Chiranjeevi: అభిమాని ఈశ్వ‌రయ్య కుటుంబాన్ని సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి..అండగా ఉంటానని హామీ

Chiranjeevi: అభిమాని ఈశ్వ‌రయ్య కుటుంబాన్ని సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి..అండగా ఉంటానని హామీ

ఎవరికి ఆపద వచ్చినా నేనున్నా అంటూ ముందుకొచ్చే వ్యక్తుల్లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)  ఒకరు. తెలిసిన వెంటనే వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తారు. అందులో అభిమానులు అయితే..వెంటనే రంగంలోకి దిగేస్తారు. వారిని ప్రత్యేకంగా కలవడమో.. లేక హైదరాబాద్ పిలిపించడమో చేస్తూ.. వారికి చేతనైంత సహాయం చేస్తుంటారు. తాజాగా ఓ అభిమాని చేసిన పనికి ఫిదా అయ్యి..హైద‌రాబాద్‌లోని త‌న ఇంటికి ప్ర‌త్యేకంగా పిలిపించుకుని మాట్లాడారు. అలాగే సత్కరించారు. వివరాల్లోకి వెళితే..

ఆగ‌స్ట్ 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు అన్న విషయం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఈశ్వ‌ర‌య్య అనే చిరంజీవి అభిమాని తిరుప‌తి నుంచి తిరుమ‌ల కొండ వ‌ర‌కు పొర్లు దండాలు పెట్టుకుంటూ వెళ్లి త‌న అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ విష‌యం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది కాస్తా చిరంజీవి వరకు వెళ్ళింది. దీంతో ఈశ్వ‌రయ్య, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను హైద‌రాబాద్‌లోని త‌న ఇంటికి ప్ర‌త్యేకంగా పిలిపించుకుని మాట్లాడారు చిరంజీవి.

ఈశ్వరయ్య కుటుంబానికి పట్టు బ‌ట్ట‌లు పెట్టి స‌త్క‌రించటం ప్రస్తుతం విశేషంగా మారింది. అలాగే ఈ సంద‌ర్భంగా ఈశ్వ‌ర‌య్య కుటుంబానికి అండ‌గా ఉంటాన‌ని మెగాస్టార్ హామీ ఇచ్చారు. సోమవారం (ఆగస్ట్ 26) రోజున చిరంజీవి అయ్య‌ప్ప మాల‌ను ధరించారు. ప్ర‌తీ ఏడాది అయ్య‌ప్ప మాల‌ను ధరించే ఆయన ఈ ఏడాది కూడా మాల‌ను ధ‌రించారు. మాల‌ధార‌ణ‌లోనే ఈశ్వ‌ర‌య్య కుటుంబంతో క‌లిసి మాట్లాడారు చిరు. 

గతంలో ఈశ్వ‌ర‌య్య తిరుప‌తి నుంచి మెగాస్టార్ ఇంటి వ‌ర‌కు సైకిల్ యాత్ర‌ను నిర్వ‌హించారు. అదే విధంగా ప‌వ‌న్ కల్యాణ్ పుట్టిన‌రోజుకు, జనసేన పార్టీ నెగ్గాల‌ని ఇలా అనేక సార్లు పొర్లు దండాలు చేయ‌టం విశేషం. ప్రస్తుతం ఈ విషయం, దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.