న్యూఢిల్లీ: ఢిల్లీలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు ఉతమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ తదితరులు హాజరయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ ఏడాది పాలనపై ఈ భేటీలో హై కమాండ్ ఆరా తీసినట్లు తెలిసింది. ఆరు గ్యారెంటీల్లో అమలు చేసిన పథకాలు.. ఇంకా ఇంప్లిమెంట్ చేయని గ్యారెంటీల గురించి పార్టీ అధిష్టానం అడిగినట్లు తెలిసింది.
అలాగే.. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి హైకమాండ్ డిస్కస్ చేసింది. ఎమ్మెల్యేలు, మంత్రుల పని తీరుపై రాష్ట్ర నేతలను ఆరా తీసింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టి ఏడాది పూర్తి అయిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై సర్వే చేయించారు. ఈ సర్వే రిపోర్టులో కొందరు ఎమ్మెల్యేలు.. మరో ముగ్గురు మంత్రుల పని తీరుపై నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చినట్లు టాక్.
ALSO READ | తెలంగాణ హైకోర్టుకు నలుగురు కొత్త జడ్జిలు..!
ఈ సర్వే రిపోర్ట్పైన హైకమాండ్ చర్చించినట్లు తెలిసింది. వీటితో పాటు.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈ నెలాఖర్లో తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఈ పర్యటన ఏర్పాట్లపై ఈ భేటీలో చర్చించారు. అలాగే.. కేబినెట్ విస్తరణ, నామినేటేడ్ పోస్టుల భర్తీ, త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యుహాలపై ఈ భేటీలో ప్రధానంగా డిస్కస్ చేసినట్లు సమాచారం.