- 101 ప్లాట్లలో ఏడాదిగా అమ్ముడుపోయింది 21 మాత్రమే..
- అందులో పూర్తిస్థాయి రిజిస్ట్రేషన్లు జరిగింది 9 ప్లాట్లకే..
- వెంచర్లో ఎక్కడికక్కడ నిలిచిపోయిన అభివృద్ధి పనులు
- మరోసారి ఓపెన్ ఆక్షన్ నిర్వహించేందుకు అధికారులు మల్లగుల్లాలు
సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లా కేంద్రం శివారులో ఏడాది కింద సుడా( సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వెంచర్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇక్కడి ప్లాట్లు కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. గడిచిన తొమ్మిది నెలల్లో రెండు సార్లు వేలం పాట నిర్వహించగా, కేవలం 21 ప్లాట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. మిగిలిన ప్లాట్లకు డిమాండ్లేకపోవడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. సిద్దిపేట శివారులోని మిట్టపల్లి వద్ద ఉన్న 14 ఎకరాల అసైన్డ్ భూములను అధికారులు ఏడాది కింద సేకరించారు.
సుడా ఆధ్వర్యంలో మెగా వెంచర్ప్లాన్చేశారు. రోడ్లు, పార్క్, డ్రైనేజీలు పోగా, మిగిలిన స్థలంలో161 ప్లాట్లు సిద్ధం చేశారు. వాటిలో 60 ప్లాట్లను(600 గజాల) అసైనీలకు కేటాయించగా, మిగిలిన వాటిని ఓపెన్ యాక్షన్ ద్వారా అమ్మాలని నిర్ణయించారు. రెండు విడతలుగా ఓపెన్ ఆక్షన్ నిర్వహించినప్పటికీ 21 ప్లాట్లే అమ్ముడయ్యాయి. వారిలో 9 మంది రిజిస్ట్రేషన్ చేయించుకోగా, ఎనిమిది మంది 25 శాతం మాత్రమే డబ్బులు కట్టారు. మిగిలిన నలుగురు కేవలం రూ.5వేలు చెల్లించారు. ఈ ప్లాట్ల అమ్మకం ద్వారా సుడాకు రూ.1.50 కోట్ల ఆదాయం రాగా, రిజిస్ట్రేషన్లు చేయించుకోని వారికి నోటీసులు ఇవ్వడానికి సుడా అధికారులు సిద్ధమవుతున్నారు.
రూ.6.50కోట్లతో మౌలిక వసతులు..
మెగా వెంచర్లో మౌలిక వసతుల కల్పనకు చేస్తున్న పనులు నిలిచిపోయాయి. దాదాపు రూ.6.50 కోట్ల వ్యయంతో ప్రారంభించిన రోడ్లు, డ్రైనేజీ, వాటర్ ట్యాంక్, వాటర్ పైప్ లైన్ పనులు 50 శాతం మాత్రమే పూర్తయ్యాయి. వెంచర్ ఎంట్రెన్స్ లో విశాలంగా నాలుగు తారు రోడ్లు నిర్మిచంగా, లోపల మట్టి చదును చేసి వదిలేశారు. ముందు భాగంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్, వాటర్ పైప్ లైన్లు పూర్తిచేసి, లోపల అసంపూర్తిగా వదిలేశారు. దీంతో కొన్ని చోట్ల డ్రైనేజీ చాంబర్లు ధ్వంసమయ్యాయి. వాటర్ ట్యాంక్, పార్క్ పనులు మొదలేకాలేదు. ప్లాట్లకు డిమాండ్లేకపోవడంతో పనులు నిలిపివేసినట్లు తెలుస్తోంది.
వెనక్కి ఇవ్వాలంటున్న అసైనీలు
ఇప్పటికే రెండు సార్లు ఓపెన్ ఆక్షన్ నిర్వహించినా, స్పందన రాకపోవడంతో మరోసారి నిర్వహించాలా? వద్దా? అని అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సుడా చైర్మన్, వైస్ చైర్మన్లను తొలగించింది. కొత్తగా ఎవరినీ నిమించలేదు. ఇదే సమయంలో మెగా వెంచర్ కోసం సేకరించిన తమ భూములు వెనక్కి ఇవ్వాలని మిట్టపల్లికి చెందిన దళిత అసైనీలు సుడా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో ఓపెన్ ఆక్షన్ నిర్వహిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని అధికారులు ఆలోచిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ప్రభుత్వం సుడాను కొనసాగిస్తుందా? లేక రద్దు చేస్తుందా? అనే ప్రచారం తెరపైకి వచ్చింది.
విధుల్లో ఔట్ సోర్సింగ్ సిబ్బంది
సుడా ఏర్పాటైనప్పటి నుంచి ఔట్ సోర్సింగ్ సిబ్బందితోనే పనులు చక్కబెడుతున్నారు. సుడా ఏఓ డిప్యూటేషన్ పై రాగా మరో 13 మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. మొన్నటి వరకు మారెడ్డి రవీందర్ రెడ్డి చైర్మన్ గా, రిటైర్డ్ మున్సిపల్ ఆఫీసర్ రమణాచారి వైస్ చైర్మన్ గా పనిచేస్తూ వచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సుడా చైర్మన్ తోపాటు వైస్ చైర్మన్‌ను తొలగించింది. ప్రస్తుతం ఆ పదవులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం కొత్తవారిని నియమించే వరకు ఓపెన్ ఆక్షన్‌పై నిర్ణయం తీసుకునే పరిస్థితులు కనిపించడం లేదు.
Also Read : ఎన్నికల వేళ మూవీ వార్
ఎన్నికల కోడ్‌తో వేలం నిర్వహించలేదు
ఎన్నికల కోడ్ వల్ల సుడా మెగా వెంచర్ లో ఓపెన్ ఆక్షన్ నిర్వహించలేదు. అధికారులతో చర్చించి మరోసారి ఓపెన్ ఆక్షన్ పై నిర్ణయం తీసుకుంటాం. గతంలో ఓపెన్ ఆక్షన్ లో పాల్గొని, ప్లాట్లకు డబ్బు కట్టని వారికి నోటీసులు జారీ చేస్తాం.
- వందనం, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్, సుడా