మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హై లెవల్ కమిటీ (హెచ్ఎల్సీ) ఆదేశాల మేరకు షిల్లాంగ్ మునిసిపల్ బోర్డ్ (ఎస్ఎంబీ) అధికారులు వారం రోజుల కిందట పంజాబీ లేన్ వాసులకు చాలా మందికి వ్యక్తిగతంగా నోటీసులు అందజేశారు. తాళం వేసి ఉన్న ఇళ్లల్లో నోటీసులను డోర్లకు అంటించారు. ‘ఈ ఇంట్లో ఎన్నేళ్ల నుంచి ఉంటున్నారు?, ఇల్లు లేదా ఇంటి స్థలం మీకెలా వచ్చింది? దాని స్వాధీనానికి సంబంధించిన పత్రాలు ఏవైనా మీ వద్ద ఉంటే జూన్ 3వ తేదీ నుంచి జూలై 3వ తేదీ లోపు ఇవ్వండి’ అని నోటీసుల ద్వారా తెలిపారు.
పంజాబీలు ఇచ్చే సమాచారం లేన్ ఇష్యూని పరిష్కరించటం కోసం ప్రభుత్వం లాంగ్, షార్ట్ టర్మ్ పాలసీలను రూపొందించటానికి ఉపయోగపడుతుందని నోటీసుల్లో వివరించారు. ఆ వీధిలో నివసించే వందల మందిలో ఎస్ఎంబీ స్టాఫ్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ల ఉద్యోగులు, వాళ్ల కుటుంబ సభ్యులు 184 మంది మాత్రమే అక్కడ చట్టబద్ధంగా సెటిలైనట్లు సర్కారు గుర్తించింది. మిగతావాళ్లను ఆ ప్రాంతం నుంచి వేరే చోటకి తరలించాలనే డిమాండ్లు వివిధ వర్గాల నుంచి వస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.
ఎందుకీ డిమాండ్లు?
సరిగ్గా ఏడాది కిందట ఈ ప్రాంతంలో అల్లర్లు చెలరేగాయి. ఒక బస్ డ్రైవర్, అతని ఫ్రెండ్ పైన పంజాబీ లేన్‌లో ఎటాక్ జరగటంతో ఆ ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారనే రూమర్లు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో ఆగ్రహం చెందిన ప్రజలు పంజాబీ గల్లీలోని షెల్టర్లపై విరుచుకుపడ్డారు. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు ఏరియా అంతటా నెల రోజులకు పైగా పోలీసులు కర్ఫ్యూ విధించారు.
ఈ నేపథ్యంలో వెంటనే స్పందించిన పంజాబ్ ప్రభుత్వం ఒక ప్రతినిధి బృందాన్ని షిల్లాంగ్‌కి పంపింది. బృందం సభ్యులు మొదట షెల్టర్వాసులతో మాట్లాడి, తర్వాత మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మాను కూడా కలిసి చర్చించారు. అనంతరం.. ఘర్షణల వల్ల నష్టపోయినవారికి పంజాబ్ సర్కారు రూ.60 లక్షల పరిహారాన్ని ప్రకటించింది. దీని పట్ల అభ్యంతరం, అసంతృప్తి వ్యక్తం చేసిన మేఘాలయ గవర్నమెంట్ ఈ పరిణామాలతో పంజాబీ లేన్ ఇష్యూపై దృష్టి పెట్టి, హెచ్ఎల్సీని ఏర్పాటు చేసింది.
ఆ ప్రాంతంలో ఎస్ఎంబీ చేత ఇన్వెంటరీ సర్వే చేయించటంతో అక్కడ 300కుపైగా కుటుంబాలు నివసిస్తున్నట్లు తేలింది. అయితే.. ఈ సర్వేకు సెటిలర్లు సహకరించలేదనే వాదనలు వినిపించాయి. తమ వివరాలను మేఘాలయ ప్రభుత్వం కావాలనే తవ్వితీస్తోందని భావించిన పంజాబీలు గత డిసెంబర్లో గవర్నర్ తథాగత రాయ్‌ని కలిసి హెచ్ఎల్సీని రద్దు చేయాలని కోరారు. తమను ఆ ప్రాంతం నుంచి వెళ్లగొట్టడానికి హెచ్ఎల్సీ ఆదేశాలు జారీ చేస్తోందని ఆరోపించారు.
అసలు ఎవరు వీళ్లు?
బ్రిటిషర్ల కాలంలో ఇక్కడకు పంజాబ్ నుంచి దళిత సిక్కులను తీసుకువచ్చారు. వీరంతా మాన్యువల్ స్కావెంజర్లుగా పనిచేసేవారు. దాదాపు 200 ఏళ్లుగా వారు మేఘాలయలో నివసిస్తున్నా ఎన్నడూ ఎటువంటి తగాదాలు చోటుచేసుకోలేదు. 1980లో మేఘాలయ ప్రభుత్వం పారిశుద్ధ్య విభాగంలో యంత్రాలను ప్రవేశపెట్టింది. షిల్లాంగ్ మునిసిపల్ బోర్డు, కంటోన్మెంట్ బోర్డు, స్టేట్ గవర్నమెంట్ కార్యాలయాలు, హాస్పిటళ్లు, పోలీసు డిపార్టుమెంట్లలో మాన్యువల్ స్కావెంజర్లుగా పనిచేసే దళిత సిక్కులు నిరుద్యోగులుగా మారారు.
వీళ్లు నివసించే పంజాబీ ప్రాంతాలను అక్రమ మురికివాడలుగా గుర్తించసాగింది. లోకల్‌గా ప్రాబల్యంగల ఖాసీ గిరిజనులు వీళ్లను క్రిమినల్స్‌గా చూడసాగారు. ఖాసీ ఘరో జైంటియా సంఘాలు, ఖాసీ స్టూడెంట్ యూనియన్లు పంజాబీ సెటిటర్లకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. ఇది కాస్తా ప్రస్తుతం యాంటీ–పంజాబీ సెంటిమెంట్‌గా మారింది.