కావాలంటే కాళ్లు మొక్కుతా.. వనపర్తి టికెట్ ​త్యాగం చేయండి

కావాలంటే కాళ్లు మొక్కుతా.. వనపర్తి టికెట్ ​త్యాగం చేయండి
  • మాజీ మంత్రి చిన్నారెడ్డికి ఎంపీపీ మేఘారెడ్డి విజ్ఞప్తి
  • అనుచరులు,మద్దతుదారులతో వనపర్తిలో బల ప్రదర్శన
  • స్పందించకుంటే రెబల్​గా పోటీకి దిగుతానని ప్రకటన

వనపర్తి, వెలుగు : మాజీ మంత్రి చిన్నారెడ్డి కాంగ్రెస్​ హైకమాండ్​ను తప్పుదోవ పట్టించి వనపర్తి టికెట్ పొందారని పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి ఆరోపించారు. ఇప్పటికైనా మనసు మార్చుకొని పోటీ నుంచి తప్పుకోవాలని కోరారు. ఆదివారం తన అనుచరులు, మద్దతుదారులతో కలిసి వనపర్తి జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు.  అనంతరం  ఏర్పాటు చేసిన సమావేశంలో మేఘారెడ్డి మాట్లాడుతూ.. మాజీ మంత్రి చిన్నారెడ్డిపై తనకు ఎంతో గౌరవం ఉందని, పెద్దమనసు చేసుకుని పోటీ నుంచి తప్పుకోవాలని కోరారు.

కావాలంటే వవనపర్తి రాజీవ్ చౌక్ లో చిన్నారెడ్డి కాళ్లు మొక్కుతానని అన్నారు. వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ ను  బతికించేందుకు టికెట్​ను త్యాగం చేయాలని విజ్ఞప్తి చేశారు. 40 ఏండ్లుగా చిన్నారెడ్డి పార్టీలో అనేక పదవులు అనుభవించారని, కొత్త వారికి వచ్చే అవకాశాన్ని బలవంతంగా లాక్కోవడం ఏమిటని ప్రశ్నించారు. గత అసెంబ్లీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యాక ప్రత్యక్ష రాజకీయాల్లో ఇక పోటీ చేయనని ప్రకటించిన చిన్నారెడ్డి, ఇప్పుడు మాట తప్పుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.

యువతకు అవకాశం ఇస్తానని చెప్పడంతో ఎంతో మంది కాంగ్రెస్​తో అనుబంధం పెంచుకున్నారని గుర్తు చేశారు. సర్వేలన్నీ తనకు అనుకూలంగా వచ్చాయని, అయినప్పటికీ ఏఐసీసీ సభ్యులను తప్పుదోవ పట్టించి టికెట్ పొందారని మేఘారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారెడ్డి త్యాగం చేయకపోతే, కాంగ్రెస్​ రెబల్​గా పోటీ చేయాలంటూ కార్యకర్తలు ఒత్తిడి తెస్తున్నారన్నారు. వాళ్ల నిర్ణయానికి అనుగుణంగా రెబల్​గా పోటీ చేసేందుకు కూడా సిద్ధమన్నారు.

వేరే పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదని, కాంగ్రెస్​లోనే ఉంటామన్నారు. సమావేశంలో వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు శంకర్ ప్రసాద్, లీడర్లు శ్రీనివాస్ గౌడ్, సతీశ్​కుమార్, సోళీపూర్ రవీందర్ రెడ్డి, ధనలక్ష్మితోపాటు వనపర్తి, పెద్దమందడి, పెబ్బేరు, గోపాల్ పేట మండలాల లీడర్లు పాల్గొన్నారు.