ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా ఉంటానని.. సినిమాలకు దగ్గరగా కళామ్మతల్లి సేవలోనే ఉంటానని చిరంజీవి అన్నారు. ఆయన పొలిటికల్ ఎంట్రీపై ఎవరూ డౌట్ పెట్టుకోవద్దని, తాను అనుకున్న లక్ష్యాలను,సేవా భావాల్ని ముందుకు తీసుకెళ్లడానికి పవన్ కళ్యాణ్ ముందున్నాడు అని చెప్పారు. ఆర్‌వీఎస్ నిఖిల్ దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ‘బ్రహ్మా ఆనందం’ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది.
ఈ సందర్భంగా మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ ‘బ్రహ్మానందంతో అనుబంధం నాకు ఎప్పట్నుంచో ఉంది. మన ప్రేమ ఇలాగే కొనసాగాలి. నేను ఏ రకంగా పుత్సోత్సాహాన్ని అనుభవిస్తున్నానో.. ఈ సినిమాతో బ్రహ్మానందం కూడా అంతే పుత్రోత్సాహాన్ని అనుభవించాలని కోరుకుంటున్నా.
ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాకు ఎంతో ప్రాముఖ్యత ఉందనిపిస్తోంది. రాజా గౌతమ్‌తో పాటు ఇతర నటీనటులకు, టెక్నీషియన్స్‌కు ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.
అలాగే అనిల్ రావిపూడి నాకు కథ చెప్పినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు సెట్‌కి వెళదామా, కామెడీ చేద్దామా అని ఉత్సాహంగా ఉంది. ఆ మధ్య రాజకీయాల్లోకి వెళ్లినప్పుడు రోజూ ఒత్తిడిగా ఉండేది. అలా నన్ను అన్నవాళ్లని, అననివాళ్లని కూడా తిట్టాల్సి వచ్చేది.
ఆ క్రమంలోనే ‘మీరు దేనికీ నవ్వడం లేదు’ అనేది మా ఆవిడ. హాస్య గ్రంథులు పనిచేయడం మానేశాయేమో అనిపించింది. ఖైదీ 150 సినిమా తర్వాత నేను మళ్లీ నవ్వడం మొదలైంది. అనిల్ సినిమాతో నాలో హాస్య గ్రంథులు తారాస్థాయికి వెళతాయని ఆశిస్తున్నా. మా కలయికలో మళ్లీ హిట్ కొడుతున్నాం అని చిరు ఆశాభావం వ్యక్తం చేశాడు.
గెస్ట్‌లుగా హాజరైన దర్శకులు నాగ్ అశ్విన్, అనిల్ రావిపూడి సినిమా సక్సెస్ సాధించాలని టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. తాత మనవడి మధ్య జరిగే ప్రేమ కథ ఇదని బ్రహ్మానందం అన్నారు. చిన్న పిల్లల దగ్గర్నుంచీ పెద్ద వాళ్ల వరకు ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుందని రాజా గౌతమ్ అన్నాడు.
బ్లెస్ చేయడానికి వచ్చిన చిరంజీవి గారికి, సపోర్ట్ చేసిన బ్రహ్మానందం గారు, నటీనటులకు థ్యాంక్స్ చెప్పాడు దర్శకుడు ఆర్‌వీఎస్ నిఖిల్. ‘బ్రహ్మానందం’ టైటిల్‌లో బ్రహ్మానందం గారు నటిస్తున్నారంటేనే చాలా బాధ్యతగా భావించామని నిర్మాత రాహుల్ యాదవ్ అన్నారు. హీరోయిన్స్ ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్, దివిజ, నటులు రాజీవ్ కననకాల, వెన్నెల కిషోర్, రఘు బాబు తదితరులు పాల్గొన్నారు.