రసాభాసగా కాంగ్రెస్​ మీటింగ్.. భోజనాల దగ్గరే మద్యం పంపిణీ

రసాభాసగా కాంగ్రెస్​ మీటింగ్..  భోజనాల దగ్గరే మద్యం పంపిణీ

కాగజ్ నగర్, వెలుగు: సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పార్టీ పార్లమెంట్ ఇన్​చార్జ్ ముందు బాహాబాహీకి దిగారు. నాన్​లోకల్​కు కాకుండా స్థానికుడికే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు.  ఈనెల 17న తుక్కుగూడలో నిర్వహించనున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మీటింగ్ కు సంబంధించి  కాంగ్రెస్ పార్టీ అదిలాబాద్ పార్లమెంట్ ఇన్​చార్జ్, కర్ణాటక ఎమ్మెల్సీ ప్రకాశ్ రాథోడ్ బుధవారం సిర్పూర్ టీ మండలం వేంపల్లిలోని పార్టీ ఆఫీస్ లో నియోజకవర్గ స్థాయి నాయకులతో సమావేశం నిర్వహించారు.

 అయితే టికెట్​కేసులో ఉన్న కృష్ణారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ రావి శ్రీనివాస్ వర్గం ఆరోపించింది. నాన్​లోకల్​అయిన కృష్ణారెడ్డికి కాకుండా టికెట్​ను శ్రీనివాస్​కు ఇవ్వాలంటూ జోరుగా నినాదాలు చేశారు. కృష్ణారెడ్డి వర్గం సైతం తమ నేతకు అనుకూలంగా నినదించడంతో సభ రసాభాసగా మారింది. ప్రకాశ్​రాథోడ్​మాట్లాడుతూ.. తాను కేవలం సోనియా గాంధీ మీటింగ్ ను విజయవంతం చేయాలని కోరేందుకే వచ్చానని, టికెట్ కేటాయింపు విషయంతో తనకు సంబంధం లేదన్నారు. 

ఇక్కడ కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాన్ని హై కమాండ్ కు వివరిస్తానని చెప్పడంతో వారు శాంతించారు.అయితే, మీటింగ్ తర్వాత మధ్యాహ్నం భోజనాలు పెట్టగా.. అక్కడే మద్యం పంపిణీ చేశారు. బొలేరో వాహనంలో లిక్కర్ కాటన్​లు తెచ్చి భోజనాల టెంట్ దగ్గరే పంచిపెట్టడంతో సీసాల కోసం కార్యకర్తలు బారులు తీరారు. భోజనాల టెంట్​కిందనే మద్యం తాగి తూలుతూ వెళ్లిపోయారు.