బ్రిటిష్ ప్రభుత్వం1947 జూన్ 3న భారత దేశ స్వాతంత్ర్యానికి మౌంట్ బాటన్ ప్లాన్ ప్రకారం భారతదేశంలోని సంస్థానాదీశులు తమ సంస్థానాలను తమ ఇష్టానుసారంగా భారత్ లో లేదా పాకిస్తాన్ లో విలీనం చేసుకోవచ్చు. లేదా వారి సంస్థానాలను స్వాతంత్ర్య రాజ్యాలుగా ప్రకటించుకోవచ్చు. అయితే నిజాం తాను భారతదేశంలో కానీ, పాకిస్థాన్ లో కానీ చేరబోనని, స్వతంత్రుడిగా ఉంటానని 11 జూన్ 1947లో ఒక ఫర్మానా ద్వారా ప్రకటించాడు. అప్పుడు నిజాం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో 'జాయిన్ ఇండియా యూనియన్' ఉద్యమం ప్రారంభమైంది.హైదరాబాద్ సంస్థానాన్ని భారత దేశంలో విలీనం చేయాల్సిందిగా నిజాంపై ఒత్తిడి పెంచడం ఈ ఉద్యమ లక్ష్యం. 1947 ఆగస్టు 7న భారతదేశ జాతీయ పతాకాన్ని ఎగురవేసి ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాయకులు. ఈ ఉద్యమంలో భాగంగానే కొండా వెంకట రంగారెడ్డి, బూర్గుల రామకృష్ణా రావు, స్వామి రామానంద తీర్థ లాంటి ప్రముఖులు అరెస్ట్ అయ్యారు. బ్రిటిష్ వారికి హైదరాబాద్ ను ఇండియా లో కలవడం ఇష్టం లేదు. బ్రిటన్ మాజీ ప్రధాని విన్స్టన్ చర్చిల్ ఒక సందర్భంలో భారతదేశం స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఒక్క సంవత్సరం కూడా కలిసి ఉండలేదు, వంద ముక్కలుగా విడిపోతుంది అన్నాడు. కానీ..మనం ప్రస్తుత పరిస్థితి చూస్తే బ్రిటన్ దేశం ఐదు దేశాలుగా విడిపోయింది. భారత సంతతికి చెందిన వ్యక్తి నేటి బ్రిటన్ ప్రధాని కూడా.
స్టాండ్స్టిల్ అగ్రిమెంట్
అప్పుడు 1947లో భారత ప్రభుత్వం హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసే విషయంపై సంప్రదింపులు చేస్తూనే ఉన్నది. చివరకు ఈ సంప్రదింపుల వల్ల 1947 నవంబర్ 29న భారతదేశ ప్రభుత్వం, నిజాం మధ్య ఒక ‘స్టాండ్స్టిల్ అగ్రిమెంట్’ కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం హైదరాబాద్ సంస్థానం రక్షణ, విదేశాంగ, కమ్యునికేషన్ శాఖలను భారతదేశ ప్రభుత్వానికి అప్పగించడం. భారతదేశ ప్రభుత్వ ప్రతినిధిగా హైదరాబాద్ లో ఒక ఏజెంట్ జనరల్ ఉండటం. ఒప్పందం కాలపరిమితి ఒక సంవత్సరం మాత్రమే, అంటే 1948 నవంబర్ 29 వరకే. ఈ అగ్రిమెంట్ ప్రకారం భారతదేశ ప్రభుత్వం కె.ఎం. మున్షీ ని నిజాం ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడానికి ఏజెంట్ జనరల్ గా నియమించింది. నిజాం కోరిక మేరకు సికింద్రాబాద్ నుంచి భారతదేశ ప్రభుత్వం తన సైనిక స్థావరాలను తొలగించింది.
