- నేటి నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్.. ఆస్ట్రేలియాతో ఇండియా ఢీ..
- ‘గద’పై కన్నేసిన రోహిత్‌సేన
ఇండియా ఐసీసీ ట్రోఫీ నెగ్గి పదేండ్లు గడిచాయి. చివరగా 2013లో ఇంగ్లండ్‌లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన మనటీమ్ ఈ పదేండ్లలో మూడుటీ20వరల్డ్ కప్స్, రెండు వన్డే వరల్డ్ కప్స్, ఓ టెస్టు చాంపియన్‌షిప్‌లో తలపడినా ఒక్కదాంట్లోనూ విన్నర్ కాలేకపోయింది. 2014లో టీ20 వరల్డ్ కప్‌తో పాటు గతేడాది డబ్ల్యూటీసీలో ఫైనల్ చేరినా ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. అయినా పట్టు వదలకుండా ఈసారి కూడా డబ్ల్యూటీసీ ఫైనల్ బరిలో నిలిచింది. టెస్టు ఫార్మాటే అల్టిమేట్ అనే కెప్టెన్ రోహిత్ శర్మ, సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ, రెడ్‌బాల్ హీరో చతేశ్వర్ పుజారాతో పాటు మ్యాచ్ విన్నర్లతో ఇండియా బలంగా ఉంది. అటువైపు అంతే బలీయంగా ఉన్న ఆస్ట్రేలియా కాచుకొని ఉంది. మరి మనోళ్లు ఆసీస్ అడ్డు దాటుతారా? రెండేళ్ల కింద చేజారిన టెస్టు ‘గద’ను ఈసారైనా అందుకుంటారా?
సవాల్ విసిరే ఇంగ్లండ్ గడ్డపై నేటి నుంచే మెగా ఫైనల్. ఈ ‘అల్టిమేట్ టెస్ట్’లో గెలిచి ది బెస్ట్ అయ్యేది ఎవరో మరి!
లండన్ టెస్టుల్లో గొప్పగా ఆడుతూ.. టాలెంట్, టెంపర్‌మెంట్ కలగలిసిన ప్లేయర్లతో కూడిన టీమిండియా అల్టిమేట్ టెస్టు వార్‌కు రెడీ అయింది. కెన్నింగ్టన్ ఓవల్‌లో బుధవారం మొదలయ్యే వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో తమకు సమ ఉజ్జీ అయిన ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. కొన్నాళ్లుగా ఇండియాతో పాటు కంగారూ టీమ్ సైతం ఈ ఫార్మాట్‌లో సూపర్ పెర్ఫామెన్స్ చేస్తోంది. ఈ దశాబ్ద కాలంలో టెస్టుల్లో బెస్ట్ టీమ్స్‌గా అనదగ్గ ఇరు జట్ల మధ్య అసలు సిసలైన పోటీ టెస్టు అభిమానులను ఉర్రూతలూగించనుంది. వరుసగా రెండోసారి ఫైనల్ చేరిన ఇండియా ఈ క్రమంలో ఆడిన ఆరు టెస్టు సిరీస్‌ల్లో ఒక్కటే అది కూడా సౌతాఫ్రికాలో ఓడింది. అదే సిరీస్‌లో విరాట్ కోహ్లీ ప్లేస్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీ అందుకున్నాడు. ఇక సొంతగడ్డపై టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడలేదు. బోర్డర్– గావస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై విక్టరీ టీమ్ ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది. మరోవైపు గత ఎడిషన్‌లో ఓవర్ రేట్ పెనాల్టీ కారణంగా టాప్2లో ప్లేస్ కోల్పోయిన ఆసీస్ ఈసారి టాప్ ప్లేస్‌తో టైటిల్ ఫైట్‌కు దూసుకొచ్చింది. తొలి ప్రయత్నంలోనే గదపై గురి పెట్టింది.
ఇప్పుడు కాకుంటే
టెస్టు క్రికెట్‌ను ఎక్కువగా ఇష్టపడే కెప్టెన్ రోహిత్, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, సీనియర్లు పుజారా, రహానె, షమీ, అశ్విన్, జడేజాతో పాటు యంగ్‌స్టర్స్ గిల్, సిరాజ్, భరత్, ఇషాన్‌లతో ఇండియా సమతూకంలో ఉంది. టెస్టు స్పెషలిస్ట్ పుజారా కొన్నాళ్లుగా ఇంగ్లండ్‌లో కౌంటీలు ఆడుతూ.. సెంచరీల మీద సెంచరీలు కొట్టి జోరుమీదున్నాడు. ఐపీఎల్‌లో చెలరేగిన గిల్, కోహ్లీతో పాటు అనూహ్యంగా ఈ టీమ్‌లో ప్లేస్ దక్కించుకున్న రహానె కూడా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. పేస్ లీడర్ షమీ ఐపీఎల్‌లో టాప్ వికెట్ టేకర్‌గా నిలవగా.. సిరాజ్ కూడా బంతితో అదరగొడుతున్నాడు. అశ్విన్, జడేజా స్పిన్‌తో మాయ చేయడంతో పాటు బ్యాట్‌తో సత్తా చాటగల సమర్థులు. ఏజ్ దృష్ట్యా కోహ్లీ, అశ్విన్, పుజారాకు ఇదే చివరి మెగా టెస్టు ఫైనల్ అయ్యేలా ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా ట్రోఫీ నెగ్గేందుకు ఇదే సరైన సమయం అనిపిస్తోంది. అయితే, టీమ్‌లో మెజారిటీ ప్లేయర్లంతా రెండు నెలల పాటు ఐపీఎల్ ఆడారు. వెంటనే మరో ఫార్మాట్‌కు షిఫ్ట్ అవడం.. ఇంగ్లండ్ వాతావరణంలో స్టార్క్, కమిన్స్, బోలాండ్ లాంటి పేసర్లను ఎదుర్కోవడం మనోళ్లకు సవాల్ కానుంది. పైగా, స్టార్ పేసర్ బుమ్రాతో పాటు మిడిలార్డర్‌లో దుమ్మురేపిన రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ లేకపోవడం మైనస్. పంత్ ప్లేస్‌లో కీపర్‌గా కేఎస్ భరత్, ఇషాన్ కిషన్‌లో ఎవరిని తీసుకోవాలన్నది పెద్ద సమస్యగా మారింది. అలాగే, జడ్డూ, అశ్విన్ ఇద్దరినీ ఆడించాలా? ఒకే స్పిన్నర్‌ను ఆడిస్తే తుది జట్టులో ఎవరిని ఉంచాలన్నది కూడా మేనేజ్మెంట్కు తలనొప్పిగా మారింది.
