తెలంగాణ రాష్ట్రంలో చాలామంది నిరుద్యోగుల ఆశలన్నీ మెగా డిఎస్సీ 2024 నోటిఫికేషన్ పైనే. గతంలో 5,089 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ కాగా.. వాటిని 11,062లకు పెంచుతూ 2024 ఫిబ్రవరి 29న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిపికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. నేటి నుంచే (మార్చి 4) నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఏప్రిల్ 2 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అప్లికేషన్ ఫీజు కింద రూ.1000 చెల్లించాలి. ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచిన నేపథ్యంలో.. 2023 జులై 1 నాటికి 18 నుంచి 46 సంవత్సరాల వయసు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, మాజీ సైనికులకు మూడేళ్లు, దివ్యాంగులకు ఐదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.
జూన్ నెలాఖరులో పరీక్షలు..
డీఎస్సీ పరీక్షలకు హాజరయ్యే వారిలో చాలా మంది గ్రూప్-1 పరీక్ష కూడా రాస్తుంటారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 9న నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ఇటీవల ప్రకటించింది. దీంతో గ్రూప్-1 పరీక్ష జరిగేవరకు డీఎస్సీ ఎగ్జామ్ ఉండదు. జూన్ నెలాఖరులో డీఎస్సీ పరీక్షలు జరగవచ్చని నిపుణుల అభిప్రాయం. మొత్తం ఖాళీల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ 6,508 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్-2,629 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్727, పీఈటీలు 182 పోస్టులు, ప్రత్యేక కేటగిరీ విభాగంలో స్కూల్ అసిస్టెంట్లు 220 పోస్టులు, ఎస్జీటీలు 796 పోస్టులు ఉన్నాయి. అత్యధిక ఖాళీలు హైదరాబాద్‌లో 878 ఉండగా.. ఆ తర్వాత నల్గొండ జిల్లాలో 605, అత్యల్పంగా పెద్దపల్లి జిల్లాలో 93 ఖాళీలను భర్తీ చేయనన్నారు. పది రోజులపాటు ఉమ్మడి జిల్లా కేంద్రంలో పరీక్ష కేంద్రాలను ఉంటాయి.