భద్రాచలం, వెలుగు: పోలవరం ప్రాజెక్ట్బ్యాక్ వాటర్‌తో భద్రాచలం పుణ్యక్షేత్రానికి ముప్పు పొంచి ఉందని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం స్థానిక ఏఎంసీ కాలనీ, అశోక్‌నగర్ కొత్తకాలనీ, రెవిన్యూ కాలనీ, అయ్యప్పకాలనీల్లో సీపీఎం లీడర్లతో కలిసి ఆయన పర్యటించి మాట్లాడారు. గోదావరి ముంపు సమస్యను పరిష్కరించేంత వరకు తమ పోరు ఆగదని స్పష్టం చేశారు. 2007లోనే పోలవరంతో ఎదురయ్యే ప్రమాదాన్ని పసిగట్టి సీపీఎం హెచ్చరించిందని, ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో గతేడాది వరద చుట్టుముట్టిందని చెప్పారు. ఆయన వెంట నియోజకవర్గ కో కన్వీనర్ కారం పుల్లయ్య, పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, నర్సారెడ్డి, రేణుక, గంగా, బి.వెంకటరెడ్డి, శరత్‌బాబు, లీలావతి ఉన్నారు. కాగా సీపీఎం పాదయాత్రకు సీపీఐ, టీడీపీ, సేవ్భద్రాద్రితోపాటు వివిధ ప్రజాసంఘాలు సంఘీభావం పలికాయి.
రూ.వెయ్యి కోట్ల హామీకి ఏడాది పూర్తి
గతేడాది జులై నెలలో భద్రాచలంలో గోదావరి వరదల పరిశీలనకు వచ్చిన సీఎం కేసీఆర్భద్రాచలానికి రూ.1000కోట్లు ప్రకటించి ఏడాది కావస్తోందని, నేటికీ పైసా ఇవ్వలేదని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఎద్దేవా చేశారు. శనివారం ఆయన వరద ముంపు కాలనీ సుభాష్‌నగర్‌లో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. అంకెలగారడీ, మాయమాటలు తప్ప తెలంగాణ సర్కారు భద్రాచలానికి చేసిందేమీ లేదని విమర్శించారు. భారీ వర్షాలు కురిస్తే భద్రాచలం, గోదావరి తీర ప్రాంతాలకు తిప్పలు తప్పవని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కరకట్ట ఎత్తు పెంచాలని, స్లూయిజ్‌లకు రిపేర్లు చేయించాలని డిమాండ్ చేశారు.