
T-20 మ్యాచ్‌లో పాక్ గెలుపొందడంతో సంబరాలు చేసుకున్నారంటూ అరెస్ట్ చేసిన కశ్మీర్ విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని PDP అధినేత మెహబూబా ముఫ్తీ డిమాండ్ చేశారు. ఈ నెల 24న భారత్-పాక్‌ల మధ్య జరిగిన T-20 మ్యాచ్‌లో పాక్ గెలుపొందడంతో సంబరాలు జరుపుకున్నారంటూ ముగ్గురు కశ్మీర్ విద్యార్థులను యూపీ ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. జమ్ము కశ్మీర్‌లో, బయట కశ్మీర్ విద్యార్థులపై అణచివేతను ఖండిస్తున్నామని ముఫ్తీ ట్విటర్‌లో తెలిపారు. జమ్ముకశ్మీర్‌లో రెండేళ్ల అణచివేత తర్వాత ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం ఇక్కడి పరిస్థితులను చక్కదిద్దేందుకు యత్నిస్తోందని అన్నారు.
అరెస్ట్ చేసిన ఆ ముగ్గురు కశ్మీర్ విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ముఫ్తీ. అంతేకాదు వారు క్యాంపస్‌లో భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయలేదంటూ ఆగ్రా కాలేజ్ అధికారులు ఇచ్చిన నివేదికను ఈ పోస్ట్‌కు జోడించారు.