
- మృతదేహాన్ని బయటపడేసిన దుకాణం యజమానులు
- తమ వైన్స్‌లో మందు తాగలేదని బుకాయింపు
- సీసీటీవీ ఫుటేజీలతో బయటపడిన నిజం
- మందు సీసాలను సీజ్ చేసిన ఎక్సైజ్ అధికారులు
- కల్తీ జరిగి ఉంటుందని పోలీసుల అనుమానం
రాజన్న సిరిసిల్ల, వెలుగు: వైన్స్ పర్మిట్ రూంలో మందు తాగి ఓ వ్యక్తి చనిపోయాడు. అది తమ మీద ఎక్కడ పడుతుందోనని వైన్స్ షాపు వాళ్లు.. ఆ మృతదేహాన్ని తీసుకెళ్లి బయటపడేశారు. తమ షాపులో మందు కొనలేదని బుకాయించారు. సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించగా ఆ వైన్స్‌లోనే మందు కొన్నట్టు, ఆ షాపు పర్మిట్రూంలోనే చనిపోయినట్టు తేలింది. ఈ దారుణ ఘటన మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగింది. ఇదే ఘటనలో మరో వ్యక్తి అనారోగ్యంపాలై ఆస్పత్రిలో చికిత్స
పొందుతున్నాడు. ఘటనపై పోలీసులు కేసు
దర్యాప్తు చేస్తున్నారు.
లూజ్‌గా మందు అమ్మకాలు
పర్మిట్ రూంలో రూల్స్‌కు విరుద్ధంగా మందును అమ్ముతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బార్లలో లాగా టేబుళ్లు, బెంచీలు వేసి పెగ్‌ల లెక్కన లూజ్ మద్యాన్నీ అమ్ముతున్నట్టు అక్కడి వారు చెప్తున్నారు. అంతేగాకుండా మందులోకి మంచింగ్ ఫుడ్‌ను కూడా అమ్ముతున్నారని అంటున్నారు. ఊరోళ్ల ఆందోళనతో షాపు నిర్వాహకులు చనిపోయిన వ్యక్తి కుటుంబానికి రూ.2 లక్షలు ఇచ్చినట్టు తెలుస్తోంది. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులున్నారు.
మందు సీసాలు సీజ్
ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన మెర్గు శ్రీనివాస్ (42), సిరిసిల్లకు చెందిన సంజు అనే ఇద్దరు కార్తికేయ వైన్స్‌లో మందు కొని.. పక్కనే ఉన్న పర్మిట్ రూంలోకి వెళ్లి తాగారు. కొద్దిసేపటికే ఇద్దరూ అనారోగ్యం పాలయ్యారు. కిందపడిపోయారు. అది గమనించిన వైన్ షాపు వాళ్లు.. ఇద్దరినీ తీసుకెళ్లి బయటపడేశారు. 108కి ఫోన్ చేసి రప్పించారు. వాళ్లు వచ్చి పరీక్షించి శ్రీనివాస్ అప్పటికే చనిపోయినట్టు తేల్చారు. సంజును ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన గూడెం గ్రామస్తులు, శ్రీనివాస్ కుటుంబ సభ్యులు వైన్ షాపు ముందు ఆందోళనకు దిగారు. అనారోగ్యం పాలైతే ఆస్పత్రికి పంపించాల్సింది పోయి బయట పడేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వాళ్లకు నచ్చజెప్పి నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. షాపులో తనిఖీలు చేసిన ఎక్సైజ్ అధికారులు మందు సీసాలను సీజ్ చేశారు. మందును కల్తీ చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మందు శాంపిళ్లను తీసుకున్నారు.