- డివిజన్ల సమస్యలపై గళమెత్తిన కార్పొరేటర్లు
- సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
- పదవీకాలం ముగిసేలోగా సమస్యలన్నీ పరిష్కరిస్తాం.. మేయర్
- బల్దియా సర్వసభ్య సమావేశంలో 180 ఎజెండా అంశాలకు ఆమోదం
కరీంనగర్ టౌన్:వెలుగు: కరీంనగర్ బల్దియా మీటింగ్ హాట్‌హాట్‌గా సాగింది. మంగళవారం మేయర్ సునీల్‌రావు అధ్యక్షతన స్థానిక కార్పొరేషన్ మీటింగ్ హాల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కార్పొరేటర్లు తమ డివిజన్లలోని పెండింగ్సమస్యలపై సమావేశంలో గళమెత్తారు. తమ పదవీ కాలం మరో ఆర్నెళ్లలో ముగియనుండడంతో పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
180 ఎజెండా అంశాలను కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానించింది. మంత్రి ఆదేశించినా ఎంబీ రికార్డులు ఎందుకు చూపించడం లేదని, చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని 41వ డివిజన్ కార్పొరేటర్ బండారి వేణు, ఎస్సీ రిజర్వ్‌డ్ డివిజన్లకు నిధులు కేటాయించడం లేదని 44వ డివిజన్ కార్పొరేటర్ మెండి శ్రీలత, తన డివిజన్ లోని పెద్దమోరిని సక్రమంగా నిర్మించాలని, దోమల నివారణ కోసం హ్యాండ్ పంప్, ఫాగింగ్ మిషన్ సక్రమంగా వినియోగించాలని 55వ డివిజన్ కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్ సూచించారు.
విలీన గ్రామం తీగలగుట్టపల్లిలో నల్లా కనెక్షన్లు ఇప్పించాలని 1వ డివిజన్ కార్పొరేటర్ కొలగాణి శ్రీనివాస్, సీజనల్ వ్యాధుల నివారణ, పందులు,కుక్కల సమస్యలు పరిష్కరించాలని, పీటీసి వద్ద కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయాలని 38వ డివిజన్ కార్పొరేటర్ కచ్చు రవి, జేసీబీ, ట్రాక్టర్లు రిపేర్ చేయించాలని 3వ డివిజన్ కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్, డెయిలీ తాగునీరు సప్లై చేయాలని 59వ డివిజన్ కార్పొరేటర్ గందె మాధవి డిమాండ్ చేశారు. కాగా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ సభ్యుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
చెత్త లిఫ్టింగ్ కోసం 38 ట్రాక్టర్లు,10 స్వచ్ఛ ఆటోలు, వాటర్ సప్లై కోసం 10 ట్యాంకర్లతో కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. రూ.6 కోట్లతో నూతన లైటింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణిహరిశంకర్, ట్రైనీ కలెక్టర్ అజయ్ జాదవ్, అసిస్టెంట్ కమిషనర్ వేణుమాధవ్, డిప్యూటీ కమిషనర్ స్వరూపరాణి, ఈఈ యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.