- సుంకిశాల ఘటనతో రాజుకున్న చిచ్చు
- బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం
- ఎంక్వైరీ తర్వాత యాక్షన్ ఉంటుందన్న మంత్రి ఉత్తమ్
- మేఘా కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలని బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్
- పదేండ్లుగా మేఘాను పెంచి పోషించిన రెండు పార్టీలు
- లక్షల కోట్ల కాంట్రాక్టులతో అపర కుబేరుడి స్థాయికి మేఘా కృష్ణారెడ్డి
- భారీ మొత్తంలో పార్టీలకు ఎన్నికల బాండ్లు.. రూ.586 కోట్లు బీజేపీకి..
- రూ.195 కోట్లు బీఆర్ఎస్కుకొన్న రూ.966 కోట్ల బాండ్లలో
- సింహభాగం ఆ రెండు పార్టీలకే!
- ఇప్పుడు కాంగ్రెస్‌ను ఇరుకునపెట్టే యత్నం
హైదరాబాద్, వెలుగు : సుంకిశాల ఘటన నేపథ్యంలో మేఘా కంపెనీ వ్యవహారం రాజకీయ చిచ్చు రాజేసింది. ఈ నెల 2న జరిగిన ప్రమాదంలో సుంకిశాల సర్జ్‌పూల్‌లోని రిటైనింగ్ వాల్ కుప్పకూలింది. ఈ ఘటన తర్వాత బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, బీజేపీ నుంచి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ సర్కారును లక్ష్యంగా చేసుకొని ట్వీట్లు, ప్రెస్ మీట్లు పెడ్తున్నారు. వాస్తవానికి కాళేశ్వరం, పాలమూరు–-రంగారెడ్డి, మిషన్ భగీరథ లాంటి పలు కీలకమైన ప్రాజెక్టులతో పాటు సుంకిశాల కాంట్రాక్ట్‌ను మేఘాకు కట్టబెట్టిందే గత బీఆర్ఎస్ సర్కారు కాగా..
ఇటీవల కూలిన సర్జ్‌పూల్ పనులు కూడా వాళ్ల హయాంలోనే మొదలయ్యాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మేఘా కట్టిన కన్నెపల్లి పంప్‌హౌస్ కూలి వెయ్యి కోట్ల రూపాయల నష్టం జరిగినప్పుడు బ్లాక్‌లిస్టులో పెట్టని బీఆర్ఎస్ పెద్దలు, నాడు డిమాండ్ చేయని బీజేపీ నేతలు.. ఇప్పుడు ఓవైపు ఎంక్వైరీ జరుగుతుండగానే మరోవైపు మేఘాను బ్లాక్‌లిస్టులో పెట్టాలని డిమాండ్ చేయడం రాజకీయ కుట్రలో భాగమేనని కాంగ్రెస్ లీడర్లు విమర్శిస్తున్నారు.
సుంకిశాల గోడ కూలిన ఘటనపై ఇప్పటికే విచారణకు హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లయిస్ (హెచ్ఎండబ్ల్యూఎస్) డిపార్ట్మెంట్ ఓ కమిటీని వేసింది. ఎంక్వైరీ తర్వాత కాంట్రాక్ట్ సంస్థ నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది. విచారణ తర్వాత బాధ్యులపై చర్యలు తప్పవని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా క్లారిటీ ఇచ్చారు. కానీ.. బీఆర్ఎస్, బీజేపీ నేతలు మాత్రం మేఘాను వెంటనే బ్లాక్‌లిస్టులో పెట్టాలని డిమాండ్చేస్తున్నారు. గడిచిన పదేండ్లలో మేఘాకు లక్షల కోట్ల విలువైన కాంట్రాక్టులను ఇచ్చి, ఆ సంస్థను పెంచి, పోషించిన బీఆర్ఎస్, బీజేపీ పెద్దలు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఎన్నికల బాండ్లుగా రెండు పార్టీలకు దండిగా పైసలు
తనకు భారీ ప్రాజెక్టులు కట్టబెట్టిన బీఆర్ఎస్, బీజేపీకి మేఘా కంపెనీ ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో భారీగానే చదివించుకుంది. బీజేపీకి రూ. 586 కోట్ల మేర చందాలిచ్చింది. మేఘా రూ. 966 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లు కొంటే అందులో 60 శాతం బీజేపీకే ఇవ్వడం గమనార్హం. ఇటు బీఆర్ఎస్ పార్టీకి రూ.195 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఆ సంస్థ విరాళాలిచ్చింది. ఎలక్టోరల్ బాండ్స్ సీక్రెట్ అంటూ కొన్ని నెలల పాటు గుట్టుగా దాచేసిన ఎస్బీఐ.. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడంతో వాటిని బయటపెట్టకతప్పలేదు. ఇతర పార్టీలకూ మేఘా సంస్థ విరాళాలిచ్చినా ఇంత భారీ స్థాయిలో మాత్రం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే ఎలాంటి లబ్ధి చేయకపోతే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు మేఘా సంస్థ అంత మొత్తంలో విరాళాలు ఎందుకు ఇచ్చిందన్న వాదనను కాంగ్రెస్ నేతలు తెరపైకి తీసుకొస్తున్నారు.
