- నేతల పరస్పర ఆరోపణలతో వేడెక్కిన వాతావరణం
- కేటీఆర్ బస్సుపై కోడి గుడ్లతో ఎన్‌ఎస్‌యూఐ నేతల దాడి
నల్గొండ, వెలుగు : నల్గొండలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నిర్వహించిన సభలు ప్రజలను టెన్షన్‌కు గురిచేశాయి. చలో నల్గొండ పేరుతో బీఆర్‌ఎస్ పెట్టిన సభకు పోటీగా కాంగ్రెస్ మినీ సభ నిర్వహించింది. ఉదయం 11 గంటలకు క్లాక్‌టవర్ వద్ద పెట్టిన ఈ సభకు పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఖాళీ కుర్చీపై పింక్ టవల్ వేసి కేసీఆర్ ఫొటో పెట్టి నిరసన తెలిపారు.
పెద్ద ఎత్తున ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులపై కేసీఆర్ నిర్లక్ష్యాన్ని ప్రజలకు వివరించారు. డీసీసీ ప్రెసిడెంట్శంకర్నాయక్ ఆధ్వర్యంలో జరిగిన సభకు పార్టీ సీనియర్లు మున్సిపల్‌చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పాశం రామిరెడ్డి, గుమ్మల మోహన్ రెడ్డి, అబ్బగోని రమేశ్, వంగూరి లక్ష్మయ్య తదితరులు హాజరుకాగా.. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.
అలర్ట్ అయిన పోలీసులు
సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కేసీఆర్చలో నల్గొండ సభకు రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఖమ్మం, వరంగల్, ఉమ్మడి నల్గొండ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. అంతకుముందు కేటీఆర్, హారీశ్‌రావు ప్ర యాణించే వాహనాలపై పలువురు ఎన్‌ఎస్‌యూఐ నాయకులు కోడిగుడ్లతో దాడి చేశారు. కేసీఆర్ గో బ్యాంక్ అంటూ నినాదాలు చేయడంతో బీఆర్‌ఎస్ శ్రే ణులు సైతం ఎదురుదాడికి దిగేందుకు సిద్ధమయ్యారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. కేసీఆర్ సభలో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన జీవో 46 రద్దు చేయాలని నిరుద్యోగులు ప్లకార్డులు ప్రదర్శించారు.
మొరాయించిన మైకులు.. సీరియస్ అయిన కేసీఆర్
సభలో ప్రసగించే సమయంలో మైక్‌లు మొరాయించడంతో కేసీఆర్ సీరియస్అయ్యారు. ఏ మాయ రోగం వచ్చింది..? బీమార్ ఏమైనా వచ్చిందా..? అని చిరాకు పడ్డారు. ఈలలు, నినాదాలు చేస్తున్న వారిపైనా ఫైర్ అయ్యారు. అవతలి పార్టీ వాళ్లయితే జాగ్రత్తగా ఉండాలని మందలించారు. ఈ సభకు ఎమ్మెల్యేలు జగదీశ్ రెడ్డి, కడియం శ్రీహరి, ఎంపీ నామా నాగేశ్వరావుతో సహా ఐదు జిల్లాల మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
Also Read : భద్రాద్రికొత్తగూడెంలో జాడలేని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్
కేసీఆర్ కరువును తరిమికొట్టారు
కేసీఆర్ పదేళ్ల పాలనలో కాంగ్రెస్ పెంచిన కరువు, ఆకలి చావులను తరిమి కొట్టిండు. యాభై ఏళ్లలో రెండున్నర లక్షల మంది చనిపోయేలా చేసిన ఫ్లోరోసిస్ మహమ్మారిని తరిమికొట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కింది. నాలుగేళ్లలో నల్గొండ జిల్లాలో 3లక్షల టన్నులు నుంచి 40లక్షల టన్నుల వరి ధాన్యాన్ని పండేలా చేశారు. రెండు నెలలుగా సాగర్ ప్రాజెక్టు ఏపీకి చేతికి వెళ్తే ఎవరూ పట్టించుకోలేదు.
- సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
ప్రాజెక్టులను పూర్తి చేయకుండా కేసీఆర్ మోసం చేసిండు
10 ఏండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ జిల్లాలో ప్రాజెక్టులను పూర్తి చేయకుండా నల్గొండ ప్రజలను మోసం చేసిండు. శ్రీశైలం టన్నెల్ ను కిలోమీటర్ కూడా పూర్తి చేయలేదు. డిండి ఎత్తిపోతల, పాలమూరు- రంగారెడ్డి, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుల నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. జిల్లాలో ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయని కేసీఆర్‌కు నల్గొండలో అడుగుపెట్టే హక్కు లేదు.
- శంకర్ నాయక్, డీసీసీ అధ్యక్షుడు