ఆసీస్‌తో అంత ఈజీ కాదు
పేరుకు తటస్థ వేదికే అయినా ఆస్ట్రేలియాను హోమ్‌టీమ్ అనొచ్చు. రెగ్యులర్‌గా యాషెస్ సిరీస్‌లు ఆడే కంగారూ టీమ్‌కు ఇంగ్లండ్ వాతావరణం అలవాటైనదే. ఇండియన్స్ అంతా ఐపీఎల్‌లో బిజీగా గడిపితే ఆసీస్‌లో ముగ్గురే లీగ్‌లో ఆడారు. మిగతా వాళ్లు ఈ టెస్టుపై ఫోకస్ పెట్టి ఫ్రెష్ మైండ్‌తో బరిలోకి దిగుతున్నారు. కమిన్స్ స్వదేశంలో ఉండి ప్రిపేర్ అవ్వగా.. పుజారా మాదిరిగా లబుషేన్, స్టీవ్ స్మిత్ కౌంటీల్లో పాల్గొన్నారు. ఖవాజా మంచి ఫామ్‌లో ఉండగా.. టెస్టు కెరీర్ చివర్లో ఉన్న మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ తనను తాను నిరూపించుకోవాలన్న కృత నిశ్చయంతో ఉన్నాడు. పిచ్ ఎలా ఉన్న ఆఫ్ స్పిన్నర్ నేథన్ లైయన్ వైవిధ్యమైన బాల్స్‌తో బ్యాటర్లకు సవాల్ విసరగలడు. కామెరూన్ గ్రీన్ ఆల్‌రౌండ్ స్కిల్స్ ఆసీస్‌కు కీలకం కానుంది. కాబట్టి ఆసీస్‌ను పడగొట్టడం ఇండియాకు అంత ఈజీ కాబోదు.
రోహిత్‌కు గాయం!
ఫుట్‌టైమ్ కెప్టెన్ అయ్యాక పెద్దగా సక్సెస్ రుచి చూడలేకపోయిన రోహిత్‌కు ఈ మ్యాచ్ కీలకం కానుంది. ఇందులో టీమ్‌ను గెలిపిస్తే ‘టెస్టు గద’ సాధించిన కెప్టెన్ అతని పేరు చరిత్రలో నిలుస్తుంది. అయితే, మ్యాచ్ ముంగిట రోహిత్ గాయపడటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం నెట్స్‌లో త్రో డౌన్స్ ఎదుర్కొంటున్న టైమ్‌లో ఓ బంతి ఎడమ చేతి బొటన వేలుకు తగిలింది. వెంటనే ఫిజియో వచ్చి వేలుకు టేప్ వేయగా.. ఆ తర్వాత రోహిత్ బ్యాటింగ్ చేయలేదు. కాగా, తను బాగానే ఉన్నాడని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. ఆస్ట్రేలియాతో ఆడిన గత నాలుగు సిరీస్‌ల్లోనూ ఇండియా (2–1తో ) గెలిచింది.
పిచ్/వాతావరణం
ఓవల్ పిచ్‌పై మంచి బౌన్స్ ఉంటుందని క్యూరేటర్ చెప్పాడు. చల్లటి మేఘావృతమైన వాతావరణంలో పేసర్లకు అనుకూలించనుంది. వికెట్‌పై గడ్డి కనిపిస్తున్నా.. మ్యాచ్ టైమ్‌కు ట్రిమ్ చేయనున్నారు. చివరి రెండు రోజుల్లో వాన సూచన ఉంది. ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే (జూన్12) ఉంది. ఐదు రోజుల్లో ఆట నష్టపోతే రిజర్వ్ డేన ఆడిస్తారు.
తుది జట్లు
ఇండియా (అంచనా): రోహిత్(కెప్టెన్), గిల్, పుజారా, కోహ్లీ, రహానె, జడేజా, భరత్/కిషన్ (వికెట్),అశ్విన్/శార్దూల్, ఉమేష్/ఉనాద్కట్, షమీ, సిరాజ్.
ఆస్ట్రేలియా: వార్నర్, ఖవాజా, లబుషేన్, స్మిత్, హెడ్, గ్రీన్, క్యారీ (కీపర్), కమిన్స్ (కెప్టెన్), స్టార్క్, లైయన్, బోలాండ్.