ఏసీబీకి చిక్కిన మేళ్లచెరువు కరెంట్‌‌ ఏఈ

కోదాడ/హుజూర్ నగర్, వెలుగు : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం కరెంట్ ఏఈ గోవిందరాజు కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ ఆఫీసర్లకు పట్టుబడ్డాడు. మేళ్లచెరువు మండలం కందిబండ గ్రామానికి చెందిన తిరుపతమ్మ విద్యుత్ శాఖలో క్లాస్ వన్ కాంట్రాక్టర్. పనులను ఆమె  సోదరుడు రాజేశ్​పర్యవేక్షిస్తుంటాడు. గత సంవత్సరం రూ. 19 లక్షల కాంట్రాక్ట్ పనులు చేశారు. పనులకు సంబంధించిన బిల్లులు సమర్పించే సమయానికి ఏఈగా గోవిందరాజు ట్రాన్స్​ఫర్​పై వచ్చాడు. మొదట్లో బిల్లులు మంజూరు చేయకుండా కాలయాపన చేశాడు. మూడు నెలల క్రితం బిల్లులు మంజారు చేయాలంటే  తనకు 5 శాతం కమీషన్ ఇవ్వాలని డిమాండ్ చేయగా 3 శాతం రూ. 54 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది.

54 వేలలో రూ. 25 వేలు ఇవ్వడం తో రూ. 14 లక్షలు మంజూరయ్యాయి. అదే సమయంలో కొత్తగా చేసిన పనులకు సంబంధించిన బిల్లులు చేయకుండా నిలిపివేశారు. ఆ బిల్లులు కూడా మంజూరు చేయాలంటే  మిగిలిన డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో రాజేశ్​ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. వారి సూచనల మేరకు మంగళవారం డబ్బులు ఇచ్చేందుకు కోదాడ వెళ్లాడు. హుజూర్ నగర్ రోడ్ లోని రిలయన్స్ మార్ట్ ఎదురుగా కారులో ఏఈ ఉండగా రాజేశ్ ​ఆయనకు డబ్బులు ఇవ్వబోయాడు. కారు డ్యాష్ బోర్డులో పెట్టాలని చెప్పడంతో రాజేశ్​ అలానే చేశాడు. రాజేశ్ ​వెళ్లిన తరువాత ఏసీబీ అధికారులు దాడి చేసి కారులో ఉన్న డబ్బును స్వాధీనం చేసుకున్నారు. కారు సీజ్ చేశారు . ఏఈను అదుపులోకి తీసుకుని హుజూర్ నగర్ లోని విద్యుత్ డీఈ ఆఫీసుకు తరలించి అక్కడ సోదాలు నిర్వహించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ నల్గొండ డీఎస్పీ కృష్ణ గౌడ్ చెప్పారు.