![Chiranjeevi: జై జనసేన అంటూ చిరంజీవి నినాదం.. ప్రజారాజ్యమే జనసేనగా రూపాంతరం.. మెగాస్టార్ కామెంట్స్](https://static.v6velugu.com/uploads/2025/02/mega-star-chiranjeevi-speech-at-laila-mega-mass-event_YRHn0BUyhi.jpg)
విశ్వక్ సేన్, ఆకాంక్ష శర్మ జంటగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించిన చిత్రం ‘లైలా’. వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న సినిమా రిలీజ్ కానుంది. ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ ‘విశ్వక్ సేన్ మెగా కాంపౌండ్ కాదని ఇటీవల ఆయనకు ఎదురైన ప్రశ్న విన్నాను. హీరోల మధ్య ఎలాంటి కాంపౌండ్‌లు ఉండవు. ఈ రోజుకి బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున మేమంతా కలసికట్టుగా వుంటాం. మా మధ్య ఎలాంటి అరమరికలు లేవు. అందరం కలివిడిగా వుండాలి. ఇండస్ట్రీలో ఒక సినిమా ఆడిందంటే ప్రతి ఒక్కరూ హర్షించాలి. హిట్ ఎవరికొచ్చినా అందరూ ఆనందపడాలి. ఇండస్ట్రీ అంతా ఒకటే కాంపౌండ్. ఇక ఇందులో విశ్వక్ లేడీ గెటప్‌లో చాలా గ్లామర్‌గా కనిపిస్తున్నాడు. ఇది హిట్ గ్యారెంటీ. ప్రతి ఒక్కర్నీ ఎంటర్‌టైన్ చేసేలా సినిమా ఉంటుంది.
‘సంక్రాంతికి వస్తున్నాం’ తరహాలో ఇది కూడా అందర్నీ అలరిస్తుందని నమ్ముతున్నా. విశ్వక్ ఇప్పటికే తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాతో అందరి గుండెల్లో స్థానం సంపాదించుకుంటాడు. ఇందులో నటించిన అందరు నటీనటులకు ఈ సినిమా సక్సెస్ ఇవ్వాలని కోరుతున్నా’ అని అన్నారు. ఇక అనిల్ రావిపూడితో ఆయన చేయబోయే సినిమా గురించి మాట్లాడుతూ ‘అవుట్ అండ్ అవుట్ కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రాబోతోంది. సమ్మర్‌లో ప్రారంభం అవుతుంది’ అని చెప్పారు.
ఇక తన తమ్ముడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ నినాదాన్ని పలికారు చిరంజీవి. ‘జై జనసేన’ అంటూ.. చిరు అన్నారు. తాను గతంలో స్థాపించిన ప్రజారాజ్యం పార్టీనే జనసేనగా రూపాంతరం చెందిందని, చాలా సంతోషంగా ఉందని చిరంజీవి అనడంతో మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.
మరో గెస్ట్‌గా హాజరైన దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘హీరోలు లేడీ గెటప్ పోషించిన ప్రతి చిత్రం హిట్ అయ్యింది. అలాగే విశ్వక్‌కు కూడా ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధిస్తుందని నమ్ముతున్నా. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్’ అని చెప్పాడు.
విశ్వక్ సేన్ మాట్లాడుతూ ‘నా కెరీర్‌లోనే ఇది స్పెషల్ సినిమా. ఈ కథ నా దగ్గరకు రావడం, ఇందులో నటించడం చాలా హ్యాపీ. జనాన్ని నవ్వించేలా సినిమా ఉంటుంది. ఈరోజుల్లో డబ్బు కన్నా.. మానసిక ప్రశాంతత ఉన్నవాడే ధనవంతుడు అని నేను నమ్ముతాను. మా ప్రయత్నంగా ఈ చిత్రం ద్వారా అందర్నీ ఎంటర్‌టైన్ చేయాలనుకుంటున్నాం’ అని చెప్పాడు.
విశ్వక్ కథ ఒప్పుకోవడమే తనకు పెద్ద గిఫ్ట్ అని దర్శకుడు రామ్ నారాయణ్ అన్నాడు. ఆడియెన్స్ అందరూ తప్పకుండా ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుందని నిర్మాత సాహు గారపాటి చెప్పారు. హీరోయిన్ ఆకాంక్ష శర్మ, నటులు అభిమన్యు సింగ్, పృథ్వీ, లిరిక్ రైటర్స్ పెంచల్ దాస్, పూర్ణచారి పాల్గొన్నారు.