ట్యాంక్ బండ్‌‌పై పోలీసులు.. ఉత్సవ కమిటీ సభ్యులకు వాగ్వాదం

గణేష్ నిమజ్జనంపై వివాదం కొనసాగుతోంది. మట్టి గణేష్ విగ్రహాలు మాత్రమే హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేసేందుకు అవకాశం ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. నిమజ్జనానికి అనుమతినివ్వాల్సిందేనని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో.. కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున ట్యాంక్ బండ్ కు చేరుకున్నారు. బైక్ ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించారు. అప్పటికే అక్కడున్న పోలీసులు ఉత్సవ కమిటీ సభ్యులను అడ్డుకున్నారు. కమిటీ సభ్యులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తోపులాట చోటు చేసుకోవడంతో ఉద్రికత వాతావరణం ఏర్పడింది. మండపాల నిర్వహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్న క్రమంలో.. ర్యాలీలు, సభలకు అనుమతి లేదని స్పష్టం చేస్తున్నారు. 

మరోవైపు.. వినాయక విగ్రహాల నిమజ్జనం విషయంలో ఎలాంటి అపోహలు అవసరం లేదని.. అంతా యథావిధిగా జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. వినాయక విగ్రహాలను ఈ నెల 9న హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం చేస్తామని భాగ్యనగర్ ఉత్సవ సమితి ప్రకటించింది. నిమజ్జనానికి సరైన ఏర్పాట్లు చేయకుంటే ఎక్కడి విగ్రహాలు అక్కడే పెట్టి నిరసనలు చేపడతామని తెలిపింది.