ఏపీలో ఎన్నికల నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గం పేరు మార్మోగుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుండి పోటీ చేస్తుండటమే ఇందుకు కారణం. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిన పవన్, ఈసారి ఎన్నికల్లో ఎలా అయినా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కు టీడీపీ, బీజేపీల మద్దతు ప్లస్ అని భావిస్తుండగా, చిరంజీవి రూపంలో అంతకు మించిన కొండంత బలం వచ్చి చేరింది.
ఇటీవలే చిరంజీవి కూటమి అభ్యర్థులకు మద్దతు తెలపడం, కూటమికే ఓటేయాలని ప్రజలను కోరడం అధికార వైసీపీలో టెన్షన్ కి కారణం అయ్యింది. ఇదిలా ఉండగా, పవన్ కళ్యాణ్ కోసం మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగుతున్నారని తెలుస్తోంది. పిఠాపురంలో రెండు రోజులు పర్యటించి పవన్ కు మద్దతుగా ప్రచారం చేయాలని చిరంజీవి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ వార్త జనసైనికుల్లో ఉత్సాహం నింపుతోంది. పవన్ క్రేజ్ కి మెగాస్టార్ మేనియా తోడైతే అఖండ మెజారిటీ ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు. మరి, ఈ వార్తల్లో నిజమెంత, పవన్ కోసం చిరు ప్రచారం చేస్తారా లేదా అన్నది వేచి చూడాలి.