![Cyber crimes : సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన మెగా కంపెనీ : రూ.6 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు](https://static.v6velugu.com/uploads/2025/02/meil-loses-rs-547-cr-in-cyber-fraud-complaint-filed-in-hyderabad_iwqycXxjfJ.jpg)
సైబర్ కేటుగాళ్లు రెచ్చపోతున్నారు. పెద్ద పెద్ద సంస్థలకే కుచ్చుటోపీ పెడుతున్నారు. ఏకంగా దేశంలోనే ప్రముఖ నిర్మా ణ సంస్థ అయిన మేఘా ఇంజనీరింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL)ను బురిడీ కొట్టించారు సైబర్ నేరగాళ్లు. ఇ మెయిల్ చిరునామాలోని ఒక అక్షరాన్ని మార్చి రూ. 5.47 కోట్లు(సుమారు 6.6 మిలియన్లు) స్వాహా చేశారు. హైదరాబాద్ బాలానగర్ లోని సంస్థ ఎకౌంట్స్ మేనేజర్ దుంపల శ్రీహరి తెలంగాణ సైబర్ క్రైం బ్రాంచ్ కి ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..2022 మే 10న మెఘా కంపెనీ తమ సంస్థకు అవసరమైన సామాగ్రి కోసం నెదర్లాండ్ లోని ఓ సంస్థలో లావాదేవీలు జరిపింది. ఆదేశ కరెన్సీలో 14.39 లక్షల విలువైన ఆర్డర్‌ను ఇచ్చింది. ఆ తర్వాత మే 17న 7.95 లక్షల యూరోల విలువైన మరో ఆర్డర్‌ను ఇచ్చింది. కాంట్రాక్ట్ ప్రకారం మెఘా సంస్థ నెదర్లాండ్ లోని కంపెనీకి ఆన్ లో చెల్లింపులు చేస్తూ వచ్చింది. ట్రాన్సక్షన్స్ చేసిన ప్రతి సారి మెఘాకు కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చేది..
ఈ క్రమంలో నవంబర్ 29, 2024న నెదర్లాండ్ సంస్థ నుంచి ఓ మెయిల్ వచ్చింది. అందులో ఏముందంటే? కోర్టు ఆదేశాల కారణంగా తమ పాత బ్యాంక్ అకౌంట్ పై ఆంక్షలున్నాయని.. ఇక ముందు చెల్లింపులను కొత్త అకౌంట్ కు డబ్బులు చెల్లించాలని మెఘాకు మెయిల్ చేశారు
ఇదే అదునుగా తీసుకున్న సైబర్ నేరగాళ్లు ఒక అక్షరం మార్చి నెదర్లాండ్ సంస్థ మెయిల్ ను పోలి ఉండే ఓ ఫేక్ ఈ మెయిల్ ను మెఘా కంపెనీకీ పంపించారు. అందులో తమ బ్యాంక్ అకౌంట్ డీటెల్స్ పంపించారు. దీంతో మెఘా సంస్థ 2025 జనవరి 24 సైబర నేరగాళ్ల ఫేక్ అకౌంట్ కు 3.18 లక్షల యూరోల డబ్బును ట్రాన్స్ పర్ చేసింది. ఆ తర్వాత కేటుగాళ్ల నుంచి కన్ఫర్మేషన్ మెయిల్ కూడా వచ్చింది. దీంతో మళ్లీ జనవరి 29న 2.89 లక్షల యూరోలను మరొకసారి ట్రాన్స్ ఫర్ చేసింది.
అయితే డబ్బులు ఇంకా రాలేదని నెదర్లాండ్ సంస్థ నుంచి మెయిల్ రావడంతో అలర్ట్ అయిన మెఘా కంపెనీ ప్రతినిధులు మెయిల్స్ చెక్ చేశారు. రెండు మెయిల్స్ వేర్వేరుగా ఉండటం గమనించి తాము మోసపోయామని తెలుసుకున్నారు. వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం రూ. 5.47 కోట్లు తామో పోగొట్టుకున్నామని మెఘా కంపెనీ ఫిర్యాదులో తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.