విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ కీలక సమావేశం

విభజన సమస్యలపై  కేంద్ర హోంశాఖ కీలక సమావేశం

ఉమ్మడి ఏపీ విభజన సమస్యలు, ఇతర అంశాలపై  కేంద్ర హోంశాఖ ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే రెండు రాష్ట్రాల ప్రతినిధులతో కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు కేంద్ర హోంశాఖ సెక్రటరీ అజయ్ భల్లా ఆధ్వర్యంలో మీటింగ్ జరగనుంది. సమావేశానికి రెండు రాష్ట్రాల సీఎస్ లు, 11 శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఇప్పటికే తెలంగాణ, ఏపీ సీఎస్ లు, అధికారులు ఢిల్లీ చేరుకున్నారు. సమావేశంలో మొత్తం 14 అంశాలు ఎజెండాలో ఉన్నాయి. ఎజెండాలో ఇరు రాష్ట్రాలకు చెందిన  ఏడు అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశముంది. 

మరో 7 అంశాలు ఏపీకి సంబంధించినవి ఉన్నాయి. ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్ల విభజన, షెడ్యూల్ 10 లోని సంస్థల విభజన అంశాలు ఉన్నాయి. చట్టంలో లేని ఇతర సంస్థల విభజన, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజనపై కూడా చర్చ జరగనుంది. సింగరేణి కాలరీస్ ఏపీ హెవీ మిషనరీ ఇంజనీరింగ్ లిమిటెడ్ విభజన అంశాలు పెండింగ్ లో ఉన్నాయి. బ్యాంకుల్లో ఉన్న నగదు, బ్యాలెన్స్ విభజన, AP SCSCL, TSSL క్యాష్ క్రెడిట్, 2014- 15  రైస్ సబ్సిడీ విడుదల అంశాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 

ఐతే కేంద్ర ప్రభుత్వం ప్రతీసారి రెండు రాష్ట్రాల వాదనలు వినడమే తప్ప... ఎలాంటి పరిష్కారం చూపడం లేదన్న విమర్శలున్నాయి. విభజన చట్టంలోని నిబంధనలు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారమైనా సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు. 2 తెలుగు రాష్ట్రాల మధ్య 25 సమావేశాలు జరిగాయి. ఈ ఏడాదిలోనే మూడుసార్లు మీటింగ్ లు నిర్వహించారు. ఈ మీటింగ్ లోనే ఐనా పరిష్కారం దొరకుందా అంటే చెప్పలేని పరిస్థితి.