Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి.. స్పందించిన మెగాస్టార్ చిరంజీవి

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌ (Saif Ali Khan)పై జరిగిన దాడి ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఈ ఘటన సినీ మరియు రాజకీయ నాయకులతో సహా భారతదేశ వ్యాప్తంగా ఎంతోమందిని దిగ్భ్రాంతికి గురి చేసింది. సైఫ్‌పై ఎటాక్ జ‌ర‌గ‌డంపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) X ద్వారా స్పందించారు.

" సైఫ్ అలీఖాన్‌పై ఒక దుండగుడు దాడి చేశాడనే వార్త విని తీవ్ర కలత చెందాను. అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను మరియు ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను" అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

ఇప్పటికే హీరో జూనియర్ ఎన్టీఆర్ సైతం సైఫ్‌పై ఎటాక్ జ‌రిగింద‌ని తెలిసి షాక‌య్యానంటూ ట్వీట్ చేశారు."సైఫ్‌పై ఎటాక్ జ‌రిగింద‌ని తెలిసి షాక‌య్యాను.. దాడి ఘ‌ట‌న చాలా బాధ‌క‌రం.సైఫ్ అలీఖాన్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని, సంపూర్ణ ఆరోగ్య వంతుడిగా తిరిగి రావాల‌ని ఎన్టీఆర్ ట్వీట్‌లో తెలిపారు. 

అసలేం జరిగిందంటే:

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్  తెల్లవారుజామున ముంబైలోని తన బాంద్రా వెస్ట్ నివాసంలో దోపిడీ ప్రయత్నంలో గాయపడ్డారు. కత్తిపోట్లకు చికిత్స చేసేందుకు లీలావతి ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయిస్తున్నట్లు ఆసుపత్రి ధ్రువీకరించింది. గురువారం (జనవరి 16, 2025) ఘోరమైన దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి బాంద్రాలోని సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడి దారుణంగా పొడిచేశాడు. గురువారం తెల్లవారు జామున 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. సైఫ్ పై ఏకంగా ఆరు కత్తిపోట్లు పొడిచాడు దుండగుడు. ఇందులో రెండు పోట్లు లోతుగా దిగటంతో సైఫ్ పరిస్థితి విషమించింది. తీవ్రంగా గాయపడ్డ సైఫ్ ను ముంబైలోని లీలావతి హాస్పిటల్ కు తరలించారు. ఆరు కత్తిపోట్లతో తీవ్ర రక్తస్రావం జరిగి సైఫ్ కండీషన్ సీరియస్ గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.