హైదరాబాద్ లో దారుణం.. కూతురిని ప్రేమిస్తున్నాడని తండ్రి ఏకంగా పెట్రోల్ తో దాడి..

అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. తమ కూతురిని ప్రేమిస్తున్నాడన్న కోపంతో ప్రదీప్ అనే వ్యక్తి ఇంటిపై పెట్రోల్ తో దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో ప్రదీప్ ఇంట్లో లేకపోవడంతో అతని తల్లిదండ్రులుప్రకాష్,హేమలత లపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. అదే సమయంలో అక్కడే ఉన్న నాలుగేళ్ల చిన్నారి చాందినిపై పెట్రోల్ పడడంతో కాలి స్వల్పంగా గాయాలయ్యాయి.

పెట్రోల్ దాడిలో 50% గాయపడిన ప్రకాష్ ను హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాక్షికంగా కాలిన గాయాలతో హేమలత బయటపడగా చిన్నారి సైతం కాలిన గాయాలతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. నిన్న రాత్రి 8 గంటల సమయంలో ప్రదీప్ ఇంటికి వచ్చిన నందకుమార్,లక్ష్మీ, మరికొందరు యువకులు వారి వెంట తెచ్చిన పెట్రోల్ బాటిల్ ను ఇంట్లో వారిపై చల్లి నిప్పంటించారు. 

ఈ ఘటన జరిగిన సమయంలో ప్రదీప్ ఇంట్లో లేకపోవడంతో అతని కుటుంబ సభ్యులపై పెట్రోల్ పోసి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఎంటమాలజీ విభాగంలో పని చేస్తున్న ప్రదీప్ నందకుమార్ లక్ష్మి ల కుమార్తె ను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడన్న కోపంతో అతనిపై దాడి చేయాలని భావించి వారి కుటుంబ సభ్యులపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న అల్వాల్ పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు ప్రారంభించారు. ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.