న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల విడుదలకు ముందు దేశ రాజధానిలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రలోభాలకు గురి కాకుండా అన్ని పార్టీలు అలర్ట్ అవుతున్నాయి. 16 మంది ఆప్ అభ్యర్థులకు బీజేపీ గాలం వేసిందన్న వార్తల నేపథ్యంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ అప్రమత్తమైంది. ఈ మేరకు ఆప్ కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 70 మంది పార్టీ అభ్యర్థులకు కేజ్రీవాల్ నివాసంలో భేటీకి పిలుపునిచ్చింది. ఈ మేరకు ఫిరోజ్ షా రోడ్‌లోని కేజ్రీవాల్ నివాసంలో ఆప్ అభ్యర్థులు, పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు.
కేజ్రీవాల్, సీఎం అతిశీ, మాజీ మంత్రి మనీష్ సిసోడియా వంటి నేతలంతా ఈ భేటీకి అటెండ్ అయ్యారు. ఈ భేటీలో ముఖ్యంగా బీజేపీ ప్రలోభాలకు గురి చేసిన అభ్యర్థుల గురించి చర్చించనున్నట్లు తెలిసింది. ఆప్ సీనియర్ నేత, ఎంపీ సంజయ్ సింగ్ భేటీకి ముందు మీడియాతో మాట్లాడారు. ఆప్ అభ్యర్థి ముఖేష్ కుమార్ అహ్లావత్‌కు గురువారం కాల్ వచ్చిన నంబర్‌ను పరిశీలించి.. తర్వాత ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
కాగా, ఆప్ అభ్యర్థులను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టిందని కేజ్రీవాల్, ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ప్రచారం జరిగిన మరుసటి రోజే ఆప్ అభ్యర్థులు భేటీ కావడం ఢిల్లీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడనున్నాయి. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ ఢిల్లీలో ఈ సారి బీజేపీదే విజయమని అంచనా వేశాయి. ఆప్ కూడా గెలుపుపై ధీమాగానే ఉంది. దీంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.