జగిత్యాల బల్దియా మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రాజీనామాలు

జగిత్యాల జిల్లా : జగిత్యాల బల్దియా మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్  గ్రామ పాలకవర్గం రాజీనామా చేసింది.  తిమ్మాపూర్ సర్పంచ్ మెరుగు రమ్య (కాంగ్రెస్), ఉప సర్పంచ్ ఏలేటి మోహన్ రెడ్డి(బీఆర్ఎస్) తో సహా ఎనిమిది మంది వార్డు మెంబర్ల రాజీనామాలు చేశారు. మరోవైపు వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ(AMC) డైరెక్టర్ దుమాల రాజేష్ కూడా రాజీనామా చేశారు. తమ గ్రామాల్లోని రైతుల భూములను ఇండస్ట్రియల్ జోన్ కోసం తీసుకోవద్దని డిమాండ్ చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్, జిల్లా కలెక్టర్ హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

జగిత్యాల బల్దియా ఆధ్వర్యంలో ఇటీవల నూతన మాస్టర్‌ ప్లాన్‌ ముసాయిదాను విడుదల చేశారు. అభ్యంతరాలు, సలహా లు, సూచనలు ఇవ్వాలని కోరుతూ పట్టణంలోని పలు చోట్ల నూతన మాస్టర్‌ ప్లాన్‌ మ్యాప్‌తో కూడిన ప్లెక్ల్సీలను అధికారులు ఏర్పాటు చేశారు. అయితే నూతన మాస్టర్‌ ప్లాన్‌లో జగిత్యాల చుట్టు పక్కల గ్రామాలతో పాటు వ్యవసాయ భూములను కలుపుతూ అధికారులు పబ్లిక్‌ జోన్‌, సెమీ పబ్లిక్‌ జోన్‌లుగా ముసాయిదా రూపొందించిన విషయం తెలిసిందే.