ALSO READ: పేదరికాన్ని జయించి.. మెడికల్ సీటు సాధించిన్రు
కేఎం మున్షీ కృషి ఫలించలే
రజాకార్ల దౌర్జన్యాలు మితిమీరిపోతుండటంతో భారత ప్రభుత్వం నియమించిన ఏజెంట్ జనరల్ కె.ఎం. మున్షి హైదరాబాద్ స్టేట్ లో పరిస్థితుల గురించి భారత ప్రభుత్వానికి చెప్పారు. హైదరాబాద్ ఇండియాలో విలీనం అయితేనే అందరికీ మంచిది అని ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేకుండా పోయింది. ఇంకో దిక్కు రజాకార్లు భారతదేశానికి వ్యతిరేకంగా హైదరాబాద్ ను స్వాతంత్ర్య రాజ్యంగా మార్చుకోవడానికి అంతర్జాతీయ మద్దతును కూడగట్టుకుంటూ కుట్ర చేస్తున్నారు. నిజాం ప్రభుత్వం అంతర్జాతీయ ప్రతినిధులకు గ్రీన్ లాండ్ గెస్ట్ హౌస్ లో రాచ మర్యాదలు చేస్తూ ఉన్నారు. అందులో కొంత మంది ప్రతినిధులు కె.ఎం. మున్షీని అక్కడకు ఆహ్వానించారు. ఆ అవకాశం రావడంతో కె.ఎం. మున్షీ తన దగ్గర ఉన్న ఆధారాలతో కూడిన అభిప్రాయం హైదరాబాద్ ని భారతదేశంతో కలిపితెనే అందరికీ మంచిది అని చెప్పిన్రు. ‘ నిజాం ప్రభుత్వ రాచరిక మర్యాదలలో మునిగి ఉన్న అంతర్జాతీయ ప్రతినిధులను నా అభిప్రాయాలు కూడా ఒప్పించలేకపోయాయి’ అని కె.ఎం. మున్షీ వారి పుస్తకం ‘The End of An Era’ లో ‘But the weak tea that I offered them could not be expected to make the same impression on them as the flowing champange served in Greenlands’ అని రాసిన్రు.
కొండా, బూర్గుల చెప్పినా నెహ్రూ పట్టించుకోలే
కొండా వెంకట రంగారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు కూడా ఎందరితోనో మాట్లాడి రజాకార్ల దౌర్జన్యాలను ఆపడానికి ప్రయత్నం చేసినా ఫలితం లేకపోగా, హింస మరింత పెరుగుతూ పోయింది. హింస ఎంత తీవ్రంగా ఉంది అంటే...అప్పుడు కొండా వెంకట రంగారెడ్డి తన కుటుంబాన్ని తెనాలి కి పంపించి కేవలం వారి రెండవ కుమారుడితో కలిసి హైదరాబాద్ లో ఉండవలసి వచ్చింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో కె.వి. రంగా రెడ్డి, బూర్గుల రామకృష్ణారావు ఒక ప్రతినిధి బృందంగా వెళ్లి కె.ఎం. మున్షి ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని బొంబాయిలో అఖిల భారత కాంగ్రెస్ స్థాయి సంఘ సమావేశంలో 1948 ఏప్రిల్ 24న నెహ్రూను కలిశారు. హైదరాబాద్ లో జరుగుతున్న రజాకార్ల దౌర్జన్యాలను వివరించి, సత్వర చర్యలు తీసుకొని హైదరాబాద్ ప్రజలను ఆ దౌర్జన్యాల నుంచి విముక్తి చేయాలని కోరారు. కానీ నెహ్రూ దానికి అంగీకరించలేదు. ఇప్పుడే జరిగిన దేశ విభజన, హిందూ ముస్లిం అల్లర్లు కూడా జరిగి లక్షలాది మంది చనిపోయింరు, ఇప్పుడు కనుక తొందరపడి రజాకార్ల మీద చర్య తీసుకుంటే మళ్లీ హిందూ – ముస్లిం సంఘర్షణలు జరిగి ఘోర పరిణామాలు జరగవచ్చని నెహ్రూ అనడంతో.. కొండా వెంకట రంగారెడ్డి మధ్యలో కల్పించుకొని హైదరాబాద్ లో ఇప్పటికే, మేము మీతో మాట్లాడుతుండగా కూడా ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. రజాకార్లు ప్రజలను చంపుతున్నారు అని అప్పటి వాస్తవ పరిస్థితిని ధైర్యంగా నెహ్రూకి చెప్పిన్రు. అయినా కూడా నెహ్రూ ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని నాయకులు నిరాశతో వెనుదిరిగారు.
సర్దార్ పటేల్ కు వివరించి ఉండకపోతే..?
