జగన్‌తో సెల్ఫీ ఎఫెక్ట్.. మహిళా కానిస్టేబుల్‌కు మెమో జారీ..!

అమరావతి: టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్‎లో భాగంగా గుంటూరు జైలులో ఉన్న సురేష్‎ను మూడు రోజుల క్రితం వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పరామర్శించారు. అనంతరం జైలు బయట జగన్ మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీపై ధ్వజమెత్తారు. ఈ క్రమంలో అదే జైలులో పనిచేస్తున్న అనంతపురానికి చెందిన మహిళా కానిస్టేబుల్ అయేషాబాను కుమార్తెతో కలిసి వచ్చి అభిమానంతో జగ‌న్‌తో సెల్ఫీలు దిగారు.

 ఈ ఫొటోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. దీంతో విధుల్లో ఉన్న సంగతి మర్చిపోయి కానిస్టేబుల్ ఇలా సెల్ఫీలు దిగడం ఏంటన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయం పై అధికారుల వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో స్పందించిన జైలు అధికారులు ఆమెకు మెమో ఇవ్వనున్నట్టు తెలిపారు. మహిళ కానిస్టేబుల్ ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని జైలర్ రవిబాబు తెలిపారు.

Also Read:-విజయవాడ వరదలను డైవర్ట్ చేసేందుకే నందిగామ సురేష్ అరెస్ట్

అయితే, ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతిపక్ష నేత అయినంత మాత్రాన అభిమానంతో సెల్ఫీ దిగితే యాక్షన్ తీసుకోవడం ఏంటని కొందరు అంటుండగా.. పోలీసుల విధుల నిర్వహణలో ఒక పార్టీ, వ్యక్తికి మద్దతుగా ఉండకూడదని.. ఆమెపై చర్యలు తీసుకోవాల్సిందేనని మరి కొందరు వాదిస్తున్నారు. మొత్తానికి జగన్‎తో దిగిన ఒక్క సెల్ఫీ మహిళా కానిస్టేబుల్‎ను చిక్కుల్లో పడేసింది.