మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: జిల్లా యువతకు స్థానికంగా ఉద్యోగాలు కల్పించేందుకు అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ఆధ్వర్యంలో ఈ నెల 9న పట్టణంలోని శిల్పారామంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో మీడియాతో మాట్లాడారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే జాబ్ మేళాలో 10 ఐటీ కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు. జిల్లాకు చెందిన డిగ్రీ, ఐటీ, ఇంజనీరింగ్ ఆపై చదివిన వారు జాబ్ మేళాకు హాజరు కావాలని సూచించారు. 650 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది అమర్‌రాజా కంపెనీ ద్వారా మరో 10 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. కలెక్టర్ గుగులోత్ రవి నాయక్, టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్హా, డైరెక్టర్ ప్రదీప్, ప్రభుత్వ ఐటీ ఇన్వెస్ట్ సీఈవో విజయ రంగినేని, ఎస్పీ కె నరసింహ పాల్గొన్నారు.
జిల్లాను మొదటి స్థానంలో నిలపాలి..
జిల్లాను అన్ని అంశాల్లో మొదటి స్థానంలో నిలపాలని మంత్రి పిలుపునిచ్చారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్లో రెడ్ క్రాస్ సొసైటీ మీటింగ్‌కు హాజరై మాట్లాడారు. జాతీయ స్థాయిలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మహబూబ్ నగర్ జిల్లా శాఖ గోల్డ్ మెడల్ సాధించడం అనందంగా ఉందన్నారు. భవిష్యత్ లో మంచి సేవలందించేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సొసైటీ జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ శామ్యుల్, కోశాధికారి జగపతిరావు, అడ్వకేట్ మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 3 అమ్మఒడి, ఒక పార్థివ వాహనాలను మంత్రి ప్రారంభించారు. మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింలు, సూపరింటెండెంట్ డాక్టర్ రాంకిషన్, డీఎంహెచ్‌వో డాక్టర్ కృష్ణ పాల్గొన్నారు.