ఇప్పటి వరకు శాటిలైట్లు ప్రయోగించటమే చూశాం.. ఇప్పుడు శాటిలైట్లు కూల్చివేత కూడా చూడబోతున్నాం.. వంద, రెండు వందల కిలోల శాటిలైట్ కాదు అది.. ఏకంగా వెయ్యి కిలోల ఉపగ్రహాన్ని పేల్చేయబోతున్నది మన ఇస్రో.. రాకెట్ల ప్రయోగానికి ఎలా అయితే ముహూర్తం పెట్టారో.. అలాగే మెఘాట్రోపికస్ అనే టన్ను బరువు ఉన్న బాహుబలి శాటిలైట్ ను పేల్చేయాలని నిర్ణయించింది ఇస్రో.. ఎందుకు ఇలా చేస్తున్నారు.. కారణాలు ఏంటీ అనేది ఇప్పుడు చూద్దాం..
మేఘాట్రోపికన్ 1 అనే ఈ శాటిలైట్ ను 2011 అక్టోబర్ 12వ తేదీన.. ఏపీలోని శ్రీహరి కోట నుంచి ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. వాతావరణంలో మార్పులు, పర్యావరణ అధ్యయనం కోసం ఫ్రాన్స్ దేశంతో కలిసి ప్రయోగించారు. 13 ఏళ్లుగా ఎన్నో సేవలు అందించిన ఈ శాటిలైట్.. ఇప్పుడు పని చేయటం మానేసింది. వాస్తవంగా అయితే మూడేళ్లు పని చేస్తే చాలు అని.. శాస్త్రవేత్తలు అనుకున్నారు. కానీ.. ఇది 13 ఏళ్లు పని చేసింది. కొన్నాళ్ల నుంచి ఇది పని చేయటం మానేసింది.. సర్వీస్ అయిపోవడంతో.. అంతరిక్షంలో ఎప్పుడైనా గతి తప్పి.. భూమి వైపు దూసుకొచ్చే ప్రమాదం ఉండటంతో పేల్చివేయాలని నిర్ణయించింది ఇస్రో.
ఈ క్రమంలోనే కాలం చెల్లిన ఉపగ్రహాలను (శాటిలైట్లు) నియంత్రిత విధానంలో కూల్చివేయడంపై భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో(Isro) కసరత్తు మొదలుపెట్టింది. వాస్తవానికి అంతరిక్షంలోనే ఉపగ్రహాన్ని పేల్చివేసే సామర్థ్యం భారత్‌కు ఉంది. కానీ.. అలా చేస్తే వాటి శకలాలు భవిష్యత్తులో సమస్యాత్మకంగా మారనున్నాయి. ఈ క్రమంలో కాలం చెల్లిన ఒక ఉపగ్రహాన్ని పూర్తి నియంత్రిత విధానంలో సముద్రంలో కూల్చివేసేందుకు రంగం సిద్ధం చేసింది ఇస్రో.
తక్కువ భూకక్ష్యలో పరిభ్రమించే ‘మేఘ-ట్రోపికస్-1(ఎంటీఐ) ఉపగ్రహాన్ని ఇస్రోఈ ప్రయోగానికి ఎంచుకుంది. ఈ ఉపగ్రహం మార్చి 7న సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 7 గంటల 30 నిమిషాల లోపు భూమిపై కూలిపోవచ్చని అంచనా వేస్తున్నారు సైంటిస్టులు. పసిఫిక్ మహాసముద్రంలోని నిర్జన ప్రదేశంలో ‘మేఘ-ట్రోపికస్-1 పడేలా రూట్ మ్యాప్ ఇప్పటికే సిద్ధం చేశారు. ఒకవేళ భూమిపై పడినా పెద్ద ప్రమాదమేమీ ఉండదని చెబుతున్నారు సైంటిస్టులు.
ఇస్రో ప్రయోగించిన టన్ను బరువున్న ‘మేఘ’ ఉపగ్రహా ఆర్బిటాల్ లైఫ్‌టైమ్ 100 సంవత్సరాలు. దీనిలో ఇంకా 125 కిలోల ఇంధనం మిగిలి ఉంది. చాలాఏళ్లు కక్ష్యలో ఉంటే ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. వాస్తవానికి దానిలో ఉన్న ఇంధనం నియంత్రిత విధానంలో భూవాతావరణంలో ప్రవేశించడానికి సరిపోతుంది. 2022 ఆగస్టు నుంచి దీనిని కక్ష్య నుంచి కిందకు తీసుకురావడానికి 18 భ్రమణాలు చేయించారు.
ఎదురయ్యే సవాళ్లు..
పెద్ద ఉపగ్రహాలు, రాకెట్ శకలాలు భూవాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత ఏర్పడే ఘర్షణకు తట్టుకొనే అవకాశం ఉంది. ఇటువంటి వాటిని ఒక క్రమాను పద్ధతిలో కూలిస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉండవు. అయితే.. మేఘను నియంత్రిత విధానంలో భూకక్ష్యలోకి తెచ్చేలా డిజైన్ చేయలేదు. ఇదే ఇప్పుడు ఇస్రోకు సవాలుగా మారనుంది. ఈ శాటిలైట్ లోని కాలం చెల్లిన పరికరాల పనితీరు ఏమాత్రం బాగోదు. దీనికి తోడు భూమిపైకి తిరిగి వచ్చే సమయంలో కఠిన వాతావరణ పరిస్థితులను ఉపగ్రహ సబ్‌సిస్టమ్స్ తట్టుకోలేవు. ‘మేఘ’ ఉపగ్రహ కూల్చివేత సమయంలో ఎదురయ్యే సవాళ్లను అధ్యయనం చేయవచ్చని ఇస్రో భావిస్తోంది.
శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..?
శాటిలైట్ కూల్చివేత సమయంలో నిర్దేశించిన మార్గంలోనే భూవాతావరణంలోకి ప్రవేశించి ప్రయాణించాలి. అప్పుడే నిర్దేశిత ప్రదేశంలో కూలుతుంది. ఒకవేళ శాటిలైట్ అదుపు తప్పితే జనావాసాలపై పడే ప్రమాదం ఉందంటున్నారు. భూవాతావరణ ఘర్షణ కారణంగా విద్యుదయస్కాంత రేడియేషన్‌కు గురై ఉపగ్రహంలోని వ్యవస్థలు పని చేయకపోవచ్చు. నియంత్రణ సరిగా లేకపోతే ఉప్రగ్రహంలో వాడే విషపూరిత పదార్థాలు, రేడియోయాక్టివ్ ఐసోటోప్‌లు, రసాయనాల నుంచి ముప్పు ఉండవచ్చు. కూలిపోయే ఉపగ్రహ మార్గాన్ని బలమైన గాలులు, తుపానులు వంటివి మార్చవచ్చు.