1948 సెప్టెంబర్ 13న జనరల్ జె.ఎన్. చౌదరి నేతృత్వంలోని భారత సేనలు రజాకార్లపై విరుచుకుపడడంతో రజాకార్ల నిర్బంధంలో ఉన్న నిజాం ప్రభుత్వం వెంటనే ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ కు ఫిర్యాదు చేసింది. ఈ కేసుపై వాదోపవాదాలు జరుగుతుండగానే 1948 సెప్టెంబర్ 17 నాడు పోలీస్ చర్య పూర్తయింది. అదే రోజు నిజాం తన ఫిర్యాదును ఉపసంహరించుకున్నాడు. అయితే.. నిజాం ప్రభుత్వ ఫిర్యాదు, ‘స్టాండ్స్టిల్ అగ్రిమెంట్’ ప్రకారం భారత ప్రభుత్వం హైదరాబాద్ విషయంలో 1948 నవంబర్ వరకు జోక్యం చేసుకోరాదు. గడువులోపే భారతదేశ ప్రభుత్వం రజాకార్లపై దాడి చేసి, హైదరాబాద్ ను భారతదేశంలో విలీనం కావాలని ప్రకటించింది. ఈ కీలక విషయాన్ని పరిశీలిస్తే, ఒకవేళ కొండా వెంకట రంగారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు నెహ్రూ వాదన విన్న తరువాత కూడా తమ ప్రాంతం కోసం ధైర్యంగా వెళ్లి సర్దార్ పటేల్ ను కలిసి హైదరాబాద్ లో జరుగుతున్న దౌర్జన్యాలు ఆయనకు వివరించి ఉండకపోయి ఉంటే.. సెప్టెంబర్ లో పోలీస్ చర్య జరిగి ఉండకపోవచ్చునేమో! ఆ పరిస్థితిని మనం ఊహించుకోలేము.
మజ్లిస్- ఏ -వజాఖవానిస్ సభ్యునిగా.. ప్రజల కోసం తెచ్చిన శాసనాలు
కొండా వెంకట రంగారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు నుంచే ఎన్నో విధాలుగా తమ ప్రాంతం కోసం పని చేసినవారు. నిజాం రాజు హయాంలో హైదరాబాదులో 'మజ్లిస్-ఏ-వజాఖవానిస్' అనే పేరుతో శాసనసభ ఉండేది. హైదరాబాద్ సంస్థానంలో ఉన్న ప్రజలకు, పాలనకు సంభందించిన విషయాలను బిల్లుల రూపంలో ఇక్కడ ప్రవేశపెట్టి, చర్చించి, చట్టాలు చేసేవారు. ఇందులో పూర్తిగా 21 మంది సభ్యులు ఉండేవారు. అందులో 19 మంది సభ్యులు నిజాం రాజు నియామకం చేసేవారు. మిగితా ఇద్దరు సభ్యులు అప్పటి రాష్ట్రంలో ఉన్న వకీళ్లు అందరూ ఓటు వేస్తే ఎన్నిక అయ్యేవారు. అయితే 1936వ సంవత్సరంలో ఈ శాసనసభకు కొండా వెంకట రంగారెడ్డి ఎన్నికైనారు. ఈ అవకాశం వచ్చినందువల్ల వారు 24 చిత్తు శాసనములు ప్రవేశపెట్టినరు. ఇందులో కొన్ని నిజాం కు వ్యతిరేకమైనవి, ప్రజలకు అనుకూలమైనవి కూడా ఉండడం మనం గమనించాలి. వాటిలో ముఖ్యమైనవి మనము గమనిస్తే, 1. స్త్రీలకు వారసత్వ హక్కు లంభించాలని, 2. కులాంతర వివాహం చేసుకున్న వారి పిల్లలకు న్యాయబద్ద హక్కులు కల్పించాలని, 3. బాల్య వివాహ నిరోధము, 4. జాగీర్ల రద్దు,5. పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్థాపన, 6. అప్పుల వసూళ్లలో దౌర్జన్యం ఉండకూడదని, 7. విధవా వివాహాలు న్యాయబద్దమైనవని, 8. బావుల కింద ఉన్న సేద్యానికి నీటి పన్ను ఉండరాదని, 9.అంటరానితనం నిర్మూలన,10. జమాబందీ ఫారాల కొరకు ఫీజు, స్టాంపు రుసుము తీసుకోరాదు, ఇందులో కొన్ని నిజాం ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం కలిగించేవి కూడా ఉన్నాయి. అయినా కూడా ప్రజలకు మంచి కొరకు ఈ చిత్తు శాసనములు ప్రవేశపెట్టి ప్రాంతం కోసం పని చేసిన ప్రజా నాయకుడు కొండా వెంకట రంగారెడ్డి. ఇటువంటి వీరులెందరో మన ప్రాంతాన్ని రజాకార్ల నుండి విముక్తి చేసి భారతదేశంలో అంతర్భాగం చెయ్యడానికి పోరాటాలు చేషిన్రు. వారి ఆశయసాధన దిశగా బ్రతకడమే వారికి మనమిచ్చే ఘనమైన నివాళి. జై తెలంగాణ. జై భారత్.
