- నేటి నుంచి ఐదు రోజులపాటు కొనసాగనున్న జాతర
- అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
- భారీగా తరలి రానున్న అధికారులు
మేళ్లచెరువు, వెలుగు : మహాశివరాత్రి జాతరకు మేళ్లచెరువు శివాలయం ముస్తాబైంది. ఈనెల 8 నుంచి 12 వరకు ఐదు రోజులపాటు జరిగే జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిస్తున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నాలుగు దఫాలుగా కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్షలు నిర్వహించి జాతరకు తరిలివచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలని సూచనలు చేశారు.
తాగునీరు, పారిశుధ్యమే ప్రధానం..
వేసవి దృష్ట్యా ఇప్పటికే తాగునీటి కొరత ఏర్పడడంతో అధికారులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. గ్రామాల నుంచి వాటర్ ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయాలని ఆదేశించారు. శానిటేషన్ కూడా ప్రధానమని, తగినంత సిబ్బందిని అందుబాటులో ఉంచుకుని ఎప్పటికప్పుడు పరిసరాలను శుభ్రం చేయాలన్నారు.
దర్శనానికి 5 క్యూలైన్లు..
దైవ దర్శనానికి రూ.20, 100, 300, 500 టికెట్లు తీసుకునే భక్తులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. తెల్లవారుజామున 4 నుంచి 8 గంటల మధ్య ఉచిత దర్శనానికి అవకాశం కల్పించారు. వీఐపీ పాసులను ఈసారి నిలిపివేశారు. పాసుల దుర్వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
మంత్రి ఉత్తమ్ అభిషేకంతో ప్రారంభం..
ఇరిగేషన్, సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ పద్మావతి దంపతుల తొలి అభిషేక కార్యక్రమంతో మహాశివరాత్రి పూజలు మొదలు కానున్నాయి. అనంతరం కబడ్డీ, ఎడ్ల పందేలను మంత్రి ప్రారంభించనున్నారు.
ఆకర్షణగా నిలవనున్న ఎడ్ల పందేలు, కబడ్డీ టోర్నమెంట్..
మహాశివరాత్రి జాతరలో ఎడ్ల పందేలు, కబడ్డీ పోటీలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఎడ్ల పందేలను చూడటానికి లక్షల మంది తరలివస్తారు. గతంలో జాతర రెండో రోజున ఈ పోటీలు మొదలయ్యేవి. కానీ ఈసారి తొలిరోజునే ప్రారంభంకానున్నాయి. న్యూ కేటగిరీ, పాలపండ్లు, రెండు, నాలుగు, ఆరు పండ్లు, సబ్ జూనియర్, జూనియర్, సీనియర్స్ విభాగాల్లో ఎడ్ల పందేలు నిర్వహిస్తారు. పోటీల్లో గెలుపొందిన గిత్తల యజమానులకు బైక్ లు, బుల్లెట్లు, ట్రాక్టర్ ను బహుమతులుగా అందజేస్తారు. కబడ్డీ పోటీలను పురుషులు, మహిళలకు వేర్వేరుగా నిర్వహించనున్నారు. గెలుపొందిన టీం లకు భారీగా నగదు బహుమతులు అందజేస్తారు.
అన్నవితరణకు ప్రభుత్వ ఏర్పాట్లు..
జాతరకు తరలివచ్చే భక్తుల కోసం ఈసారి ఎండోమెంట్ డిపార్ట్మెంట్అన్న వితరణ కోసం స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాట్లు చేసింది. జాతరకు వచ్చే భక్తుల దాహార్తి తీర్చడం కోసం మైహోం పరిశ్రమ ఆధ్వర్యంలో మినరల్ వాటర్ పంపిణీ చేయనున్నారు.
700 మందితో బందో బస్తు..
జాతరకు భారీగా ప్రజలు తరలిరానున్న నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే ఆలయ పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.700 మంది పోలీసులు విధులు నిర్వహించనున్నారు. ట్రాఫిక్ నియంత్రణ, ఆరు పార్కింగ్ స్థలాలు, సాంస్కృతిక కార్యక్రమాల వద్ద నిఘా పటిష్టం చేశారు. 50 సీసీ కెమెరాలతో జాతరను అధికారులు పర్యవేక్షించనున్నారు. జాతరను కంట్రోల్ రూం నుంచి మానిటరింగ్ చేస్తారు. జాతరలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ రాహుల్ హేగ్డే హెచ్చరించారు.
కనుల పండువగా కైలాసనాథుడి కల్యాణం
వైభవంగా శివరాత్రి ఉత్సవాలు
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శివరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. యాదగిరిగుట్ట ఆలయానికి అనుబంధంగా ఉన్న పర్వతవర్థినీ సమేత రామలింగేశ్వరస్వామి(శివాలయం) క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు గురువారం మూడో రోజు వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదిదంపతులైన శివపార్వతుల కల్యాణానికి ముందు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రుద్రహవనం నిర్వహించారు. అనంతరం రాత్రి శివపార్వతుల కల్యాణ మహోత్సవం కనుల పండువగా జరిగింది. రాత్రి 7 గంటలకు ప్రారంభమైన కల్యాణ మహోత్సవం దాదాపుగా రెండు గంటలపాటు వైభవంగా కొనసాగింది.
ప్రత్యేకంగా తెప్పించిన పూలతో శివపార్వతులను సర్వాంగ సుందరంగా అలంకరించారు. నూతన వధూవరులుగా ముస్తాబైన ఆదిదంపతుల ఉత్సవమూర్తులను కల్యాణ మండపంలో అధిష్టింపజేసి కల్యాణ ఘట్టాన్ని ఆరంభించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, పారాయణికుల వేదపారాయణాలు, రుత్వికుల మూలమంత్ర, మూర్తిమంత్ర జపాల నడుమ, మంగళవాయిద్యాల మధ్య ముళ్లోకాది దేవతలు చూస్తుండగా కైలాసవాసుడు పార్వతీ అమ్మవారి మెడలో మాంగళ్యధారణ చేసే తంతును అర్చకులు నయనానందకరంగా
నిర్వహించారు.