Chiranjeevi 69 Birthday: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెగాస్టార్ చిరంజీవి కుటుంబం

‘మెగాస్టార్’ చిరంజీవి (69) పుట్టినరోజు గురువారం (ఆగస్ట్ 22) సందర్భంగా కుటుంబంతో కలిసి చిరు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం వీఐపీ ప్రారంభ విరామ సమయంలో సతీమణి సురేఖతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు.

తన 69వ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నారు చిరు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి.. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయాన్ని సందర్శించేటప్పుడు చిరంజీవి సంప్రదాయ దుస్తులను ధరించారు.

శ్రీవారిని దర్శించుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి బుధవారం ఆగస్ట్ 21 రాత్రే రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. మెగాస్టార్ దంపతులతో పాటు చిరు తల్లి అంజనా దేవి, కుమార్తె శ్రీజ, మనవరాలు ఉన్నారు. ప్రస్తుతం చిరుకు సంబందించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

1978లో పునాదిరాళ్లు సినిమాతో అరంగేట్రం చేసిన చిరంజీవి..తన బహుముఖ నటనా నైపుణ్యంతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.ఇటీవల, చిరంజీవిని భారత ప్రభుత్వం రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‌తో సత్కరించింది.ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చిరంజీవి ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. ఈ వేడుక మే 9న దేశ రాజధానిలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగింది.