- పైలట్ ప్రాజెక్ట్ గా నిర్మల్ జిల్లాలో అమలు
- కడెం ప్రాజెక్ట్ కింద 100 మంది మహిళలకు శిక్షణ
- నాబార్డ్ ద్వారా తయారీ గ్రూపులకు లోన్లు
- బ్రాండెడ్ ప్యాకింగ్ తో మార్కెట్ లో అమ్మకాలు
నిర్మల్, వెలుగు: మత్స్యకార కుటుంబాల్లోని మహిళా సంఘాల సభ్యులు చేపలనే ఉపాధి చేసుకునేందుకు చేప పచ్చళ్లు తయారు చేస్తున్నారు. ఇందుకు డీఆర్ డీఏ, ఐకేపీ అధికారులు శిక్షణ అందించడంతో పాటు బ్యాంకు లింకేజీతో రుణాలు ఇప్పిస్తూ ప్రోత్సహిస్తున్నాన్నారు. దీంతో మత్స్యకార కుటుంబాల్లోని వందమందికి పైగా మహిళలు పచ్చళ్ల తయారీలో బిజీ అయ్యారు. ఆసక్తి ఉన్న మహిళా సంఘాల సభ్యులకు కొద్దిరోజుల కింద నిర్మల్ లో శిక్షణను అందించారు.
అహ్మదాబాద్ కు చెందిన ఈడీఐఐ స్వచ్ఛంద సంస్థ శిక్షణతో పాటు వంటలో మెలకువలను నేర్పింది. మహిళలు తమ భర్తలు వేటాడి తీసుకొచ్చే చేపలనే కాకుండా డిమాండ్ మేరకు మార్కెట్ లో కూడా కొనుగోలు చేస్తున్నారు. ఐదారుగురు గ్రూపుగా ఏర్పడి ఇండ్లలోనే పచ్చళ్లు తయారు చేస్తున్నారు. గ్రామ సమాఖ్య సంఘాల ద్వారా మార్కెట్ లో అమ్ముతున్నారు. ఇటీవల నిర్మల్ కలెక్టరేట్ తోపాటు వివిధ ఆఫీసులు, కొన్ని మండల కేంద్రాల్లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లలో కూడా చేప పచ్చళ్ల అమ్మకాలు ప్రారంభించారు.
రెండు రోజుల కింద నిర్వహించిన నిర్మల్ ఉత్సవాల్లో భాగంగా స్టాల్స్ లో చేప పచ్చళ్లను అమ్మగా.. భారీగా డిమాండ్ ఏర్పడింది. నుమాయిష్ సందర్శనకు ప్రజలే కాకుండా మంత్రి సీతక్క, ప్రముఖులు చేప పచ్చళ్లను రుచి చూసి అభినందించారు.
పైలెట్ ప్రాజెక్టుగా కడెం ప్రాంతం ఎంపిక
మత్స్యకార కుటుంబాల మహిళల చేప పచ్చళ్ల తయారీకి కడెం ప్రాంతాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ప్రాజెక్టులో వేసవి చివర్లో చేపలు తక్కువగా ఉండడంతో ఉపాధి కరువవుతున్నట్లు గుర్తించారు. రిజర్వాయర్ లోని చేపలతోపాటు చుట్టుపక్కల చెరువుల్లో లభించే వాటితో పచ్చళ్లను తయారు చేసి ఉపాధి పొందే విధంగా పైలెట్ ప్రాజెక్టు రూపొందించారు. దాదాపు100 మంది మహిళలకు తయారీ, ప్యాకింగ్, మార్కెటింగ్ పై శిక్షణ పొందారు.
పచ్చళ్లతో పాటు బర్గర్, పిజ్జా లాంటి ఫాస్ట్ ఫుడ్ తయారీలో కూడా శిక్షణ అందించారు. ప్యాకింగ్ మెషీన్లను కూడా ఇచ్చారు. ఒక్కో గ్రూపునకు రూ. లక్ష చొప్పున లోన్లు అందజేశారు. దశలవారీగా గడ్డన వాగు, స్వర్ణ ప్రాజెక్టుల పరిధిలోని మత్స్యకార కుటుంబాల మహిళా సంఘాల సభ్యులతో చేప పచ్చళ్లతో పాటు ఇతర వంటకాల తయారీని కూడా చేపట్టేందుకు నిర్ణయించారు.
ఫిష్ అవుట్ లెట్ల ఏర్పాటుకు సన్నాహాలు
మత్స్య సంపదను ప్రోత్సహిస్తూనే మహిళలకు స్వయం ఉపాధిని పెంపొందించేందుకు కొద్దిరోజుల్లోనే జిల్లా కేంద్రంతో పాటు భైంసా ఖానాపూర్ టౌన్లలోనూ.. అన్ని మండల కేంద్రాల్లోనూ ఫిష్ ఫుడ్ అవుట్ లెట్ల ఏర్పాటుకు అధికారులు నిర్ణయించారు. గ్రామ సమాఖ్య సంఘాల ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. చేప పచ్చళ్లతో పాటు చేపతో తయారు చేసే అన్నిరకాల వంటకాలను అమ్మాలని ప్రాన్ చేస్తున్నారు.
డిమాండ్ ఎక్కువగా ఉంది
చేప పచ్చళ్ల తయారీపై ట్రైనింగ్ ఇచ్చారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న చేప పచ్చళ్ల తో పాటు ఇతర వంటకాలపై కూడా శిక్షన పొందాం. ప్రస్తుతం 100 మందికి పైగా వివిధ మహిళా సంఘాల సభ్యులం చేప పచ్చళ్లను తయారు చేసి ఉపాధి పొందుతున్నాం. ఎక్కువ రోజులు నిల్వ చేసుకునే విధంగా తయారు చేస్తున్నాం. రుచిగా ఉండడంతో ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు. లాభాలు కూడా వస్తున్నాయి.– గడప చందన, కడెం, మహిళా సంఘ సభ్యురాలు