బురదజల్లే ప్రయత్నమే..!
వాస్తవానికి సుంకిశాల ప్రాజెక్టును మేఘా కంపెనీకి నామినేషన్ పద్ధతిలో అప్పగించిందే గత బీఆర్ఎస్ సర్కార్ అని కాంగ్రెస్‌నేతలు చెప్తున్నారు. వేగం వేగం అని తొందరపెట్టడం.. పనుల్లో నాణ్యత పాటించకపోవడంలాంటి కారణాల వల్లే సుంకిశాల ప్రాజెక్టు గోడ కూలిపోయిందన్న వాదన ఉంది. పంప్‌హౌస్ రిటైనింగ్, సొరంగ మార్గాల నుంచి సీపేజీ వస్తున్నదని అక్కడ పనిచేసే సిబ్బంది చెప్పినా.. అధికారులు వివరించినా.. మేఘా సంస్థ ప్రతినిధులు పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలోనూ అదే జరిగిందన్న సంగతిని కాంగ్రెస్లీడర్లు గుర్తుచేస్తున్నారు.
పంప్‌హౌస్‌లు మునిగితే గత సర్కార్ కనీసం అటువైపు ఎవరినీ వెళ్లనివ్వలేదని, అత్యంత గోప్యంగా దాచిపెట్టిందంటున్నారు. పంప్‌హౌస్‌లలో జరిగిన నష్టం ఏంటో ఆ నీళ్లన్నింటినీ తోడేసిన తర్వాతగానీ తెలియలేదన్న విషయాన్ని పేర్కొంటున్నారు. వేల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్‌హౌస్ మునిగిపోయినప్పుడే గత బీఆర్ఎస్ సర్కార్ ఆ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాల్సిందిపోయి.. ఇప్పుడు బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందని అంటున్నారు.
అప్పుడు ఎన్ని డిమాండ్లు వచ్చినా పట్టించుకోని బీఆర్ఎస్.. ఇప్పుడు మాత్రం వాళ్ల హయాంలోనే ఆ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చిన సుంకిశాల గోడ కూలిపోతే మాత్రం మాట్లాడడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. తప్పు వాళ్లవైపే ఉన్నా ఇలా వ్యాఖ్యానించడం సర్కారుపై బురదజల్లే ప్రయత్నమేనని మండిపడుతున్నారు.
బీఆర్ఎస్, బీజేపీ అండతో ఎదిగిన మేఘా!
ఒకప్పుడు సివిల్ ఇంజనీరింగ్ ప్రాజెక్టుల్లో పెద్దగా అనుభవమే లేని మేఘా కంపెనీ.. కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టులను చేపట్టే స్థాయికి ఎదిగిన వైనంపై రాజకీయ వర్గాల్లో చాలా కాలంగా చర్చ జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మెట్రో వాటర్ సప్లయ్, మిషన్ భగీరథ, కాళేశ్వరంలాంటి కీలక ప్రాజెక్టులన్నింటినీ నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మేఘా సంస్థకు కట్టబెట్టింది. అసలు టెండర్లు లేకుండానే నామినేషన్ పద్ధతిలో మేఘా సంస్థకు పలు పనులు అప్పగించింది. నామినేషన్లపై దక్కించుకున్న కన్నెపల్లి పంప్‌హౌస్‌తో పాటు సుంకిశాల సర్జ్పూల్కూడా కుప్పకూలాయి.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా మేఘా సంస్థకు అండగా నిలిచిందనే ఆరోపణలు ఉన్నాయి. జమ్మూకాశ్మీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జోజిలా టన్నెల్ నిర్మాణ పనుల కాంట్రాక్ట్‌ను మేఘా సంస్థకే కేంద్రం అప్పగించింది. కొన్ని వేల కోట్ల విలువ చేసే ఆ ప్రాజెక్ట్ టెండర్ మేఘాకు దక్కడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. 2016లో టన్నెల్‌కు టెండర్లు పిలిచినప్పుడు ఎల్ అండ్ టీ
టన్నెల్స్ నిర్మాణంలో అత్యంత అనుభవం ఉన్న ఇండియన్ రైల్వేస్‌కు చెందిన ఇర్కాన్ ఇంటర్నేషనల్ సంస్థలూ బిడ్ దాఖలు చేసినా మేఘాకే టెండర్ వచ్చింది. అనుభవం ఉన్న కంపెనీలను వదిలేసి అసలు టన్నెల్ నిర్మాణంలో అనుభవమే లేని సంస్థకు కేంద్రం ప్రాజెక్టును అప్పగించడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇట్లా లక్షల కోట్ల కాంట్రాక్టుల వల్లే మేఘా కృష్ణారెడ్డి అపరకుబేరుడి స్థాయికి ఎదిగారన్న చర్చ జరుగుతున్నది.