నిజాం పాలన నుంచి, రజాకార్ల దౌర్జన్యాల నుంచి తెలంగాణ ప్రజలు ఊపిరి తీసుకొని 75 ఏండ్లు అవుతున్నది. హైదరాబాద్ స్వాతంత్ర్య ఉద్యమంలో ఎంతో మంది వీరులు భాగస్వాములయ్యారు. తమదైన పోరాట పంథాతో తెలంగాణ ప్రజల విముక్తి కోసం పాటుపడ్డారు. పోలీస్ చర్య గురించి అందరికీ తెలిసిందే. దానికి దారితీసిన పరిణామాలు, రజాకార్ల దౌర్జన్యాల గురించి అప్పటి భారత ప్రభుత్వం దృష్టికి ఈ ప్రాంత బిడ్డలు తీసుకువెళ్లిన విషయాలు చాలా వరకు బయట తెలియవు. ఈ సెప్టెంబర్ 17ను పురస్కరించుకొని ఒక్కసారి చరిత్ర లోతులను స్పృశిస్తే..అనేక విషయాలు అవగతమవుతాయి.
కొండా, బూర్గులకు మాటిచ్చిన సర్దార్ పటేల్
నెహ్రూకు చెప్తే ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అప్పటి హోంమంత్రి సర్దార్ పటేల్ ను కలిసి ఇక్కడి పరిస్థితులు వివరించాలని కె.ఎం. మున్షీ ఇచ్చిన ఒక సలహా తో డెహ్రాడూన్ లో ఉన్న సర్దార్ పటేల్ ను కె.వి. రంగారెడ్డి, బూర్గుల రామకృష్ణా రావు కలిసి, నెహ్రూతో జరిగిన సంభాషణ గురించి చెప్పారు. సత్వరం చర్యలు తీసుకోవాలని కోరారు. పటేల్ హైదరాబాద్ స్టేట్ లో జరుగుతున్న అరాచకాలు, దౌర్జన్యాల గురించి సీరియస్ గా విని, తన చేతితో బల్లమీద కోపంతో గుద్ది..‘రజాకార్లు, రజాకార్ల నిర్బంధంలో ఉన్న నిజాం ప్రభుత్వం హైదరాబాద్ ప్రజలను ఏమీ చేయలేదు, మేము మీకు తోడుగా ఉంటాము' అని కోపంతో గర్జించాడు. సాధ్యమైనంత తొందరగా చర్య తీసుకుంటామని ధైర్యం చెప్పాడు. సర్దార్ పటేల్ భరోసా మాటలు విన్న వారు ఉత్సాహంతో హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం సర్దార్ పటేల్ పోలీస్ చర్యకు ఆదేశాలు ఇచ్చాడు. పోలీస్ చర్య మొదలు కావడం కొద్దిగా ఆలస్యం అయ్యింది. అప్పుడు పాకిస్థాన్ తో యుద్ధం జరుగుతుంది, వర్షాలు కూడా ఒక కారణం. ఎందుకంటే వర్షంలో మిలిటరీ యుద్ధ ట్యాంకులు హైదరాబాద్ చేరలేవు.
రజాకార్ల అరాచకాలు
రజాకార్ల నిర్బంధంలోకి వెళ్లిపోయిన నిజాం ప్రభుత్వం‘స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్’ కు విరుద్ధంగా ప్రవర్తించసాగింది. రజాకార్ల సైన్యాధ్యక్షుడు ఖాసీం రజ్వీ భారతదేశంతో యుద్ధం చేయడానికి ఆయుధాలను కూడా రహస్యంగా సేకరించడం మొదలు పెట్టిండు. అన్నిటికి మించి, హైదరాబాద్ స్వాతంత్ర్య ఉద్యమాన్ని నిరంకుశంగా అణచడానికి రాజాకార్లు కుట్ర చేస్తున్నారు. వాళ్లు అత్యంత క్రూరంగా జనంపై విరుచుకుపడ్డారు. హైదరాబాద్ సంస్థానాన్ని ముస్లిం రాజ్యంగా మార్చాలనే ఉద్దేశంతో ఖాసీం రిజ్వీ నాయకత్వంలోని రజాకార్లు గ్రామాల మీద పడి ఆడబిడ్డల మాన ప్రాణాలను దోచుకున్నారు. ఎదురొచ్చిన, ఎదురు మాట్లాడినా నిలబెట్టి సామూహికంగా కాల్పులు జరిపారు. రజాకార్ల గుర్రపు డెక్కల చప్పుడు వింటేనే.. జనం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ దాక్కుంటున్న సందర్భం.
‑ కొండా విశ్వేశ్వర్ రెడ్డి,
మాజీ ఎంపీ, చేవెళ్ల