జొకోవిచ్‌‌‌‌కు మర్రే కోచింగ్‌‌‌‌

మెల్‌‌‌‌బోర్న్‌ ‌‌‌: సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్‌‌‌‌, బ్రిటన్ లెజెండ్ ఆండీ మర్రే ఈతరం మేటి టెన్నిస్ ఆటగాళ్ల జాబితాలో ముందుంటారు. 12 ఏండ్ల వయసు నుంచి ఈ ఇద్దరూ ప్రొఫెషనల్ టెన్నిస్ ఆడుతూ.. 36 సార్లు ముఖాముఖీ పోటీపడ్డారు. గ్రాండ్‌‌‌‌స్లామ్స్‌‌‌‌లో పది సార్లు ఢీకొట్టారు. మెన్స్ సింగిల్స్‌‌‌‌లో అత్యధికంగా 24  టైటిళ్లు నెగ్గిన ప్లేయర్‌‌‌‌‌‌‌‌గా నొవాక్‌‌‌‌ రికార్డు సృష్టించగా..  మర్రే గతేడాది పారిస్ ఒలింపిక్స్ తర్వాత కెరీర్‌‌‌‌‌‌‌‌కు వీడ్కోలు పలికారు.  37ఏండ్ల వయసున్న ఈ ఇద్దరూ కలిసి ఇప్పుడు ఆస్ట్రేలియన్ ఓపెన్‌‌‌‌కు వస్తున్నారు.

జొకోవిచ్‌‌‌‌ ఆటగాడిగా బరిలోకి దిగనుండగా.. మర్రే అతనికి కోచింగ్‌‌‌‌ ఇస్తున్నాడు. తన కోచింగ్‌‌‌‌ టీమ్‌‌‌‌లో చేరే అవకాశాన్ని పరిశీలించాలని జొకోవిచ్‌‌‌‌ గత నవంబర్‌‌‌‌‌‌‌‌లోనే కోరగా.. మర్రే ఒప్పుకున్నాడు. ఇప్పుడు మర్రే కోచింగ్‌‌‌‌లో ఆదివారం మొదలయ్యే ఆస్ట్రేలియన్ ఓపెన్‌‌‌‌లో జొకో బరిలోకి దిగుతున్నాడు. ప్రస్తుతం అతని పర్యవేక్షణలో మెల్‌‌‌‌బోర్న్‌‌‌‌లో ప్రాక్టీస్ సెషన్స్‌‌‌‌లో పాల్గొంటున్నాడు. ఇన్నాళ్లూ ప్రత్యర్థులుగా ఎదురెదురు కోర్టుల్లో పోటీపడ్డ ఈ ఇద్దరు మేటి ప్లేయర్లను ఇప్పుడు గురు శిష్యులుగా చూసి టెన్నిస్ ప్రపంచం ఒకింత ఆశ్చర్యపోతోంది.  

సాకర్‌‌‌‌‌‌‌‌ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు మరో దిగ్గజం లియోనల్ మెస్సీ కోచ్‌‌‌‌ అయినట్టు ఊహించుకుంటే ఎంత వింతగా అనిపిస్తుందో  జొకోవిచ్‌‌‌‌, మర్రే జట్టు కట్టడం అలానే ఉందని రష్యా టెన్నిస్ స్టార్ డానిల్ మెద్వెదెవ్ అభిప్రాయపడ్డాడు. ఇక, తన అతి పెద్ద ప్రత్యర్థుల్లో ఒకడిగా భావించిన   మర్రేతో ఆట, వ్యక్తిగత విషయాలను పంచుకోవడం మొదట్లో కాస్త ఇబ్బందిగా అనిపించిందని నొవాక్ చెప్పాడు. నొవాక్ తనకు సహాయం చేయమని అడగడంతో షాక్ అయ్యానని,  తను ఫోన్ చేసినప్పుడు ఈ విషయం చెబుతాడని  అస్సలు ఊహించలేదని మర్రే గుర్తు చేసుకున్నాడు.

‘తను ఆల్‌‌‌‌టైమ్ బెస్ట్‌‌‌‌ ప్లేయర్లలో ఒకడు. అతనికి మేం ఎంత మేరకు సాయం చేయగలమో ఓసారి ప్రయత్నించి చూద్దామని అనుకుంటున్నాం’ అని మర్రే చెప్పుకొచ్చాడు. కాగా, నొవాక్‌‌‌‌కు గతేడాది మార్చి వరకు గొరాన్‌‌‌‌ ఇవనిసెవిచ్‌‌‌‌ కోచ్‌‌‌‌గా పని చేశాడు. మర్రే కోచింగ్ఆస్ట్రేలియన్ ఓపెన్‌‌‌‌ వరకేనా.. ఆ తర్వాత కూడా అతని సేవలను జొకోవిచ్‌‌‌‌ కొనసాగిస్తాడా? అన్నది తెలియాల్సి ఉంది.