అన్నీ పార్టీలకు మేఘా విరాళాలు ఇలా...

అన్నీ పార్టీలకు మేఘా  విరాళాలు ఇలా...

బీఆర్​ఎస్​, బీజేపీ, కాంగ్రెస్​.. పార్టీ ఏదైతే ఏంది? అన్ని పార్టీలతో మేఘా కంపెనీ దోస్తీ చేస్తున్నది. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి దగ్గరవుతున్నది. తెలంగాణలో పదేండ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్​ పార్టీతో సన్నిహితంగా మెదిలి కాళేశ్వరం, పాలమూరు– రంగారెడ్డి, మిషన్ ​భగీరథ లాంటి మేజర్​ ప్రాజెక్టులు దక్కించుకున్న ఆ కంపెనీ.. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్​కూ చేరువవుతున్నది. ఈ క్రమంలోనే  రూ.1126.23 కోట్ల విలువైన నారాయణపేట– కొడంగల్ సెకండ్ ప్యాకేజీ -పనులను దక్కించుకుంది.

2014 నుంచి 2024 వరకు పదేండ్ల కాలంలో తనకు భారీ ప్రాజెక్టులు కట్టబెట్టిన బీఆర్ఎస్​, బీజేపీకి మేఘా కంపెనీ ఎలక్టోరల్​ బాండ్స్​ రూపంలో భారీగానే చదివించుకుంది. ఫ్యూచర్​ గేమింగ్​అండ్​ హోటల్ సర్వీసెస్​ తర్వాత అత్యధిక విలువగల ఎన్నికల బాండ్లు కొన్నది మేఘా ఇంజినీరింగ్​కంపెనీయే కావడం గమనార్హం. మేఘా మొత్తం రూ.966 కోట్ల విలువైన ఎలక్టోరల్​ బాండ్లు కొంటే ఇందులో బీజేపీకి 60 శాతం మేర రూ.584 కోట్ల చందాలిచ్చింది. ఆ తర్వాత అత్యధికంగా బీఆర్​ఎస్​ పార్టీకి రూ.195 కోట్ల విరాళాలు అందజేసింది. 

మరే ఇతర ప్రాంతీయ పార్టీకి  కూడా ఒక సంస్థ నుంచి ఇంత పెద్దమొత్తంలో ఎన్నికల విరాళం దక్కలేదు. అటు తమిళనాడులోనూ అక్కడి రూలింగ్​పార్టీ డీఎంకేకు రూ.85 కోట్లు, ఏపీలో అప్పటి రూలింగ్​పార్టీ వైఎస్సార్​కాంగ్రెస్​కు రూ.37 కోట్లు ఇచ్చిన మేఘా యాజమాన్యం.. జాతీయ స్థాయిలో కాంగ్రెస్​కు రూ.18 కోట్లు ఇచ్చింది. లక్షల కోట్ల విలువైన కాంట్రాక్టులు ఇచ్చినందుకు ప్రతిఫలంగానే నాడు రూలింగ్​పార్టీలకు మేఘా కంపెనీ భారీగా విరాళాలిచ్చిందనే విమర్శలు వచ్చాయి. కాగా, నిరుడు డిసెంబర్​లో రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి రావడంతో మరోసారి కొత్త ప్రాజెక్టులు దక్కించుకోవడంపై మేఘా ఫోకస్​ పెట్టింది.

 సర్కారుకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. మొన్నటి వరదల సమయంలో రూ. 5 కోట్ల సాయం ప్రకటించిన మేఘా సంస్థ.. తాజాగా స్కిల్​ యూనివర్సిటీలో భవనాల నిర్మాణానికి సీఎస్​ఆర్ కింద రూ.  200 కోట్ల భారీ మొత్తం కేటాయించింది. కొడంగల్-నారాయణపేట స్కీంకు రూ.2,260.85 కోట్లతో సెప్టెంబర్ 14న టెండర్లు ఖరారు కాగా, 1,134.62 కోట్లతో మొదటి ప్యాకేజీ పనులను రాఘవ కన్స్ట్రక్షన్స్,  ₹1,126.23 కోట్ల విలువైన రెండో ప్యాకేజీ పనులను మేఘా కంపెనీ దక్కించుకున్నాయి. 

పార్టీలకు ఇచ్చిన ఎన్నికల బాండ్ల వివరాలు

 బీజేపీ : రూ.584 కోట్లు
బీఆర్ఎస్ : కే, 195
డీఎంకే : రూ. 85 కోట్లు
వైఎస్సార్సీపీ : రూ.37 కోట్లు
టీడీపీ : రూ. 28 కోట్లు
కాంగ్రెస్ : రూ.18
జేడీయూ : రూ.10 కోట్లు
 జేడీఎస్ : రూ. 5 కోట్లు
జనసేన : రూ. 4 కోట్లు