కేంద్రాన్ని బద్నాం చేసే యత్నం..

విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. రాష్ట్రానికి మెగా టెక్స్​టైల్ పార్కు ప్రకటించారు. ఆయన ప్రకటనతో లక్షలాది మంది యువతకు ఉపాధి, కార్మికులకు పని, పత్తి రైతులకు మేలు జరగనున్నాయి. వేలాది ఎకరాల్లో నిర్మాణమయ్యే టెక్స్​టైల్ పార్కులో రైతు పండించిన పత్తి ఫ్యాక్టరీకి, ఫ్యాక్టరీ నుంచి నూలు వీవర్ కు, వీవర్ నుంచి వస్త్రం ఇతర దేశాలకు వెళ్లనుంది. ప్రధాని ఇంతటి భారీ మెగా టెక్స్ టైల్ పార్కును ప్రకటించడం ఆయనకు తెలంగాణ ప్రజల మీద ఉన్న ప్రేమకు నిదర్శనం. స్వాగతం తెలిపే సంస్కారం ఎట్లాగూ కోల్పోయిన రాష్ట్ర సీఎం.. ఇంతటి భారీ ప్రాజెక్ట్ ప్రకటించినందుకు ప్రధానికి అభినందనలైనా తెలపాల్సింది. అదీగాక చేనేతకు కేంద్రం అన్యాయం చేస్తోందని, బహిరంగ సభ అయిపోయిన రెండు రోజుల తరువాత ఓ పత్రికలో విషప్రచారం మొదలు పెట్టించారు. 

చేనేతకు రాష్ట్ర మంత్రి ఏం చేశారు?

ఉమ్మడి ఆంధ్రా పాలకుల కన్నా ఇప్పుడు ఉన్న చేనేత మంత్రి చేనేతకు ఏమి చేశారో చెప్పాలి. మొన్నటి బడ్జెట్ లో రూ.460 కోట్లు చేనేతకు కేటాయించిన ప్రభుత్వం.. అందులోంచి రూ. 400 కోట్లు బతుకమ్మ చీరలకే వెచ్చిస్తోంది. చేనేత మగ్గాల ఆధునీకరణ కోసం రూ. 200 కోట్లు అవసరమైనా ఆ కేటాయింపులు లేవు. చేనేత వర్కు షెడ్ పథకానికి 8 ఏండ్ల నుంచి కేటాయింపులు లేవు. దీనికి రూ.300 కోట్ల వరకు అవసరం. చేనేత మిత్ర అనే పథకంలో 40 శాతం నూలు సబ్సిడీ ఉండగా.. దీనికి రూ. 50 కోట్లు అవసరం. గత 6 నెలలుగా అడపాదడపా అమలు చేస్తున్నారు తప్ప కేటాయింపులు ఏమీ లేవు. పొదుపు పథకం(థ్రిఫ్ట్ ఫండ్) ఏడాది నుంచి నిలిపివేశారు. దీనివల్ల చేనేత కార్మికులు పొదుపు చేయాల్సిన సమయాన్ని, డబ్బును కోల్పోయారు. ఎందుకు నిలిపివేశారో చేనేత మంత్రి ఇప్పటికీ వివరణ ఇవ్వలేదు. హుజూరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే దాన్ని అమలు చేశారన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. గత 8 ఏండ్లుగా పవర్‌‌‌‌లూమ్ కార్మికులకు పొదుపు పథకం కోసం రూ.100 కోట్లు అవసరం దీనికీ కేటాయింపులు లేవు. 350 చేనేత సహకార సంఘాలకు120 సహకార సంఘాలు వస్త్రాలు ఉత్పత్తి చేస్తున్నాయి. ఉత్పత్తి చేసిన వస్త్రాలను అమ్ముకోలేని పరిస్థితి నెలకొంది. 

టెస్కో షోరూంలేవి?

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముందుచూపుతో సహకార వ్యవస్థ బలంగా ఉండాలని, నాణ్యతతో కూడిన వస్త్రాలను ఉత్పత్తి దారుల నుంచి నేరుగా కొనుగోలుదారుడికి కచ్చితమైన ధరలకు అందించాలని భావించారు. ఆయన ముందుచూపుతో రాష్ట్ర వ్యాప్తంగా 30 నుంచి 40 వరకు టెస్కో షోరూంలు ఏర్పాటు చేశారు. అవి వాడకంలో లేకుండా పోయాయి. వీటికి రూ.500 కోట్లు కేటాయిస్తే ప్రైవేటు లేదా ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏసీ షోరూంలుగా తీర్చిదిద్దవచ్చు. మంత్రి కేటీఆర్ చేనేత మంత్రిగా సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించలేదు. చేనేత కార్పొరేషన్, పవర్‌‌‌‌లూమ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయిస్తామని ఎనిమిదేండ్లుగా చెప్తూనే ఉన్నారు. పోచంపల్లి, మునుగోడు ప్రాంత చేనేత కార్మికులు ఉత్పత్తి చేసిన వస్త్రాలను టెస్కో కొనుగోలు చేయాలని, సంఘాలకు బకాయి పడిన డబ్బులు టెస్కో చెల్లించాలని 70 రోజులు సమ్మె చేస్తే.. చేనేత మంత్రి కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. 

కేంద్రాన్ని బద్నాం చేసే యత్నం..

బీజేపీ సహా అనేక మంది ప్రముఖుల అభిప్రాయాల మేరకు చేనేతపై జీఎస్టీ రద్దును కేంద్రం పరిశీలిస్తున్న ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే లక్ష్యంగా సంతకాల సేకరణ పేరుతో టీఆర్ఎస్ చేనేత వర్గం నేతలతో చేయిస్తున్న తప్పుడు విష ప్రచారాలను నేతన్నలు గుర్తించాలి. భారత దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు టెక్స్ టైల్ పార్క్ కోసం ప్రయత్నిస్తే కేవలం తెలంగాణ గడ్డపై ప్రధాన మంత్రికి ఉన్న ప్రేమతో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ కల్పించిన నమ్మకంతో ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం ఆయన టెక్స్ టైల్ పార్కును ప్రకటించారు. దీనికి ప్రధానికి అభినందనలు తెలపాల్సింది పోయి, కండ్లు ఉండి చూడలేక, చెవులుండి వినలేక అన్నట్లు ఇక్కడి పాలకుల ప్రవర్తన ఉన్నది. 

                                                                                                         - దుస్సా యాదగిరి నేత ,చేనేత పద్మశాలి సంఘం అధ్యక్షులు, ఓబీసీ మోర్చా రాష్ట్రకార్యవర్గ సభ్యులు