మెహబూబా ముఫ్తీ
14 నెలల తర్వాత రిలీజైన మాజీ సీఎం
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రీస్టోరేషన్ కోసం పోరాడతానని మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అన్నారు. దాదాపు 14 నెలల తర్వాత హౌస్ అరెస్ట్ నుంచి రిలీజైన ముఫ్తీ మంగళవారం అర్ధరాత్రి ట్విట్టర్‌లో ఒక ఆడియో మెసేజ్ రిలీజ్ చేశారు. “గత ఏడాది ఆగస్టు 5న చట్ట విరుద్దంగా, అప్రజాస్వామికంగా, రాజ్యాంగా విరుద్దంగా లాక్కున్న వాటిని తిరిగి తీసుకుందామని మనమంతా ప్రతిజ్ఞ చేయాలి. కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం కృషి చేద్దాం” అని ముఫ్తీ ఆడియో మెసేజ్‌లో అన్నారు. ఆర్టికల్ రద్దు టైంలో తనతో పాటు అరెస్టైన మిగతా వాళ్లను కూడా వెంటనే రిలీజ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కిందటి ఏడాది ఆగస్టు 5న జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దుచేయగా.. ముందు జాగ్రత్తగా కొంతమంది లీడర్లను అరెస్టు చేసింది. వారిలో కొందర్ని గతంలో రిలీజ్ చేసింది.
ముఫ్తీని కలిసిన ఒమర్, ఫరూక్ అబ్దుల్లా
నేషనల్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ ఫరూక్ అబ్దుల్లా, వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా మెహబూబా ముఫ్తీతో భేటీ అయ్యారు. ముఫ్తీ 14 నెలల తర్వాత రిలీజ్ అయినందుకు ఆమెను పరామర్శించామని, ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదని మీడియాతో చెప్పారు. ముఫ్తీని కలిసేందుకు పీడీపీ నేతలు ఆమె ఇంటికి క్యూ కట్టారు. చాలాకాలం తర్వాత తమ ప్రియనేతను కలిసేందుకు వచ్చామని వాళ్లు ఆనందం వ్యక్తం చేశారు.
ఫరూక్ ఇంట్లో మీటింగ్.. హాజరు కానున్న ముఫ్తీ
జమ్మూకాశ్మీర్ స్పెషల్ స్టేటస్ కు సంబంధించి భవిష్యత్తు కార్యాచరణ చర్చించేందుకు ఎన్సీపీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా తన ఇంట్లో మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. ‘గుప్కర్ డిక్లరేషన్’ పేరుతో నిర్వహించే ఈ మీటింగ్‌కి పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ కూడా వస్తున్నారని ఒమర్ అబ్దుల్లా చెప్పారు. 2019, ఆగస్టు 4న.. అంటే కాశ్మీర్‌కు స్పెషల్ స్టేటస్ రద్దు చేసే ముందు రోజు అన్ని పార్టీలు ఎన్సీపీ చీఫ్ ఇంట్లో ఈ ‘గుప్కర్ డిక్లరేషన్’ తీర్మానం చేశారు. ఈ ఏడాది ఆగస్టులో కూడా అన్ని పార్టీలు సమావేశమై కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రీస్టోర్ చేసేందుకు పోరాడాలని తీర్మానం చేశాయి.
For More News..