- దావోస్‌లో రాష్ట్ర సర్కార్‌తో మూడు ఒప్పందాలు చేసుకున్న కంపెనీ
- రాష్ట్రంలో పంప్డ్ స్టోరేజ్, బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టుల ఏర్పాటు
- అనంతగిరిలో వరల్డ్ క్లాస్ లగ్జరీ రిసార్ట్ నిర్మాణం
- 7 వేల మందికి ఉద్యోగావకాశాలు
హైదరాబాద్, వెలుగు: దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు వేదికగా రాష్ట్ర ప్రభుత్వంతో మేఘా ఇంజనీరింగ్ కంపెనీ మూడు ఒప్పందాలు కుదుర్చుకుంది. రాష్ట్రంలో రూ.15 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆ కంపెనీ ముందుకొచ్చింది.
ఈ ఒప్పందాలపై మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో మేఘా కంపెనీ ఎండీ కృష్ణారెడ్డి సంతకాలు చేశారు. రాష్ట్రంలో 2,160 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో మేఘా కంపెనీ ఎంవోయూ కుదుర్చుకుంది.
ఈ ప్రాజెక్టు కోసం దాదాపు రూ.11 వేల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా దాదాపు 1,250 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఉద్యోగుల నియామకాల కోసం కంపెనీ క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్ నిర్వహించనుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 లక్ష్య సాధనలో పాలుపంచుకునేందుకు ఈ ప్రాజెక్టు చేపట్టినట్టు మేఘా కంపెనీ ఎండీ కృష్ణారెడ్డి తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థ..
రాష్ట్రంలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో మేఘా కంపెనీ మరో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రదేశాల్లో100 ఎంవీహెచ్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థను ఈ కంపెనీ అభివృద్ధి చేయనుంది.
ఇందుకోసం రూ.3 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీని ద్వారా రెండేండ్లలో వెయ్యి మందికి ప్రతక్ష్యంగా, మరో 3 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ఇంధన నిల్వ, గ్రిడ్ స్థిరత్వం, పీక్ లోడ్ నిర్వహణలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషించనుంది.
అలాగే పర్యాటక రంగంలోనూ పెట్టుబడులు పెట్టేందుకు మేఘా కంపెనీ ముందుకొచ్చింది. అనంతగిరిలో వరల్డ్ క్లాస్ లగ్జరీ వెల్ నెస్ రిసార్ట్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.
హైదరాబాద్ కు చెందిన మౌలిక సదుపాయాల సంస్థ భాగస్వామ్యంతో ఈ రిసార్ట్ ను అభివృద్ధి చేయనుంది. ఇందుకోసం రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 2 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.