హెచ్‌సీఏలో ఫైటింగ్
అంబుడ్స్‌మన్ నియామకంపై రగడ
అసోసియేషన్‌ను వీడుతున్న ప్లేయర్లు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో మళ్లీ అలజడి. కరోనా కారణంగా ఆట నిలిచిపోయినా.. హెచ్‌సీఏలో రాజకీయ క్రీడ మాత్రం రంజుగా సాగుతోంది. ప్రెసిడెంట్ మహమ్మద్ అజరుద్దీన్, ఇతర ఆఫీస్ బేరర్ల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. అసోసియేషన్‌లో తన ఆటే సాగాలని, తన మాటే నెగ్గాలన్నట్టుగా అజర్ వ్యవహరిస్తున్నాడని ఇతర ఆఫీస్ బేరర్లు ఆరోపిస్తున్నారు. ఇన్నాళ్లూ లోలోపల నిరసన వ్యక్తం చేసిన సభ్యులు ఇప్పుడు ప్రెసిడెంట్‌పై తిరుగుబాటు ప్రకటించారు. హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్, ఎథిక్స్ ఆఫీసర్‌గా రిటైర్డ్ జస్టిస్ దీపక్ వర్మను నియమిస్తూ అజర్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. తమకు చెప్పకుండా, రూల్స్ ప్రకారం యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ (ఏజీఎం) ఆమోదం లేకుండా చేసిన ఈ నియామకం చెల్లుబాటు కాదని హెచ్‌సీఏ సెక్రటరీ విజయానంద్, వైస్ ప్రెసిడెంట్ జాన్ మనోజ్, ట్రెజరర్ సురేందర్ అగర్వాల్, జాయింట్ సెక్రటరీ నరేశ్ శర్మ స్పష్టం చేశారు. ఈ మేరకు దీపక్ వర్మకు ఈ నలుగురూ లెటర్ రాయడం చర్చనీయాంశమైంది. ఆరుగురు సభ్యులతో కూడిన హెచ్‌సీఏ కార్యవర్గంలో నలుగురు ఆఫీస్ బేరర్లు తిరుగుబాటు చేయడంతో అజర్ ఆత్మరక్షణలో పడినట్టైంది. ‘జూన్ 6వ తేదీన జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో అంబుడ్స్‌మన్ అపాయింట్మెంట్పై చర్చ జరిగిన మాట వాస్తవమే. హెచ్‌సీఏకు అంబుడ్స్‌మన్‌గా పని చేసేందుకు రిటైర్డ్ జస్టిస్ దీపక్ వర్మ కూడా అంగీకరించారు. కానీ, హెచ్‌సీఏ రాజ్యాంగం ప్రకారం అంబుడ్స్‌మన్‌ను నియమించే అధికారం ఏజీఎంకు మాత్రమే ఉంటుంది. ప్రెసిడెంట్ కానీ, నేను కానీ ఇష్టం వచ్చిన వాళ్లను నియమించడానికి లేదు. అంబుడ్స్‌మన్ శాలరీని కూడా ఏజీఎం డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని ప్రెసిడెంట్ కు చెప్పాం. ఏజీఎం జరిగే వరకూ ఆగాలని కోరాం. కానీ, ఆయన వినిపించుకోలేదు. ఆయన తీసుకున్న నిర్ణయం తప్పు. మా మధ్య పర్సనల్ గొడవలు లేవు. కానీ, ఆయనే దీన్ని పర్సనల్‌గా తీసుకుంటున్నారు’ అని హెచ్‌సీఏ సెక్రటరీ ఆర్. విజయానంద్ పేర్కొన్నారు.
అంతా నా ఇష్టం!
