మహేశ్ గౌడ్ తీసుకెళ్లినట్లు సమాచారం.