స్వయం కృషి తర్వాత నా చెప్పులు నేనే కుట్టుకున్నా: చిరంజీవి

కళా తపస్వి, దిగ్గజ దర్శకులు కే. విశ్వనాథ్ తనకు గురువు, తండ్రి సమానులు అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.  షూటింగ్ సమయాల్లో తాను తినకుండా పడుకున్నప్పుడు లేపి తినిపించారని గుర్తు చేసుకున్నారు. తనను కన్నబిడ్డలా చూసుకునే వారని..నటనలో మెళుకువలు నేర్పారని చెప్పారు. తాను యాక్షన్ సినిమాలు చేస్తున్న సమయంలో డిఫరెంట్ స్టోరీల్లో నటించే అవకాశం కల్పించారని చెప్పారు.  తాను కూడా క్లాసికల్ డాన్స్ చేయగలనని విశ్వనాథ్ సినిమాల ద్వారే తెలిసిందన్నారు. తనలో ఉన్న టాలెంట్ బయటికి తీసుకొచ్చిన గురువు దర్శకులు విశ్వనాథ్ అని చిరంజీవి తెలిపారు. కళాతపస్వి కే విశ్వనాథ్ కి టాలీవుడ్ ఘన నివాళి అర్పించింది. కళాంజలి పేరుతో ఆయన సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ఈ వేదికగా చిరంజీవి  కే విశ్వనాథ్ గారి సేవలను గుర్తు చేసుకున్నారు.  ఇది కే విశ్వనాథ్  సంతాప సభ కాదు.. ఆయనకు ధన్యవాద సభ అన్నారు.  

 నా చెప్పులు నేనే కుట్టుకున్నా..

స్వయం కృషి సినిమాలో చెప్పులు కొట్టుకునే వ్యక్తి పాత్ర నాది అని చిరంజీవి గుర్తు చేశారు. ఆ సినిమా  తర్వాత తన చెప్పులు తానే కుట్టుకునేంత అయ్యానని చెప్పుకొచ్చారు. విశ్వనాథ్ సినిమాలు సహజత్వానికి దగ్గరగా ఉంటాయన్నారు. ఇంట్లో పనిచేసుకుంటూ మాట్లాడే డైలాగ్స్ ను ఆయన క్యాప్చర్ చేస్తారని..కానీ నేటి దర్శకులు అలా చేయడం లేదన్నారు. విశ్వనాథ్ సెంటిమెంట్ సీన్ ఐతే పిండేస్తారని చెప్పారు. తనపై విశ్వనాథ్ ప్రభావం బాగా పడిందన్నారు. తాను డైరెక్టరును కాకపోవచ్చు కానీ ఆయనలా ఆలోచిస్తానన్నారు. శంకరాభారణం ద్వారా తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారని చిరంజీవి ప్రశంసించారు.