డబుల్ ఇండ్లు ఇయ్యకుంటే ధర్నాలు చేస్తమన్న అధికార పార్టీ సభ్యులు

డబుల్ ఇండ్లు ఇయ్యకుంటే  ధర్నాలు చేస్తమన్న అధికార పార్టీ సభ్యులు

జనగామ, వెలుగు: ‘అసలేం పనులైత లేవ్​.. ఎన్నిసార్లు చెప్పినా పట్టింపు లేదు.. ఎక్కడి పనులు అక్కడనే ఉన్నయ్​.. ఇంకో 18 నెలలైతే పదవీకాలం అయిపోతది.. గిట్లైతే ఎట్లా? డబుల్​ బెడ్రూం ఇండ్లు పూర్తి చేయకుంటే ధర్నాలు చేసుడే’ అని జనగామ జడ్పీ మీటింగ్ లో అధికార పార్టీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని జడ్పీ ఆఫీస్​ మీటింగ్​ హాల్​లో చైర్మన్ పాగాల సంపత్​ రెడ్డి అధ్యక్షతన జడ్పీ జనరల్​ బాడీ మీటింగ్​ నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్​ శివలింగయ్య, అడిషనల్​ కలెక్టర్​అబ్దుల్ హమీద్​ హాజరయ్యారు. 

ప్రోటోకాల్​ పాటించట్లే..
మీటింగ్​లో మరోసారి ప్రోటోకాల్​ రగడ జరిగింది. జఫర్​గడ్ జడ్పీటీసీ ఇల్లందుల బేబీ, బచ్చన్నపేట, తరిగొప్పుల ఎంపీపీలు నాగజ్యోతి, జొన్నగోని హరిత మాట్లాడుతూ.. ఆఫీసర్లు కనీస సమాచారం ఇవ్వడం లేదని, ప్రోగ్రాంలకు పిలుస్తలేరని చెప్పారు. ఎన్నిసార్లు చెప్పినా పద్ధతి మార్చుకోవడం లేదన్నారు. స్పందించిన కలెక్టర్​ శివలింగయ్య..ప్రోటాకాల్ పాటించేలా సర్క్యులర్ జారీ చేయాలని జడ్పీ సీఈవో వసంతను ఆదేశించారు.

ఆడపిల్లల రక్షణ బాధ్యత ఎవరిది..?
చిల్పూరు మండలంలో కస్తూర్బా గాంధీ స్కూల్ బిల్డింగ్​పనులు పూర్తి కాకముందే స్టూడెంట్లను సదరు బిల్డింగ్​లోకి మార్చారని జడ్పీ చైర్మన్​ సంపత్​ రెడ్డి మండిపడ్డారు. ‘ప్రహరీ గోడ లేదు.. చుట్టూ అడవి ఉంటది.. తండాలున్నయ్​.. కనీస రక్షణ లేదు.. ఆడపిల్లలు ఉండే ఈ స్కూల్లో పిల్లలకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు?’ అని డీఈవో రామును నిలదీశారు. తాను చెప్పినా ఎందుకు పట్టించుకోవడం లేదని గరం అయ్యారు.

డబుల్​ బెడ్రూంలు పూర్తి చేయకుంటే ధర్నాలు
డబుల్​ బెడ్రూం ఇండ్ల పనులు పూర్తి చేయకుంటే ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని జనగామ ఎంపీపీ మేకల కలింగ రాజు ఆఫీసర్లను హెచ్చరించారు. తన సొంత గ్రామం శామీర్​ పేటలో డబుల్​ బెడ్రూం ఇండ్ల నిర్మాణం మధ్యలో ఆపేశారని, ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవడం లేదన్నారు. పంచాయతీరాజ్ ఈఈ చంద్రశేఖర్ పనులు పూర్తయ్యేలా చర్యలు చేపడుతామన్నారు. తరిగొప్పుల జెడ్పీటీసీ ముద్దసాని పద్మజ మాట్లాడుతూ.. తమ మండలంలో పీహెచ్​సీని ఏర్పాటు చేయాలని, రెగ్యులర్ ఎంపీడీవోను నియమించాలని కోరారు. తరిగొప్పుల– సోలిపురం, సోలిపురం–అంకుశాపురం, అంకుశాపురం–కూటిగల్ రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, వెంటనే రిపేర్లు చేపట్టాలని కోరారు.

వచ్చే నెల 15 వరకు క్లోజ్​ చెయ్యాలె..
పల్లెల్లో చేపడుతున్న శ్మశాన వాటిక పనులు మూడేండ్ల నుంచి మూలుగుతున్నాయని జడ్పీ చైర్మన్​ పాగాల సంపత్​ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. వచ్చే నెల 15లోపు పనులు పూర్తి చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. కరెంట్ కనెక్షన్ల వల్లే లేట్ అవుతున్నాయని పంచాయతీ రాజ్ ఈఈ తెలపగా.. ట్రాన్స్ కో ఎస్ఈ మాట్లాడుతూ... బిల్లులు కట్టిన వివరాల లిస్ట్​ ఇస్తే పనులు చేయిస్తామన్నారు. సమన్వయం లోపంతో పనులు లేట్ చేయడం సరికాదని జడ్పీ చైర్మన్ మరోసారి హెచ్చరించారు.

జిల్లా అభివృద్ధికి కృషి 
జిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్​ సీహెచ్ శివలింగయ్య తెలిపారు. జడ్పీ మీటింగ్​లో ఎన్​సీడీ(నాన్​ కమ్యూనల్​ డిసీజ్) కిట్​ బ్యాగ్ ను ఆవిష్కరించారు.  పల్లెల్లో బీపీ షుగర్ వ్యాధులతో బాధపడుతున్న వారి కోసం సర్కారు ఉచితంగా మందులను పంపిణీ చేస్తోందన్నారు. పీహెచ్​సీలు, సబ్​ సెంటర్లలో ఇవి అందుబాటులో ఉంటాయని, బాధితులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ప్రోగ్రాంకు ప్రజాప్రతినిధులు సహకారం అందించాలన్నారు. జిల్లాలో మన ఊరు– మన బడి పనులు వేగంగా సాగుతున్నాయన్నారు.