ఫస్ట్ టైమ్ క్రికెట్ అడ్మినిస్ట్రేషన్‌లో అడుగు పెట్టిన అజరుద్దీన్ తీరుపై ముందు నుంచే అనేక విమర్శలు వచ్చాయి. మొదట్లో అజర్‌కు ఇతర మెంబర్స్ సహకరించడం లేదని పలువురు భావించారు. కానీ, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అతనే ఎవ్వరినీ కలుపుకొని పోవడం లేదని తెలుస్తోంది. ఇందుకు రీసెంట్‌గా జరిగిన పరిణామాలు ఉదాహరణగా చెప్పొచ్చు. అజర్ కొన్ని రోజుల క్రితం తెలంగాణ స్పోర్ట్స్ మినిస్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, ఐటీ మినిస్టర్ కేటీఆర్‌తో భేటీ అయ్యాడు. ఉప్పల్ స్టేడియం లీజు గడువును పెంచాలని, ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గించాలని కోరాడు. అలాగే, రాష్ట్రంలో గ్రామీణ స్థాయిలో క్రికెటర్లను వెలికి తీసేందుకు స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్స్)తో కలిసి పని చేసేందుకు హెచ్‌సీఏ సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించాడు. అయితే, ఈ భేటీకి హెచ్‌సీఏ ఆఫీస్ బేరర్లెవరినీ అజర్ తీసుకెళ్లలేదు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పర్సనల్ మీటింగ్ మాదిరిగా కుమారుడిని వెంటబెట్టుకెళ్లడంపై మెంబర్స్ గుస్సా అయ్యారు. పైగా, స్టేడియం లీజు గడువు మరో ఆరేళ్లు ఉన్నా పనిగట్టుకొని మంత్రులను కలవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. ‘లీజు గడువు, ప్రాపర్టీ ట్యాక్స్ గురించి అపెక్స్ కౌన్సిల్ లో చర్చించాం. మినిస్టర్ అపాయింట్మెంట్ తీసుకుంటే అందరం వెళ్దామని అజర్‌కు సూచించాం. కానీ, ఆయన మాకు సమాచారం ఇవ్వకుండానే మినిస్టర్స్‌ను కలిశారు. అయినా లీజు, ట్యాక్స్ విషయంలో ఎలాంటి అగ్రిమెంట్ జరిగినా దానిపై సెక్రటరీ హోదాలో నేనే సంతకం చేయాలి. ఇక, శాట్స్‌తో కలిసి పని చేయాలని అపెక్స్ కౌన్సిల్ లో చర్చే జరగలేదు. ఈ విషయంలో అజర్ చేసిన ప్రకటన ఆయన వ్యక్తిగతం. హెచ్‌సీఏకు ఎలాంటి సంబంధం లేదు. అయినా బీసీసీఐకి అనుబంధంగా ఉన్న మా సంఘం.. శాట్స్‌తో పని చేయడం నిబంధనలకు విరుద్ధం అవుతుంది’ అని సెక్రటరీ విజయానంద్ పేర్కొన్నాడు. ఇదంతా చూస్తుంటే అజర్ ఒంటెత్తు పోకడలు నచ్చకే ఆఫీస్ బేరర్లు అతనిపై తిరుగుబాటు చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు.
హైదరాబాద్‌కు క్రికెటర్ల గుడ్ బై!
హైదరాబాద్ క్రికెట్ ను డెవలప్ చేస్తానని హామీ ఇచ్చి అజర్ ప్రెసిడెంట్‌గా గెలిచాడు. కానీ, అతను అధికారంలోకి వచ్చిన తర్వాత స్టేట్ క్రికెట్ పరిస్థితి మరింత దిగజారిందని క్రీడాభిమానులు విమర్శిస్తున్నారు. లాస్ట్ సీజన్‌లో అన్ని ఏజ్ గ్రూప్స్ టీమ్స్ చెత్తగా ఆడడంతో హెచ్‌సీఏ పరువు పోయింది. టీమ్ సెలక్షన్స్‌లో ఆఫీస్ బేరర్ల జోక్యం ఎక్కువై టాలెంటెడ్ ప్లేయర్లకు అన్యాయం జరుగుతోంది. దాంతో, ఇండియాకు ఆడాలని కలలు కంటున్న ప్రతిభావంతులు హెచ్‌సీఏను వీడిపోతున్నారు. తాజాగా స్టార్ క్రికెటర్, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ టీమ్‌కు ఎంపికైన బావనక సందీప్ హైదరాబాద్ ను వీడాడు. ఈ సీజన్‌లో గోవా టీమ్ తరఫున ఆడేందుకు హెచ్‌సీఏ నుంచి ఎన్‌ఓసీ తీసుకున్నాడు. 28 ఏళ్ల సందీప్ కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తున్నాడు. కానీ, అతనిపై సెలెక్టర్లు శీతకన్ను వేశారు. లాస్ట్ ఇయర్ విజయ్ హజారే వన్డే, సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో అతనే టాప్ స్కోరర్. కానీ, రంజీ ట్రోఫీలో సరైన అవకాశాలు ఇవ్వని సెలెక్టర్లు, కోచ్‌లు అతని కాన్ఫిడెన్స్ దెబ్బతీశారు. ఐపీఎల్‌కు సెలెక్ట్ అయినప్పటికీ.. ఈ డొమెస్టిక్ సీజన్‌లో అయినా అతనికి తుది జట్టులో చోటు గ్యారంటీ ఇచ్చే వాళ్లు కరువయ్యారు. దాంతో, ఈ యంగ్ క్రికెటర్ హైదరాబాద్‌ను వీడాలన్న కఠిన నిర్ణయం తీసుకున్నాడు. కాగా, సందీప్ ట్రాన్స్‌ఫర్ విషయంలోనూ హెచ్‌సీఏలో రగడ జరిగింది. అతను ఎన్‌ఓసీ కోరిన విషయం తనకు తెలియదని అజర్ అంటున్నాడు. కానీ, సందీప్ లెటర్‌ను ప్రెసిడెంట్‌కు వాట్సప్ చేసినా, ఎలాంటి స్పందన రాకపోవడంతో ఎన్‌ఓసీ జారీ చేశానని సెక్రటరీ విజయానంద్ తెలిపాడు. స్పష్టం చేశాడు. ఏదేమైనా పాలకుల మధ్య ఆధిపత్య పోరుతో అంతిమంగా హైదరాబాద్ క్రికెట్, క్రికెటర్లే నష్టపోతున్నారు. తమ ఫ్యూచర్ బాగుండాలంటే ఇతర జట్లను చూసుకోవడం మంచిదని ప్లేయర్లు అనుకోవడం విచారకరం.
For More News..